Hardik Pandya: దటీజ్ హార్దిక్ పాండ్య.. వద్దనుకున్న వాళ్లే వెంటపడేలా చేసిన ఆల్‌రౌండర్

ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తిరిగొచ్చేశాడు. ఎంత మొత్తం అనేది చెప్పకపోయినా.. భారీగానే చెల్లించినట్లు సమాచారం. 

Published : 27 Nov 2023 16:47 IST

ప్రతి ఐపీఎల్ (IPL) సీజన్‌కు కొన్ని నెలల ముందు ఆటగాళ్లను జట్లు ఇటు అటు మార్చుకోవడం మామూలే. వేలానికి కొందరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుని కొంతమందిని వదిలేస్తుంటాయి జట్లు. ఆ సమయంలోనే ఆటగాళ్ల ఎక్స్‌చేంజ్ కూడా జరుగుతుంటుంది. మామూలుగా దీని గురించి మీడియాలో పెద్ద చర్చేమీ జరగదు. వేలం టైంలో ఉండే హడావుడి ఇందులో కనిపించదు. కానీ ఈసారి మాత్రం ఒక ఆటగాడి జట్టు మార్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యను (Hardik Pandya) ముంబయి ఇండియన్స్‌ కొనుగోలు చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ముందు ఇది కేవలం రూమర్ లాగా కనిపించినప్పటికీ.. చివరికి ఈ ప్రచారమే నిజమైంది. తనను వద్దనుకున్న ముంబయి ఇండియన్స్ జట్టే తన కోసం ఎగబడేలా చేయడంతో హార్దిక్ పాండ్య పేరు మార్మోగుతోంది.

హార్దిక్ పాండ్య అనే పేరు ఐపీఎల్ అభిమానులకు పరిచయం అయింది.. అతను ఆటగాడిగా ఒక స్థాయి అందుకుంది ముంబయి ఇండియన్స్ ద్వారానే. 2015లో ఈ బరోడా ఆటగాడి ఐపీఎల్ కెరీర్ మొదలైంది. తొలి సీజన్లోనే చక్కటి ప్రదర్శన చేశాడు. రెండో సీజన్‌కల్లా జట్టుకు కీలకంగా మారాడు. దీంతో పాటు రోహిత్ శర్మ సహా ముంబయి ఇండియన్స్ అట్టిపెట్టుకునే ముఖ్య ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. ఐపీఎల్ మెరుపులతో భారత జట్టులోనూ చోటు దక్కించుకుని అక్కడ కూడా ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా మారాడు. కపిల్ దేవ్ తర్వాత భారత్‌కు దక్కిన మేటి ఆల్‌రౌండర్‌గా కితాబులందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో జట్టు తన మీద ఎంతో ఆధారపడే స్థాయికి చేరుకున్నాడు. ఐతే తర్వాత గాయాల సమస్యతో టెస్టులకు దూరమయ్యాడు. కానీ వన్డేలు, టీ20ల్లో మాత్రం కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. కొన్ని సీజన్ల పాటు హార్దిక్‌ను కోర్ గ్రూప్‌లో భాగంగా చూస్తూ అతణ్ని అట్టిపెట్టుకుంటూ వచ్చిన 2022 సీజన్‌కు ముందు అతణ్ని విడిచిపెట్టింది. రోహిత్, బుమ్రా, సూర్యకుమార్, పొలార్డ్‌లను మాత్రమే అట్టిపెట్టుకుని హార్దిక్‌ను వదిలేసింది. అప్పటికి హార్దిక్ ఫామ్ అంత గొప్పగా లేకపోవడం కూడా అతణ్ని విడిచిపెట్టడానికి ఒక కారణం. ఐతే మెగా వేలంలోకి వచ్చిన హార్దిక్‌ను కొనేందుకు మిగతా జట్లు ఎగబడ్డాయి. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌ అతణ్ని రూ.15 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐతే తనను విడిచిన ముంబయి ఇండియన్స్‌కు తన విలువను ఆ సీజన్లోనే చాటి చెప్పాడు హార్దిక్. గుజరాత్‌ను కెప్టెన్‌గా గొప్పగా నడిపించి తొలి సీజన్లోనే విజేతగా నిలబెట్టాడు. కెప్టెన్‌గానే కాక ఆటగాడిగా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. రెండో సీజన్లోనూ గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు హార్దిక్ లేని ముంబయి ఇండియన్స్ గత రెండు సీజన్లలోనూ పేలవ ప్రదర్శన చేసింది. హార్దిక్‌ను కాదని ఎంచుకున్న పొలార్డ్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. కామెరూన్ గ్రీన్ లాంటి ఆటగాళ్లు కూడా జట్టుకు సమతూకం తేలేకపోయారు. దీంతో ముంబయి ప్రదర్శన దారుణంగా దెబ్బ తింది.

ఎవ్వరూ ఊహించని విధంగా..

హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్ ఎంతగానో గౌరవించింది. అతనూ జట్టును గొప్పగా నడిపించాడు. ఒక కొత్త జట్టును తొలి సీజన్లోనే విజేతగా నిలపడం సామాన్యమైన విషయం కాదు. జట్టుగా చూస్తే టైటాన్స్ మరీ గొప్పగా ఏమీ అనిపించదు. కానీ హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన, జట్టును సమష్టిగా నడిపించిన తీరు టైటాన్స్‌ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ఇలాంటి ఆటగాడిని గుజరాత్ వదులుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. హార్దిక్ కూడా ఈ జట్టును వీడతాడని ఊహించలేదు. కానీ హార్దిక్ అవసరం తమ జట్టుకు ఎంత ఉందో ముంబయి ఇండియన్స్ గుర్తించింది. అతణ్ని ఎలాగైనా తిరిగి తమ జట్టులోకి తేవాలనుకుంది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్‌తో, హార్దిక్ పాండ్యతో సంప్రదింపులు జరిపింది. తనను వద్దనుకున్న జట్టే ఏరి కోరి తిరిగి తనను తీసుకోవడానికి ముందుకు రావడం, అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడటంతో హార్దిక్ పాండ్య ఆలోచన మార్చుకున్నాడు.

గుజరాత్‌కు ఎలాంటి ఆఫర్ ఇచ్చి ముంబయి ఒప్పించిందో కానీ.. వాళ్లూ తలొగ్గారు. ఈ ఒప్పందం అనధికారికంగా జరుగుతుంది. ఇది ఐపీఎల్ నిబంధనలకు లోబడే చేస్తారు. కాకపోతే ఇలా ఆటగాడిని మార్చుకునేందుకు ఎంత చెల్లించేది బయటికి చెప్పాల్సిన పని లేదు. ముంబయి.. గుజరాత్‌కు ఎంత చెల్లించినప్పటికీ.. అందులోంచి సగం హార్దిక్‌కు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాక వేలంలో అతనికి పలికిన రూ.15 కోట్ల ధర వార్షిక ఫీజుగా వస్తుంది. ఏదేమైనప్పటికీ.. తనను దూరం చేసుకున్న జట్టే తన కోసం ఎగబడేలా చేసిన ఘనత హార్దిక్‌దే అంటూ అతడిని అభిమానులు కొనియాడుతున్నారు. మరి హార్దిక్ రాకతో ముంబయి రాత మారుతుందేమో చూడాలి. రోహిత్ శర్మ కెరీర్ చరమాంకంలో ఉన్న నేపథ్యంలో ముంబయికి భావి కెప్టెన్ హార్దిక్ పాండ్యనే కావచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు హార్దిక్ దూరం కావడం టైటాన్స్‌కు పెద్ద దెబ్బే అవుతుందని భావిస్తున్నారు. అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు జట్టు పగ్గాలను గుజరాత్ ఫ్రాంచైజీ అప్పగించింది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని