IPL 2024 mini auction: ‘ఆ ఇద్దరి కోసం ముంబయి ఇండియన్స్‌ పోటీ పడుతోంది’

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌-2024 సీజన్‌ కోసం మినీ వేలం నిర్వహించనున్నారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, హేజిల్‌వుడ్ ఈ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.  

Published : 06 Dec 2023 02:04 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2024 సీజన్‌ కోసం డిసెంబరు 19 దుబాయ్‌లో మినీ వేలం నిర్వహించనున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్‌ (Pat Cummins), మిచెల్ స్టార్క్‌, జోష్‌ హేజిల్‌ వుడ్‌లను ఈ వేలంలో భారీ ధర దక్కించుకునే అవకాశముందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ ముగ్గురు తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) పేస్‌ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉందని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. దాన్ని అధిగమించడం కోసం వేలంలో స్టార్క్‌, కమిన్స్‌లను దక్కించుకోవడం కోసం ముంబయి ఫ్రాంఛైజీ భారీ ధర చెల్లించడానికైనా సిద్ధపడుతుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరికి బ్యాటింగ్‌లోనూ రాణించే సామర్థ్యం ఉండటంతో ముంబయి వారిపై దృష్టిపెట్టిందన్నాడు. ఆటగాళ్ల ట్రేడింగ్‌లో భాగంగా గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యను తిరిగి సొంత గూటికి తెచ్చుకుంది ముంబయి ఇండియన్స్‌.. ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను ఆర్సీబీకి ట్రేడ్ చేసింది.

స్టార్క్‌ ఆర్సీబీకే

మరోవైపు, ఐపీఎల్‌ మినీ వేలంలో మిచెల్ స్టార్క్‌ (Mitchell Starc) ని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) కొనుగోలు చేస్తుందని టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ అంచనా వేశాడు. 2014, 2015 సీజన్లలో స్టార్క్‌ ఆర్సీబీ తరఫున ఆడాడు. ‘‘మిచెల్ స్టార్క్ బెంగళూరు తరఫున ఆడతాడని అనుకుంటున్నా. ఎందుకంటే అతను ఇంతకు ముందు ఆర్సీబీకి ఆడాడు. చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌లపై ఎక్స్‌ ట్రా పేస్‌తో 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉండటం, ఎడమ చేతివాటం బౌలర్‌ కావడంతో స్టార్క్‌ని దక్కించుకోవాలని ఆర్సీబీ భావిస్తుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు