MIw vs UPw: నాట్‌సీవర్‌ బ్రంట్‌ అర్ధ శతకం.. యూపీ లక్ష్యం 183

యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇన్నింగ్స్‌ ముగిసింది. 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Updated : 24 Mar 2023 21:20 IST

ముంబయి: యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. నాట్‌సీవర్‌ బ్రంట్‌ (72 నాటౌట్‌; 38 బంతుల్లో 9×4, 2×6) అర్ధ శతకంతో చెలరేగగా.. ఓపెనర్లు యాస్తికా భాటియా (21), హెయిలీ మ్యాథ్యూస్‌ (26), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (14), కేర్‌ (29) పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. అంజలి శ్రావణి, పర్షవి చోప్రా చెరో వికెట్‌ తీశారు.

బ్యాటింగ్‌ ప్రారంభించిన ముంబయి.. ఆది నుంచే ఇన్నింగ్స్‌ నెమ్మదిగా మొదలు పెట్టింది. ఓపెనర్లు భాటియా, మ్యాథ్యూస్‌ ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని అంజలి శ్రావణి విడగొట్టింది. ఐదో ఓవర్‌ రెండో బంతికి కిరణ్‌ నవగిరేకి క్యాచ్ ఇచ్చి భాటియా వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రంట్‌తో  కలిసి మ్యాథ్యూస్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. కానీ, జట్టు స్కోరు 69 పరుగుల వద్ద చోప్రా బౌలింగ్‌లో కిరణ్‌ నవగిరే చేతికే చిక్కింది.

కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో  జట్టు భారాన్ని బ్రంట్‌ తనపై వేసుకుంది. క్రీజులో నిలదొక్కుకుంటూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించింది. థర్డ్‌ డౌన్‌లో వచ్చిన కేర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. అవతలి ఎండ్‌లో వస్తున్నవారు తక్కువ పరుగులకే వెనుదిరుగుతున్నా.. బ్రంట్‌ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడింది. దీంతో ముంబయి 183 పరుగుల లక్ష్యాన్ని యూపీ ముందు ఉంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని