MS Dhoni: ఒక్కోసారి ఒక్కోలా.. అసలు ధోనీ మనసులో ఏముంది?

ప్రతి సీజన్‌కు ముందు ధోనీ(MS Dhoni)కిదే చివరి ఐపీఎల్‌ అంటూ వార్తలు రావడం చూస్తూనే ఉంటాం. అయితే.. ఈ సీజన్‌లో ధోనీ పలుసార్లు తన రిటైర్మెంట్‌ వార్తలపై స్పందించారు.

Updated : 24 May 2023 17:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఈ ఐపీఎల్‌(IPL 2023) సీజన్‌ చివరి దశకు చేరుకుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఇదే  సమయంలో ఎప్పుడూ జరిగే చర్చ ఒకటి ముందుకు వచ్చింది. అదే ధోనీ(MS Dhoni) రిటైర్మెంట్‌ అంశం. ఈ సీజన్‌ ముగుస్తున్న నేపథ్యంలో వచ్చే సీజన్‌లో మహీ ఆడతాడా? లేదా? అనే చర్చ కొనసాగుతోంది. దీనిపై క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌లో విజయం అనంతరం ధోనీ తాజాగా స్పందించాడు కూడా. అయితే.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ధోనీ తన రిటైర్మెంట్‌ గురించి ఎప్పుడేమన్నాడో ఓసారి పరిశీలిస్తే..

  • నాకు కావాల్సినంత సమయం ఉంది.. గుజరాత్‌ (Qualifier 1)పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన అనంతరం ధోనీ మాట్లాడాడు. చెపాక్‌లో మళ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ఇప్పుడే చెప్పలేను. ఇంకా 8-9 నెలల సమయం ఉంది. డిసెంబర్‌లో మళ్లీ మినీ వేలం ఉంటుంది. కాబట్టి, ఆ తలనొప్పిని ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు కావాల్సినంత సమయం ఉంది. సీఎస్‌కే కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. అది జట్టు కోసం ఆడటమా..? బయట కూర్చోవడమా..? అనేదానిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం ఉంది’’ అని చెప్పాడు.
  • అది మీరే డిసైడ్‌ చేసేశారా..? లీగ్‌ దశలో లఖ్‌నవూతో మ్యాచ్‌ సందర్భంగా టాస్‌ వేసే సమయంలో ‘మీ చివరి సీజన్‌ను ఆస్వాదిస్తున్నారా?’ అని కామెంటేటర్‌ డానీ మారిసన్‌(Danny Morrison) అడిగాడు. దీనికి మహీ స్పందిస్తూ.. ‘ఇది నా చివరి ఐపీఎల్‌ అంటూ మీరే డిసైడ్‌ చేసేశారా?’ అంటూ నవ్వుతూ కౌంటర్‌ ఇచ్చాడు. అనంతరం కామెంటేటర్‌.. స్టేడియంలో ధోనీ కోసం భారీగా వచ్చిన ప్రేక్షకులను చూపిస్తూ.. ‘మహీ వచ్చే ఏడాది కూడా ఆడేందుకు వస్తాడు’ అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ధోనీ అభిమానుల్లో జోష్‌ నింపాయి.
  • నా ఫేర్‌వెల్‌కు వచ్చినట్లుంది.. ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతా (kolkata knight riders)తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ తన ఫేర్‌వెల్‌పై సరదా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా సొంత మైదానం అయినప్పటికీ.. భారీగా అభిమానులు ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కేకు మద్దతుగా నిలిచారు. మ్యాచ్‌ అనంతరం ధోనీ (MS Dhoni) ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తనకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందుకు వీరంతా సీఎస్‌కే జెర్సీలో వచ్చినట్లుందని నవ్వుతూ అన్నాడు.
  • సొంత మైదానంలో పరేడ్‌ నిర్వహించి.. లీగ్‌ దశలో సొంత మైదానం చెపాక్‌ వేదికగా చివరి మ్యాచ్‌ను ఆడిన అనంతరం ధోనీ.. స్టేడియంలో తోటి ఆటగాళ్లతో కలిసి పరేడ్‌ నిర్వహించాడు. అభిమానుల వైపు జెర్సీలు విసిరి.. వారు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక దిగ్గజ క్రికెటర్‌, కామెంటేటర్‌ సునీల్‌ గావస్కర్‌ పరుగున వచ్చి.. తన షర్ట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం మరో విశేషం. ఈ నేపథ్యంలో తన ఫేర్‌వెల్‌పై ధోనీ ఏదైనా సూచనలు చేస్తున్నాడా.. అనే అనుమానం అభిమానుల్లో కలిగింది.
  • కెరీర్‌ చివరి దశలో ఉన్నాను.. ‘ఇప్పటికే చాలామంది నా కెరీర్‌ గురించి మాట్లాడుతున్నారు. నేను ఎంతకాలం ఆడినా సరే.. ఇప్పుడు కెరీర్‌ చివరి దశలో ఉన్నాను. ఇప్పుడు దానిని ఎంజాయ్‌ చేస్తున్నా. వయసు పెరుగుతుందంటే మరింత అనుభవం వచ్చి చేరినట్లే. నేను ఎప్పుడూ వయసు పెరిగిపోతుందని చెప్పడానికి అస్సలు సిగ్గుపడను’ అని సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ అనంతరం ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పలు సందర్భాల్లో మాజీ ఆటగాళ్లు  ఏమన్నారంటే..

‘ఎప్పుడు రిటైర్‌ అవుతాడో ధోనీకి మాత్రమే తెలుసు. నేను గతేడాదే చెప్పాను.. ఈ ఏడాది మహీ ఆడతాడని. అయితే.. వచ్చే ఏడాది ఆడతాడో లేదో నాకు తెలియదు. అతడు వచ్చే ఏడాది కూడా కొనసాగితే.. అతడి అభిమానులు ఎంతో సంతోషిస్తారు. అతడు ఆడటమే అభిమానులకు కావాలి’ 

- మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌

‘ధోనీ ఆటగాడిగా కాకుండా మెంటార్‌గా కొనసాగుతాడు. అతడు జట్టును ఎంచుకుంటాడు. యువ ఆటగాళ్లకు మెళకువలు నేర్పుతూనే ఉంటాడు. తన కింద ఆడే ప్రతి ఒక్కరూ బాగా రాణించాలని కోరుకుంటాడు’ 

- మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్‌

‘ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత.. నేను మరో ఏడాది పాటు ఆడతాను’ అని మహీ ఓ సందర్భంలో తనతో అన్నట్లు సురేశ్‌ రైనా చెప్పాడు.

ఇక.. మహేంద్రుడు లేని చెన్నై జట్టును ఊహించుకోవడం కష్టమే. అతడు తర్వాతి సీజన్లలో కూడా తన సేవలు కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు. అయితే.. రిటైర్మెంట్‌  గురించి ధోనీ ఇప్పటి వరకూ ఎక్కడా స్పష్టంగా చెప్పనప్పటికీ.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే.. ఎవరూ ఊహించని విధంగా ఆగస్టు 15, 2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని