Mohammed Shami: ఆ లోటును పూరిస్తూ.. వచ్చేశాడు ఐసీసీ స్టార్‌

Eenadu icon
By Sports News Team Updated : 21 Feb 2025 14:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

మహ్మద్‌ షమి (Mohammed Shami).. భారత జట్టులో కీలక పేసర్‌! 2023 వన్డే ప్రపంచకప్‌లో అదిరే ప్రదర్శనతో జట్టు ఫైనల్‌ చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. కానీ.. గాయం అతడిని చాలా నెలలు టీమ్‌ఇండియాకు దూరం చేసింది. ఇటీవలే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పునరాగమనం చేశాడు. అయితే అతడికి అసలైన గ్రాండ్‌ ఎంట్రీ ఛాంపియన్స్‌ ట్రోఫీతోనే లభించింది. బంగ్లాదేశ్‌తో తొలి పోరులో అదిరే బౌలింగ్‌తో అయిదు వికెట్ల ప్రదర్శన చేశాడీ పేసర్‌. ఐసీసీ టోర్నీలు తనకు మరోసారి కలిసొస్తాయని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు. 

అదే పేస్‌.. అదే పదును

ఐసీసీ టోర్నమెంట్‌ అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ షమి మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా చాలా తేలిగ్గా వికెట్లు పడగొడతాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో అతడు బంతిని బ్యాక్‌ ఆఫ్‌ లెంగ్త్, షార్ట్‌ లెంగ్త్‌ వేస్తూ బ్యాటర్లను బుట్టలో వేస్తున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో షమి ఇదే సూత్రాన్ని ఉపయోగించాడు. వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌తో బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు. షాట్‌ కొట్టేలా ప్రేరేపించి బ్యాటర్లు తప్పు చేసేలా చేశాడు. గాయం తర్వాత లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను కాస్త సర్దుకోవడం కూడా అతడికి కలిసొచ్చింది. మరోసారి ఐసీసీ టోర్నీల్లో అయిదు వికెట్ల ఘనత సాధించాడు.

ఐసీసీ వన్డే టోర్నీల్లో 60 వికెట్లు తీసిన అతడు జహీర్‌ఖాన్‌ను దాటి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో వన్డే ఫార్మాట్లో 200 వికెట్లు సాధించి మరో మైలురాయి అందుకున్నాడు. విజ్డన్‌ ప్రకారం 50 ఓవర్ల ప్రపంచకప్, ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఉత్తమ సగటు, ఉత్తమ వికెట్‌ టేకింగ్‌ స్ట్రెక్‌రేట్‌ కూడా షమి పేరిటే నమోదైంది. ఐసీసీ వన్డే ఈవెంట్లలో షమి పేరిట అయిదు అయిదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయంటే అతడి స్థిరత్వాన్ని ఊహించొచ్చు. మెక్‌గ్రాత్, షేన్‌వార్న్, ముత్తయ్య మురళీధరన్‌ లాంటి దిగ్గజాల కంటే ఉత్తమైన స్ట్రెక్‌రేట్‌ షమిదే కావడం విశేషం.

బుమ్రాకు బదులు..

జస్ప్రీత్‌ బుమ్రా గత కొంతకాలంగా భారత బౌలింగ్‌కు చుక్కానిగా ఉన్నాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో టీమ్‌ఇండియాను గెలిపించాడు. కానీ బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో అయిన గాయం అతడిని మైదానానికి దూరం చేసింది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఆడలేకపోవడంతో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి కూడా తప్పుకొన్నాడు. దీంతో పునరాగమనం చేసిన షమిపై పెద్ద భారం పడింది. ఒకవైపు సత్తా చాటాలి.. ఇంకోవైపు యువ బౌలర్లతో కూడిన పేస్‌ దళాన్ని నడిపించాలనే బాధ్యతతో ఈ బెంగాల్‌ బౌలర్‌ బరిలో దిగాడు. తొలి మ్యాచ్‌లోనే అతడు తన బాధ్యతను గొప్పగా నిర్వర్తించాడు.

ఒకవైపు అదిరే బౌలింగ్‌తో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కకావికలం చేయడమే కాక.. యువ పేసర్‌ హర్షిత్‌ రాణాకు స్ఫూర్తినిచ్చి అతడూ చెలరేగేలా చేశాడు. దీంతో బుమ్రా లేని లోటు అభిమానులకు తెలియలేదు. అయితే షమి పని ఇక్కడితో అయిపోలేదు. ముందుంది అసలు సవాల్‌! ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అతడు ఇదే జోరును ప్రదర్శించాల్సి ఉంది. టోర్నీ ఆసాంతం బౌలింగ్‌ దళాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. మరి ఈ పరీక్షలో అతడు ఎంతవరకు సఫలం అవుతాడో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :
Published : 21 Feb 2025 14:14 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని