Mumbai vs Chennai: ధోనీ ఆట.. సూర్య వేట చూస్తామా?

వాంఖడే వేదికగా కీలక సమరం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో టాప్‌ జట్లు ముంబయి, చెన్నై తలపడనున్నాయి. 

Published : 14 Apr 2024 14:20 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ఐదేసి సార్లు విజేతగా నిలిచిన జట్లు రెండు.. 17వ సీజన్‌లో తొలిసారి ఇరు జట్ల మధ్య పోరు జరగనుంది. ఓ వైపు కోల్‌కతాను ఓడించి దూకుడు మీదున్న చెన్నై.. మరోవైపు లేటుగా విజయాల ఖాతా తెరిచిన ముంబయి రాత్రి 7.30గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. 

వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై విమర్శలకు గురైన ముంబయి జట్టు.. అనూహ్యంగా పుంజుకొంది. రెండు విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ రేసులో తామున్నామంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేసింది. తొలి దశలో సొంతమైదానం వేదికగా ముంబయి ఆడనున్న చివరి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. సూర్య మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్‌ కిషన్, రోహిత్ శర్మ జోడీ తొలి వికెట్‌కు అద్భుతమైన ఆరంభం ఇస్తుండటం ముంబయికి కలిసొచ్చే అంశం. కెప్టెన్ హార్దిక్‌ పాండ్య కూడా దిల్లీపై చెలరేగాడు. బౌలింగ్‌లో స్టార్ పేసర్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. గెరాల్డ్ కోయిట్జీ వికెట్లను తీస్తున్నా పరుగులు ధారాళంగా సమర్పించడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఆకాశ్‌ మధ్వాల్ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. స్పిన్‌ విభాగంలో సీనియర్ ఆటగాడు పీయూష్‌ చావ్లా ప్రభావం చూపించలేదు. వాంఖడేలో స్పిన్‌కు పెద్దగా సహకారం లభించడం లేదు. ఆల్‌రౌండర్‌ నబీ స్పిన్నర్‌గా అక్కరకొస్తాడు. ఆఖరి ఓవర్లో సిక్స్‌లతో విరుచుకుపడే రొమారియో షెఫర్డ్‌ నుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌ను చూడాలనేది ముంబయి అభిమానుల ఆకాంక్ష.

చెన్నై బౌలింగ్‌ గాడిన పడితేనే..!

యువ పేసర్ పతిరన లేకపోవడం చెన్నై జట్టుకు ఇబ్బందికరంగా మారింది. పవర్‌ ప్లేతోపాటు డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థిని అద్భుతంగా కట్టడి చేయడం అతడి స్పెషాలిటీ. గత రెండు మ్యాచుల్లో పతిరన ఆడలేదు. ముంబయితో కూడా కష్టమేనని చెన్నై కోచ్ ఫ్లెమింగ్‌ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. దీపక్ చాహర్‌ మాత్రం పరుగులను కట్టడి చేయలేకపోతున్నాడు. వికెట్లు తీస్తున్నా పరుగుల నియంత్రణ కూడా కీలకమే. టాప్‌ వికెట్‌ టేకర్‌ జాబితాలో ఉన్న ముస్తాఫిజుర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తుషార్‌ దేశ్ పాండే, తీక్షణ, శార్దూల్ ఠాకూర్, మొయిన్ అలీ (తుది జట్టులో ఉంటే)తోకూడిన బౌలింగ్‌ దళం రాణించాలి. ముంబయి జట్టులో దాదాపు అందరూ హార్డ్‌ హిట్టర్లే.  ఏమాత్రం అలసత్వంగా ఉన్నా.. బౌలర్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బ్యాటింగ్‌లో రుతురాజ్‌ ఇంకాస్త దూకుడుగా ఆడాల్సి ఉంది. వాంఖడేలో మరోసారి ధోనీ బ్యాటింగ్‌ చూసే అవకాశం వస్తే బాగుండని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. రచిన్, అజింక్య రహానె మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. 

పిచ్‌ రిపోర్ట్

ముంబయి - చెన్నై ఇప్పటి వరకు 36 మ్యాచుల్లో తలపడ్డాయి. ముంబయి 20, చెన్నై 16 మ్యాచుల్లో గెలిచాయి. వాంఖడేలో 7-4 లీడ్‌లో ఆతిథ్య జట్టు కొనసాగుతోంది. గతేడాది మాత్రం చెన్నైనే విజయం సాధించింది. వాంఖడే మైదానంలో టాస్‌ నెగ్గే కెప్టెన్ తొలుత బౌలింగ్‌నే ఎంచుకుంటాడు. లక్ష్య ఛేదన సమయంలో మంచు ప్రభావం ఉంటుంది. అప్పుడు ఛేజింగ్‌ చేసే జట్టుకు అనుకూలంగా మారుతుంది.

తుది జట్లు (అంచనా)

ముంబయి: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, నబీ, శ్రేయస్‌ గోపాల్, బుమ్రా, గెరాల్డ్ కోయిట్జీ, ఆకాశ్‌ మధ్వాల్

చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తుషార్ దేశ్‌పాండే, మతీశా తీక్షణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని