ODI WC 2023: అప్పుడు రెండింట్లోనూ విఫలం.. ఇప్పుడు చంద్రయాన్‌ సక్సెస్‌.. వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియా ఏం చేస్తుందో?

చంద్రయాన్‌ (Chandrayaan 3) విజయానికి.. వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) టీమ్‌ఇండియా ప్రదర్శనకు పోలిక పెడుతూ ముంబయి ఇండియన్స్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. అలాగే జట్టులో స్పిన్నర్‌గా చాహల్ ఉండాలని భజ్జీ సూచించాడు. చంద్రయాన్‌ -3 సక్సెస్‌ను ధోనీ తనయ ఎలా ఆస్వాదించిన వీడియోను సాక్షి సింగ్‌ పోస్టు చేసింది.

Published : 24 Aug 2023 11:12 IST

ముంబయి ఇండియన్స్‌ ఆసక్తికర పోస్టు!

ఇంటర్నెట్ డెస్క్: చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో భారతీయులంతా సంతోషంలో తేలియాడుతున్నారు. ఇదే సమయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్‌ క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఓ ట్వీట్ చేసింది. ఇప్పుడది వైరల్‌గా మారింది. 2019లో చంద్రయాన్‌-2 ల్యాండర్‌ విఫలమైన సంగతి తెలిసిందే. అదే ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ దశలో భారత్‌ ఇంటిముఖం పట్టింది. ఇప్పుడు చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో ఇదే సంవత్సరం భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా టీమ్‌ఇండియా నిలుస్తుందనే అర్థం వచ్చేలా ముంబయి పోస్టు పెట్టింది. ఇస్రో శాస్త్రవేత్తలు గత పొరపాట్లను సరి చేసుకుని అద్భుతమైన ఫలితం రాబట్టినట్లే.. భారత క్రికెటర్లూ ఈ సారి ఉత్తమ ప్రదర్శనతో వరల్డ్‌ కప్‌ను సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. 


అతడిని మించిన స్పిన్నర్‌ లేడు: హర్భజన్‌

ఆసియా కప్ కోసం భారత్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. కుల్‌దీప్‌ యాదవ్, అక్షర్ పటేల్‌కు అవకాశం లభించింది. చాహల్‌ గతేడాది టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. తాజాగా విండీస్‌ పర్యటనకు వెళ్లినప్పుడూ ఎక్కువగా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో చాహల్‌ను పక్కన పెట్టడంపై టీమ్‌ఇండియా మాజీ టాప్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఒకటీ లేదా రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ సరిగా వేయకపోతే అతడేమీ చెత్త బౌలర్‌ కాడు. యుజ్వేంద్ర చాహల్‌ వంటి స్పిన్నర్‌ లేకపోవడం జట్టుకు నష్టమే. వైట్‌బాల్‌ క్రికెట్‌లో స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ప్రస్తుత తరంలో అతడిని మించిన వారెవరూ లేరు. గత కొన్ని మ్యాచుల్లో అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదనేది వాస్తవమే. అంతమాత్రాన పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. వరల్డ్‌ కప్‌ జట్టులో తప్పక ఉండాల్సిందే. భారత్‌ వేదికగా టోర్నీ జరగనుండటం అతడికి కలిసొచ్చే అంశం. మ్యాచ్‌ విన్నర్‌గా ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు’’ అని హర్భజన్‌ తెలిపాడు.


చంద్రయాన్‌-3..  ధోనీ కుమార్తె జీవా రియాక్షన్‌ చూశారా..?

చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగిడిన చంద్రయాన్‌ -3 సక్సెస్‌ సంబరాలు ఆకాశాన్నంటాయి. ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ కుమార్తె జీవా కూడా వీటిల్లో పాలుపంచుకొంది. దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన కుమార్తె జీవా చంద్రయాన్‌ -3 ల్యాండింగ్‌ ప్రత్యక్షప్రసారం చూస్తున్న ఫొటోను సాక్షిసింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా పెట్టుకొన్నారు. అలాగే ట్విటర్‌ వేదికగా (ప్రస్తుతం ఎక్స్‌) వీడియోను షేర్ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని