Mohammed Kaif: షమి తమ్ముడొస్తున్నాడు.. ఎవరీ కైఫ్‌

మహమ్మద్‌ షమి కుటుంబం నుంచి మరో పేసర్‌ దూసుకొస్తున్నాడు. అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకుంటూ.. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. 

Updated : 09 Jan 2024 16:10 IST

మహమ్మద్‌ షమి (Mohammed Shami).. టీమ్‌ఇండియాలో ప్రధాన బౌలర్‌. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. భారత్‌ ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టెస్టులు, టీ20ల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అతను గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో అతడు లేని లోటు కనిపించింది. ఇప్పుడు షమి బాటలోనే సాగుతూ.. అతడి కుటుంబం నుంచి మరో పేసర్‌ దూసుకొస్తున్నాడు. అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకుంటూ.. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. బెంగాల్‌ తరపున రంజీ అరంగేట్రం చేశాడు. అతనే.. మహమ్మద్‌ కైఫ్‌ (Mohammed Kaif).. షమి లాగే ఫాస్ట్‌బౌలర్‌ అయిన కైఫ్‌.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

అన్న స్ఫూర్తితో..

అన్న షమి లాగే కైఫ్‌కు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే పిచ్చి. తనకంటే ఆరేళ్ల పెద్దవాడైన షమి.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతుండటం చూసి అతడు స్ఫూర్తి పొందుతున్నాడు. టీమ్‌ఇండియాకు ఆడాలనే లక్ష్యంతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 27 ఏళ్ల కైఫ్‌.. మంచి వేగం, సీమ్, స్వింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ రైటార్మ్‌ పేసర్‌ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ తొమ్మిది లిస్ట్‌- ఎ మ్యాచ్‌ల్లో 26.33 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో పుట్టిన అతడు.. 2021లో జమ్ముకశ్మీర్‌తో మ్యాచ్‌తో బెంగాల్‌ తరఫున లిస్ట్‌- ఎ అరంగేట్రం చేశాడు. గతేడాది విజయ్‌ హజారే టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గోవాపై మూడు వికెట్లు రాబట్టాడు. బరోడా, తమిళనాడు, పంజాబ్, హరియాణాపై రెండు వికెట్ల చొప్పున సాధించాడు. అంతకంటే ముందు 2021 బెంగాల్‌ టీ20 ఛాలెంజ్‌ టోర్నీలో ఖరగ్‌పూర్‌ బ్లాస్టర్స్‌ తరపున 25.85 సగటుతో 7 వికెట్లతో రాణించాడు. గత నెలలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో అతడు అమ్ముడుపోలేదు. కానీ ఇప్పుడు రంజీ అరంగేట్రంతో అతని కెరీర్‌ పుంజుకునే అవకాశముంది. గురువారం విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఆంధ్రాతో ఆరంభమైన రంజీ మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో కైఫ్‌ అడుగుపెట్టాడు.

అండగా షమి..

టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలనే చిన్న తమ్ముడు కైఫ్‌ కల నెరవేరే దిశగా షమి అండగా నిలుస్తున్నాడు. కలిసి సాధన చేయడంతో పాటు, అవసరమైన సలహాలు, సూచనలిస్తూ తమ్ముడి బౌలింగ్‌ మెరుగవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అన్ని వేళలా మద్దతునిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సోదరులు ఇద్దరు కలిసి స్వగ్రామంలో ప్రాక్టీస్‌ చేశారు. దీంతో ప్రపంచ స్థాయి పేసర్‌గా ఎదిగిన అన్నతో కలిసి సాధన చేయడం అతడికి ఎంతగానో కలిసొచ్చింది. అతని వేగం పెరిగింది. కచ్చితత్వంతో సరైన లెంగ్త్‌లో బంతులు వేయడంపై పట్టు చిక్కింది. బ్యాటింగ్‌ కూడా చేయగల నైపుణ్యాలున్న అతను ఆల్‌రౌండర్‌గానూ సత్తాచాటేందుకు చూస్తున్నాడు. తన ప్రతిభ, కష్టం చూస్తుంటే అత్యున్నత స్థాయికి వెళ్లేలాగే కనిపిస్తున్నాడు. ‘‘సుదీర్ఘ కాలం పోరాటం తర్వాత నువ్వు ఎట్టకేలకు బెంగాల్‌ తరపున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశావు. ఛీర్స్‌! ఇదో గొప్ప ఘనత. నీకు అభినందనలు. నీ భవిష్యత్‌ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా. వంద శాతం ప్రదర్శన ఇవ్వు. కష్టపడుతూనే ఉండూ. మెరుగ్గా ఆడు’’ అని కైఫ్‌ను ఉద్దేశించి అతడితో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షమి పోస్టు చేశాడు. షమి స్థాయి కారణంగా కలిగే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగలిగితే కైఫ్‌కు మంచి భవిష్యత్‌ ఉంటుందనే చెప్పాలి. అన్న అంతర్జాతీయ బౌలర్‌ కాబట్టి, అతడు ఏ మాత్రం పేలవ ప్రదర్శన చేసినా ట్రోలింగ్, విమర్శలు తప్పకవపోచ్చు. అందుకే ఇతర విషయాలను పక్కనపెట్టి, కేవలం బౌలింగ్‌పైనే దృష్టి సారిస్తే అనుకున్న గమ్యానికి చేరొచ్చు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని