IPL 2023 : కోట్లు పెట్టి కొన్నా.. కొట్టింది కొందరే..

ఈ ఐపీఎల్‌(IPL 2023) సీజన్‌ వేలంలో ఎక్కువ మొత్తాన్ని దక్కించుకుని అందరి దృష్టినాకర్షించారు. అయితే.. వారి ఆట తీరు ఎలా ఉందంటే..

Updated : 31 May 2023 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : దాదాపు రెండు నెలలపాటు జరిగిన ఐపీఎల్‌(IPL 2023) క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించింది. విజేతగా చెన్నై(Chennai Super Kings) ఐదోసారి నిలిచి.. ముంబయి రికార్డును సమం చేసింది. ఇక ఈ సీజన్‌లో రింకుసింగ్‌, యశస్వి జైస్వాల్‌ లాంటి ఆటగాళ్లు ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి అద్భుత ప్రదర్శన చేయగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న మరికొందరు నిరాశ పరిచారు. మరి వేలంలో ఎంతో వెచ్చించి ఆయా జట్లు సొంతం చేసుకున్న ఆటగాళ్ల(Most expensive players) పరిస్థితి ఏంటి.. వాళ్లు ఎలాంటి ప్రదర్శన ఇచ్చారు.. పరిశీలిస్తే..

  • సామ్‌ కరన్‌(Sam Curran).. నిరాశ పరిచాడు(రూ.18.5 కోట్లు) : ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేసిన ఆటగాడిగా సామ్‌ కరన్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పంజాబ్‌ జట్టు ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ ఆల్‌రౌండర్‌ తీవ్రంగా నిరాశపరిచాడనే చెప్పొచ్చు. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 276 పరుగులు చేయగా.. అందులో ఒక్కటే అర్ధ శతకం ఉంది. ఇంక బంతితోనూ రాణించింది లేదు. మొత్తం 10 వికెట్లు తీయగా.. ఇందులో అత్యుత్తమం 3/31. ఇక ధావన్‌ లేని సమయంలో పలు మ్యాచ్‌లకు కెప్టెన్‌గాను వ్యహవరించాడు. అయితే.. కష్ట సమయాల్లో జట్టును ఆదుకున్నదీ లేదు. పంజాబ్‌ ఈ సీజన్‌లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.
  • కామెరూన్‌ గ్రీన్‌(Cameron Green).. న్యాయం చేశాడు (రూ.17.50 కోట్లు) : ఈ సీజన్‌లో అత్యధిక ధర పెట్టి గ్రీన్‌ను ముంబయి సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో అతడికిదే తొలి సీజన్‌ అయినప్పటికీ.. జట్టుకు న్యాయం చేశాడనే చెప్పొచ్చు. 16 మ్యాచ్‌లు ఆడి మొత్తం 452 పరుగులు చేసి.. ముంబయి తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో ఒక శతకం, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. సన్‌రైజర్స్‌పై 47 బంతుల్లో అతడు శతకం చేసి అద్భుత విజయాన్ని అందించి  జట్టును ప్లేఆఫ్స్‌ రేసులో నిలిపాడు. అయితే.. కీలకమైన క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో మాత్రం పెద్దగా రాణించలేదు. ఈ ఆల్‌రౌండర్‌  బంతితోనూ 6 వికెట్లు తీసుకున్నాడు.
  • బెన్‌స్టోక్స్‌(Ben Stokes).. ఆడింది లేదు..(రూ.16.25 కోట్లు) : ఇంగ్లాండ్‌ జట్టుకు ప్రపంచకప్‌లు అందించిన బెన్‌స్టోక్స్‌ తమ జట్టుకు కలిసివస్తాడని చెన్నై భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే.. ఈ ఆల్‌రౌండర్‌ ఆడింది రెండు మ్యాచ్‌లే. చేసింది 15 పరుగులే. గాయం కారణంగా జట్టుకు దూరమై.. ఆ తర్వాత పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.
  • సత్తా చాటిన నికోలస్‌ పూరన్‌(Nicholas Pooran).. (రూ.16 కోట్లు) : గతంలో పలు జట్లకు ఆడినా.. పెద్దగా ప్రభావం చూపని పూరన్‌ ఈ సీజన్‌లో లఖ్‌నవూ జట్టుకు మాత్రం రాణించాడనే చెప్పాలి. తన భారీ హిట్టింగ్‌తో అవసరమైన సమయంలో పరుగులు అందించాడు. ఇక బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో  పూరన్‌ (62; 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగాడు. 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 172 స్ట్రైక్‌ రేట్‌తో జట్టులో ఎక్కువ పరుగులు చేసిన(358) మూడో ఆటగాడు ఇతడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
  • సెంచరీ తప్ప చేసిందేమీ లేదు.. హ్యారీ బ్రూక్‌(Harry Brook) (రూ.13.25 కోట్లు) : సన్‌రైజర్స్‌ ఈ ఆటగాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే.. బ్రూక్‌ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. కోల్‌కతాపై సెంచరీ మినహా ఏ మ్యాచ్‌లోనూ రాణించలేదు. మొత్తం 11 మ్యాచ్‌ల్లో ఆడగా.. అతడు చేసిన శతకం పరుగులు తీసేస్తే.. కొట్టింది 90 మాత్రమే. దీంతో అతడి ప్రదర్శన ఎలా సాగిందో అర్థమవుతుంది.
  • మయాంక్‌ అగర్వాల్‌(Mayank Agarwal).. రాణించింది లేదు (రూ.8.25 కోట్లు) : సన్‌రైజర్స్‌ వైఫల్యాలకు ప్రధాన కారణం టాప్‌ ఆర్డర్‌ విఫలమవడం. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్‌ పెద్దగా రాణించింది లేదు. లీగ్‌ చివరి మ్యాచ్‌లో ముంబయిపై 83 పరుగుల ప్రదర్శన తప్పితే.. ఎక్కడా ఆకట్టుకోలేదు. మొత్తం పది మ్యాచ్‌లు ఆడి 270 పరుగులు చేశాడు.
  • శివమ్‌ మావి(Shivam Mavi).. ఆడే అవకాశమే రాలేదు (రూ.6 కోట్లు) : గుజరాత్‌ టైటాన్స్‌ రూ.6 కోట్లు వెచ్చించి శివమ్‌ మావిని తీసుకుంది. అయితే.. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.
  • జేసన్‌ హోల్డర్‌.. మెరవలేదు(Jason Holder) (రూ.5.75 కోట్లు) : ఈ ఆల్‌రౌండర్‌ రాజస్థాన్‌ జట్టు తరఫున పెద్దగా రాణించలేదు. 8 మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీయగా.. చేసిన పరుగులు 12 మాత్రమే.
  • ముఖేశ్‌ కుమార్‌(Mukesh Kumar) (రూ.5.50 కోట్లు) : ఈ దిల్లీ బౌలర్‌ పది మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు మాత్రమే తీశాడు.
  • సన్‌రైజర్స్‌లో ఒకేఒక్కడు.. హెన్రిక్‌ క్లాసెన్‌(Heinrich Klaasen)(రూ.5.25 కోట్లు) : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో నిలకడగా రాణించిన బ్యాట్స్‌మన్‌ ఎవరైనా ఉన్నారంటే.. అది క్లాసెన్‌ మాత్రమే. మిగతా బ్యాటర్లందరూ విఫలమైనా.. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం 12 మ్యాచ్‌లు ఆడి 448 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసింది కూడా క్లాసనే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని