Virender Sehwag : 2011 వరల్డ్‌కప్‌లో ధోనీ కిచిడీ మాత్రమే తిన్నాడు.. ఎందుకో తెలుసా..? : సెహ్వాగ్‌

భారత్‌కు రెండోసారి వన్డే ప్రపంచకప్‌ అందించిన మహేంద్ర సింగ్‌ ధోనీ(MS Dhoni)కున్న ఓ సెంటిమెంట్‌ గురించి సెహ్వాగ్‌(Virender Sehwag) ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Published : 27 Jun 2023 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌(ODI World Cup-2023) షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 5న ఈ వన్డే మహా సమరం ప్రారంభం కానుండగా.. 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో భారత్‌ తన పోరును ప్రారంభించనుంది. ఇక 2011లో ధోనీ సారథ్యంలో రెండోసారి ప్రపంచకప్‌ను భారత్‌ ముద్దాడగా.. మరోసారి విజేతగా నిలిచి ఐసీసీ ట్రోఫీల కొరతను తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2011 ప్రపంచకప్‌(2011 World Cup) గెలిచిన టీమ్‌ గురించి మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌(Virender Sehwag) ఓ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఆ సమయంలో ముఖ్యంగా ధోనీ(MS Dhoni) పాటించిన ఓ సెంటిమెంట్‌ గురించి సెహ్వాగ్‌ తెలిపాడు. 2011 ప్రపంచకప్‌ సమయంలో ధోనీ కేవలం కిచిడి మాత్రమే తినేవాడని.. ఇది అతడి సెంటిమెంటని చెప్పాడు. తన ఆటతీరు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ.. భారత్‌ మ్యాచ్‌లు గెలుస్తుండటంతో మహీ ఈ సెంటిమెంట్‌నే కొనసాగించాడని సెహ్వాగ్‌ తెలిపాడు.

‘‘ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్‌ ఉంటుంది. అలాగే ధోనీకి కూడా.. అదే కిచిడి. ఆ ప్రపంచకప్‌ అంతా ధోనీ అదే తిన్నాడు. దీనిపై అడిగితే..‘నేను పెద్దగా స్కోరు చేయనప్పటికీ.. ఈ సెంటిమెంట్‌ బాగా పనిచేస్తోంది. మ్యాచ్‌లు గెలుస్తున్నాం’ అని చెప్పేవాడు’’ అని సెహ్వాగ్‌ అప్పటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నాడు.

వరల్డ్‌ కప్‌ అంటే క్రికెట్‌ ఒలింపిక్స్‌..

ఇక ప్రస్తుత ప్రపంచకప్‌(ODI World Cup-2023) గురించి కూడా సెహ్వాగ్‌ స్పందించాడు. వన్డే వరల్డ్‌ కప్‌ అంటే.. క్రికెట్‌ ఒలింపిక్స్‌ అని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ కంటే ఏదీ పెద్దది కాదన్నాడు. ‘ప్రపంచకప్‌ క్షణాలు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. నేను ఆడినప్పుడు ఒకసారి ఫైనల్‌కు చేరాం. ఓసారి గెలిచాం. మరోసారి క్వాలిఫై కాకుండానే దారుణంగా ఓటమిపాలయ్యాం. కాబట్టి నా ప్రయాణం ఒడుదొడుకులతో సాగింది’ అంటూ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని