Most Expensive Bowlers : ఐపీఎల్‌లో బ్యాటర్ల ఊచకోతకు బలైన బౌలర్లు వీరే..

ఐపీఎల్‌(IPL) చరిత్రలోనే ఒకే ఓవర్‌లో, 4 ఓవర్ల స్పెల్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకుని బ్యాటర్ల ఊచకోతకు గురైన బౌలర్ల (Most Expensive bowlers) గురించి తెలుసుకుందామా..

Updated : 23 Apr 2023 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ఐపీఎల్‌ (IPL) అంటేనే ధనాధన్ ఆట. ఓవైపు బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడాలి. మరోవైపు అదే స్థాయిలో బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులతో వారిని నిలువరిస్తూ ఉండాలి. అయితే.. ఒక్కోసారి బౌలర్లు.. బ్యాటర్ల ఊచకోతకు గురవుతూ ఉంటారు. శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి యువ పేసర్‌ అర్జున్‌ తెందూల్కర్‌ ఒకే ఓవర్‌లో 31 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్‌ గమనమే మారిపోయి.. ముంబయి ముందు పంజాబ్‌ భారీ టార్గెట్‌ను ఉంచింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చి బ్యాడ్‌ రికార్డు నమోదు చేసిన బౌలర్ల (Most Expensive Bowlers) గురించి తెలుసుకుందామా..

ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు..

  1. హర్షల్‌ పటేల్‌ : ఈ బెంగళూరు బౌలర్‌ 2021లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 37 పరుగులు ఇచ్చి ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ ఓవర్‌లో అతడు ఇచ్చిన పరుగులు 6 6 nb6 6 2 6 4. ఈ ఓవర్‌లో రవీంద్ర జడేజా 36 పరుగులను సాధించగా.. ఒక పరుగు నో బాల్‌ రూపంలో వచ్చింది. 
  2. ప్రశాంత్‌ పరమేశ్వరన్‌ : 2011లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కొచ్చి టస్కర్స్‌ జట్టు బౌలర్‌ పరమేశ్వరన్‌ బౌలింగ్‌ను భారీ హిట్టర్‌ క్రిస్‌గేల్‌ ఊచకోత కోశాడు. దీంతో ఒకే ఓవర్‌లో 37 (6 nb 6 4 4 6 6 4) పరుగులు వచ్చాయి.
  3. డేనియల్‌ సామ్స్‌ : 2022లో ముంబయి ఇండియన్స్‌ బౌలర్‌ డేనియల్‌ సామ్స్‌ కోల్‌కతాపై ఒకే ఓవర్‌లో 35 పరుగులు (6 4 6 6 nb2 4 6) ఇచ్చి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఆ ఓవర్‌లో ప్యాట్‌ కమిన్స్‌ దంచి కొట్టి 34 పరుగులు రాబట్టాడు.
  4. రవి బొపారా : 2010లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఈ పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో క్రిస్‌ గేల్‌ 25, మనోజ్‌ తివారి 2 పరుగులు చేయగా.. మిగతావి వైడ్ల రూపంలో వచ్చాయి.
  5. పర్విందర్‌ ఆవానా : 2014లో చెన్నైతో జరిగిన ఓ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ పర్విందర్‌ 33 పరుగులు (6 6 4 4 nb4 4 4) ఇచ్చాడు. సురేశ్‌ రైనా ఈ ఓవర్‌లో 32 పరుగులు సాధించాడు.
  6. యశ్‌ దయాల్‌ : ప్రస్తుత సీజన్‌ (IPL 2023)లోనే కోల్‌కతా ఆటగాడు రింకూ సింగ్‌ చివరి ఓవర్‌లో వరుసగా 5 సిక్స్‌లు బాది.. ఆ జట్టుకు గొప్ప విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఆ ఓవర్‌ బాధితుడు యశ్‌ దయాల్‌ (31 పరుగులు). తొలి బంతికి సింగిల్‌ రాగా.. మిగిలిన ఐదు బంతులు మైదానం ఆవల పడ్డాయి.
  7. అర్జున్‌ తెందూల్కర్‌ : శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి బౌలర్‌ అర్జున్‌ ఒకే ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చాడు. రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు సహా ఒక నోబాల్, ఒక వైడ్, సింగిల్‌ ఇచ్చేశాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు..

  1. బాసిల్‌ థంపి.. : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎన్నోసార్లు చిన్న లక్ష్యాలనూ కాపాడుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఒక స్పెల్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు కూడా ఆ జట్టు బౌలర్‌పైనే ఉంది. బాసిల్‌ థంపి.. తన 4 ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. 2018వ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. 
  2. యశ్‌ ధయాల్‌..: ఈ గుజరాత్‌ బౌలర్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్‌లోనే ఇది చోటుచేసుకుంది. కోల్‌కతా బ్యాటర్‌ రింకు సింగ్‌ ఊతకోతకు బలై ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు సమర్పించుకున్నాడు. ఇలా మొత్తం 4 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
  3. ఇషాంత్‌ శర్మ : అప్పట్లో సన్‌రైజర్స్‌కు ఆడిన ఇషాంత్‌ శర్మ కూడా అత్యధిక పరుగులు ఇచ్చి ఈ జాబితాలో చేరాడు. 2013లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 4 ఓవర్ల స్పెల్‌లో 66 పరుగులు ఇచ్చాడు.
  4. ముజ్‌బిర్‌ రహ్మాన్‌ : 2019 సీజన్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ రహ్మాన్‌ను సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఉతికారేశారు. ఇలా అతడు తన 4 ఓవర్ల కోటాలో 16.50 ఎకానమీతో మొత్తం 66 పరుగులు ఇచ్చేశాడు.
  5. ఉమేశ్‌ యాదవ్‌ : దిల్లీకి ఆడిన సమయంలో ఉమేశ్‌ యాదవ్‌.. ఆర్సీబీకి తన 4 ఓవర్ల స్పెల్‌లో 65 పరుగులు సమర్పించుకున్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని