MS Dhoni: త్వరలో ఆస్పత్రిలో చేరనున్న ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) త్వరలో ఆస్పత్రిలో చేరతాడని తెలుస్తోంది. తన మోకాలి గాయానికి సంబంధించి టెస్టులు చేయించుకుంటాడని సమాచారం.

Updated : 31 May 2023 18:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 41 ఏళ్ల వయసులోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)ను విజయవంతంగా ముందుండి నడిపించాడు. తన వ్యూహాలతో మేటి జట్లను సైతం మట్టికరిపించి సీఎస్కేకు ఐదో టైటిల్‌ను అందించాడు. మోకాలి గాయంతో బాధపడుతున్నా అన్ని మ్యాచ్‌ల్లో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడంతోపాటు జట్టుకు అవసరమైన సందర్భాల్లో బ్యాటింగ్‌కు దిగాడు. మూడు నెలల నుంచి ఐపీఎల్‌తో తీరిక లేకుండా గడిపిన కెప్టెన్‌ కూల్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ధోనీ త్వరలోనే ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చేరి తన మోకాలి గాయానికి సంబంధించి  పలు టెస్టులు చేయించుకుంటాడని తెలుస్తోంది. టెస్టులకు సంబంధించిన రిపోర్టులు వచ్చిన తర్వాత ధోనీ సర్జరీ చేయించుకుంటాడా లేదా అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఈ సీజన్‌లో చెపాక్ మైదానంలో సీఎస్కే చివరి లీగ్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం ధోనీ మైదానం అంతా కలియతిరిగాడు. అభిమానుల వైపు సీఎస్కే జెర్సీలు విసిరాడు. ఈ క్రమంలో ధోనీ తన మోకాలికి ఓ క్యాప్‌ (మోకాలికి సపోర్ట్ కోసం వాడతారు) ధరించి కన్పించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ మధ్య మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఓసారి ధోనీని మర్యాదపూర్వకంగా కలిశాడు. అప్పుడు కూడా మిస్టర్ కూల్ తన మోకాలికి క్యాప్ ధరించి కనిపించాడు. ఏది ఏమైనా గాయం నుంచి ధోనీ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ సీజన్‌తో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే, శరీరం సహకరిస్తే.. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటానని సూచనప్రాయంగా తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని