Mohit Sharma: ఆ రాత్రి నిద్రపట్టలేదు.. నా ప్లాన్‌ అదే కానీ మిస్‌ఫైర్‌ అయింది: మోహిత్

ఐపీఎల్ 2023 సీజన్‌ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఛాంపియన్‌గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌ (GT) చివరి ఓవర్‌లోని నాలుగో బంతి వరకు ఆధిక్యంలో నిలిచినా.. మిగిలిన రెండు బంతులే ఆ జట్టును ఓడించాయి. జీటీ బౌలర్‌ మోహిత్ శర్మకు పీడకలను మిగిల్చాయి.

Published : 01 Jun 2023 10:32 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆఖరి రెండు బంతులు.. రెండోసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలను దూరం చేశాయి. అప్పటిదాకా చేతిలో ఉన్న మ్యాచ్‌ ఒక్కసారిగా దూరమైంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ఫైనల్‌ (IPL 2023) మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK vs GT) విజేతగా నిలిచింది. ఐదో సారి కప్‌ను సొంతం చేసుకుంది. చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా.. గుజరాత్ బౌలర్‌ మోహిత్ శర్మ  వేసిన ఐదు, ఆరు బంతులను సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సిక్స్‌, ఫోర్‌గా మలిచాడు. అప్పటి వరకు అద్భుతంగా బంతులు వేసిన మోహిత్‌ శర్మకు షాక్‌ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ జరిగిన రాత్రి తనకు నిద్రే పట్టలేదని, ఇంకాస్త విభిన్నంగా చేసి ఉంటే బాగుండదేని ఆలోచిస్తూనే ఉన్నట్లు మోహిత్ శర్మ తెలిపాడు. చివరి ఓవర్‌ కోసం తన ప్రణాళికలు, సన్నద్ధత పై ఓ ఛానెల్‌తో మోహిత్ మాట్లాడాడు. 

‘‘ఓవర్‌ వేయడానికి ముందు నేను చాలా స్పష్టతతో ఉన్నా. ఇలాంటి పరిస్థితులకు అనుగుణంగా నెట్స్‌లో చాలా శ్రమించా. గతంలోనూ ఇలాంటివి ఎదుర్కొన్న అనుభవం ఉంది. అన్ని బంతులను యార్కర్లుగా వేస్తానని ముందే చెప్పా. చివరి రెండు బంతులు వేయకముందు జట్టు సభ్యులతో మాట్లాడినప్పుడు కూడా యార్కర్‌ వేయనున్నట్లు చెప్పా. తొలి నాలుగు బాల్స్‌ను అనుకున్నవిధంగానే వేశా. ఐదో బంతిని కూడా యార్కర్‌గా సంధిద్దామని ప్రయత్నించా. కానీ, బంతి అనుకొన్న చోట పడలేదు. రవీంద్ర జడేజా దానిని సిక్స్‌గా మలిచాడు. చివరి బంతి లెగ్‌ వికెట్‌ యార్కర్‌గా ప్రయత్నించినా.. విఫలం కావడంతో జడ్డూ బౌండరీకి తరలించాడు.  ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన రోజు నిద్రే పట్టలేదు. ఆ బంతిని అలా వేసి ఉంటే బాగుండేది. ఇలా వేసి ఉంటే బాగుండేదని ఆలోచిస్తూనే ఉండిపోయా. విజయం కోసం శాయశక్తులా కృషి చేసినా ఫలితం అనుకూలంగా రాలేదు.

ఈ సీజన్‌లో నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడం వెనుక అనిరుధ్‌ చౌధరీదే కీలక పాత్ర. టోర్నీకి ముందు నేనేం చేయగలను? మంచి ప్రదర్శనను కొనసాగించగలనా..? అనే అనుమానాలు ఉండేవి. కానీ, అనిరుధ్ భాయ్‌ మాత్రం నాపై భరోసా ఉంచాడు. తప్పకుండా రాణిస్తాననే నమ్మకం కలిగించాడు. ఈసారి మెగా లీగ్‌లోకి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగా. నా పనిపట్ల ఎప్పుడూ నిర్లక్ష్యంగా లేను. టోర్నీ ఆసాంతం ఎంజాయ్‌ చేశా’’ అని మోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో మోహిత్ 14 మ్యాచుల్లోనే 27 వికెట్లు తీసి అదరగొట్టాడు. సగటులోనూ (13.37) అందరికంటే తక్కువ కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని