Mumbai X Bengaluru: ముంబయి బ్యాటర్ల విశ్వరూపం.. బెంబేలెత్తిన బెంగళూరు

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4.3 ఓవర్లు మిగిలి ఉండగానే 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబయి బ్యాటర్లు ఛేదించారు. 

Updated : 11 Apr 2024 23:55 IST

ఎదురుగా కొండంత లక్ష్యం.. ఫామ్‌లో ఉన్న ఇషాన్‌, రోహిత్‌.. గత మ్యాచ్‌తో విజయాల బాటపట్టిన ఆ జట్టు మెల్లిగా ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తే.. నాలుగు అడుగులు ముందుకు దూకుతుందని తెలిసిందే.. ఈ రోజు ముంబయి వేట అచ్చం అలాగే సాగింది. తొలి ఓవర్‌లో రెండంటే రెండే పరుగులు. రెండో ఓవర్‌లో 9 పరుగులు. ఇక అప్పుడు మొదలైంది ముంబయి ఊచకోత.. ఇక మ్యాచ్‌ గెలిచే వరకూ తగ్గనేలేదు.

తొలుత ఇషాన్, రోహిత్‌.. తర్వాత సూర్యకుమార్‌, పాండ్య ఎవరూ తగ్గిందిలేదు. ఒకరిని మించి మరొకరు.. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు.. బంతి ఎలా వేసిన బౌండరీ దాటాల్సిందే. అంతలా ముంబయి బ్యాటర్లు శివాలెత్తిపోయారు. వీరి ఇన్నింగ్స్‌కు స్టేడియంలోని ప్రేక్షకులు హోరెత్తిపోయారు. ముంబయి బ్యాటర్ల విశ్వరూపానికి 197 పరుగుల భారీ లక్ష్యం.. 15.3 ఓవర్లలోనే కరిగిపోయింది. 

ముంబయి: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ముంబయి (Mumbai) అదిరిపోయే ప్రదర్శన చేసింది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉఫ్‌ అని ఊదేసింది. సొంతమైదానంలో బెంగళూరు (Bengaluru)తో జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) (69: 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (Rohit Sharma) (38: 24 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) సిక్స్‌లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించి ముంబయి విజయానికి బాటలు పరిచారు. ఈ ద్వయం తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలో 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 38 పరుగుల తేడాతో వీరిద్దరూ ఔటైనప్పటికీ అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav) (52; 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) పిడుగల్లే విరుచుకుపడ్డాడు. హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) (21*; 6 బంతుల్లో 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (16*; 10 బంతుల్లో 3 ఫోర్లు)  కూడా అదరగొట్టారు.   

ఒకరిని మించి ఒకరు

లక్ష్యఛేదనకు దిగిన ముంబయి మూడో ఓవర్‌ నుంచి దూకుడుగా ఆడింది. బ్యాటర్లు పోటాపోటీగా బౌండరీలు బాదారు. తొలుత ఇషాన్‌ కిషన్‌ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకుని ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌లో సిక్సర్ బాదిన అతడు.. టాప్లీ వేసిన మూడో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు దంచాడు. తర్వాతి ఓవర్‌లో రోహిత్ సిక్స్ కొట్టి జోరందుకున్నాడు. సిరాజ్‌ వేసిన ఐదో ఓవర్‌లో ఇషాన్‌ వరుసగా 6,4,6 బాదేయగా.. రోహిత్ సిక్స్‌ రాబట్టాడు. మ్యాక్స్‌వెల్ వేసిన ఆరో ఓవర్‌లో ఇషాన్‌ కిషన్‌ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదేసి 23 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు. విజయ్‌ కుమార్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో రోహిత్ వరుసగా సిక్స్‌, ఫోర్ కొట్టాడు. జోరుమీదున్న ఇషాన్.. ఆకాశ్‌దీప్‌ బౌలింగ్‌లో కోహ్లీకి చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్ బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆకాశ్ వేసిన 11 ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్ దంచాడు. కాసేపటికే రోహిత్‌ ఔటయ్యాడు. అయినా, సూర్య జోరు తగ్గలేదు. టాప్లీ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ దంచి 17 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత విజయ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి లామ్రోర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికే ముంబయి విజయానికి చేరువగా హార్ది్క్‌, తిలక్ లాంఛనాన్ని పూర్తి చేశారు. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (61; 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రజత్ పటిదార్ (50; 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలు బాదగా.. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ (53*; 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ముంబయి బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (5/21) ఆకట్టుకున్నాడు. గెరాల్డ్ కొయెట్జీ, ఆకాశ్‌ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని