IPL Technology: ఇది ఐపీఎల్‌ టెక్నాలజీ బాస్‌.. భలే కొత్తగా ఉంటుంది!

అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఐపీఎల్‌(IPL) ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఐపీఎల్‌లో వాడే సాంకేతికతను పరిశీలిస్తే.. 

Updated : 29 Apr 2023 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఐపీఎల్‌(IPL) మ్యాచ్‌లు ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. మ్యాచ్‌ మ్యాచ్‌కు ఉత్కంఠ పెరుగుతూ.. అసలు సిసలు క్రికెట్‌ మజాను అందిస్తున్నాయి. అయితే.. స్టేడియంలో వీక్షించే ప్రేక్షకుల కంటే.. టీవీలు, మొబైళ్లలో మ్యాచ్‌లను చూసే వారి సంఖ్యే ఎక్కువన్న విషయం తెలిసిందే. అందుకే ప్రేక్షకులకు అద్వితీయమైన అనుభూతి అందించేందుకు ఉత్తమ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి ప్రసార మధ్యమాలు. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీని వాడుతూ.. అత్యంత సూక్ష్మ సమాచారాన్ని కూడా ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆట తీరే మారిపోతోంది. ఇక ఐపీఎల్‌లో వాడుతున్న అధునాతన సాంకేతికతల్లో కొన్నింటిపై ఓ లుక్కేస్తే..

  1. అంపైర్‌ క్యామ్‌లు (umpire camera).. మైదానంలో ఆటను చిత్రీకరించేందుకు వివిధ ప్రదేశాల్లో కెమెరాలను అమర్చే విషయం తెలిసిందే. అయితే మైదానం లోపల అంపైర్ల క్యాప్‌లపై అమర్చే కెమెరాలు ప్రత్యేకం. ఐసీసీ ఈవెంట్లలో ఇలాంటి కెమెరాలు మనకు కనబడవు. ఐపీఎల్‌లాంటి వాటిలోనే వీటిని వాడుతున్నారు.
  2. బగ్గీక్యామ్‌ (BuggyQam).. ఈ టెక్నాలజీని టెన్నిస్‌ నుంచి స్వీకరించారు. గతంలో అథ్లెట్ల కోసం వీటిని వాడేవారు. ఆటగాళ్లతోపాటే పరుగెత్తుతూ ఇవి వారి కదలికలను షూట్‌ చేస్తాయి. మైదనాంలో బౌండరీ లైన్‌ వద్ద అటూ ఇటూ తిరుగుతూ ఆటగాళ్ల ప్రతీ మూమెంట్‌ను ఇవి రికార్డు చేస్తాయి. ఓవర్ల మధ్యలో మైదానంలోపలికి వస్తుంటాయి. తక్కువ ఎత్తులోని దృశ్యాలను కూడా ఇవి చిత్రీకరిస్తాయి.
  3. 360 డిగ్రీల కెమెరాలు (360° Cameras).. కోహ్లీ చూడచక్కటి కవర్‌ డ్రైవ్‌ ఆడితే.. రోహిత్‌ అద్భుతమైన పుల్‌ షాట్‌ ఆడితే.. షాట్‌ మాత్రమే కాదు.. వాళ్లు పోస్చర్‌ కూడా అదిరిపోతుంది. బ్యాటర్‌ను 360 డిగ్రీల్లో చూపిస్తూ.. షాట్‌ స్పెషాలిటీ చెబుతారు. 360 డిగ్రీల కెమెరాలతోనే  ఇది సాధ్యం. అలాగే ఒక బ్యాటర్‌కు ఫీల్డ్‌ సెట్టింగ్‌ కూడా అలానే విశ్లేషించి చూపిస్తారు. ఈ అధునాతన టెక్నాలజీని 2021 సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో వాడుతున్నారు.
  4. స్పైడర్‌ కెమెరాలు (Spider Camera).. ఇవి మైదానంలో కొంత ఎత్తులో తిరుగుతూ దృశ్యాలను చిత్రీకరిస్తుంటాయి. కేబుళ్ల సహాయంతో ఇవి ఆటు ఇటు చక్కర్లు కొడుతాయి. స్టేడియం పైనుంచి దృశ్యాలను చిత్రీకరిస్తూ.. ఆటకు సంబంధించి సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతాయి. అయితే ఇవి ఆటగాళ్లను అప్పుడప్పుడు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ కెమెరా మైదానంలోనే తిరుగుతుండటంతో.. ఒక్కోసారి బంతి కెమెరాకో, దాని తీగలతో తాకి దిశను మార్చుకుంటాయి. దీంతో ఫీల్డర్లు ఇబ్బందికి గురవుతారు. స్పైడర్‌క్యామ్‌కు తాకితే.. ఆ బంతిని అంపైర్‌ డెడ్‌ బాల్‌గా ప్రకటిస్తాడు. ఐపీఎల్‌తోపాటు చాలా లీగుల్లో ఈ సాంకేతికతను చాలా కాలంగా వినియోగిస్తున్నారు.
  5. రియల్‌ టైమ్‌ అనలిటిక్స్‌ (Real-Time Analytics).. క్రికెట్‌లో ఆటతోపాటు సమాచారం కూడా ఎంతో ముఖ్యం. చాలా జట్లు ఈ సమాచారంపై ఆధారపడతాయి. కోచ్‌లు, కెప్టెన్లు.. తమ ఆటగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి.. ఎక్కడ మెరుగుపడాలో సూచిస్తుంటారు. బౌలర్ల ఏ లెంగ్త్‌లో బంతులేస్తున్నారు.. బ్యాటర్లు ఎలాంటి షాట్లు ఆడి ఔటవుతున్నారు. ఇలాంటి సమస్త సమాచారాన్ని రియల్‌ టైమ్‌ అనలిటిక్స్‌ అందిస్తాయి.
  6. ఎల్‌ఈడీ స్టంప్స్‌, బెయిల్స్‌ (LED Stumps and Bails).. రనౌట్లు, స్టంపింగ్‌ విషయంలో అంపైర్లకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో బెయిల్స్‌ కిందపడ్డాయో లేదో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ సాంకేతికతతో బంతి వికెట్లను తాకగానే లైట్లు వెలుగుతాయి. బెయిల్స్‌ కిందపడ్డ విషయం కూడా సులువుగా తెలుస్తుంది.  రనౌట్లు, స్టంపింగ్‌ నిర్ణయాల్లో ఇవి కచ్చితత్వాన్ని పెంచుతున్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి.
  7. డాల్బీ అట్మాస్‌ (Dolby Atmos).. స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేప్పుడు కలిగే అనుభూతిని.. టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకు అందించడానికి డాల్బీ అట్మాస్‌తో ప్రసారాలను అందిస్తున్నాయి. ఇవి చిన్న శబ్దాన్ని కూడా ఎంతో స్పష్టంగా ప్రేక్షకులకు అందిస్తాయి. 
  8. స్పీడ్‌ గన్‌ (Speed Gun).. ఈ టెక్నాలజీని క్రికెట్‌లో ఎప్పటి నుంచో వాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బౌలర్లు ఎంత వేగంతో బంతులను విసురుతున్నారనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా బౌలర్‌ లాకీ ఫెర్గుసన్‌ ఓ మ్యాచ్‌లో 154 కి.మీ వేగంతో బంతిని సంధించాడు. ఇక సన్‌రైజర్స్‌ బౌలర్‌, జమ్ము ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ 150 కి.మీకుపైగా వేగంతో బంతులను వేస్తుంటాడు. ఇవన్నీ స్పీడ్‌ గన్‌తోనే రికార్డు చేస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని