Rafa Nadal: నాదల్‌ చివరిగా!

అతనికది కంచుకోట.. రికార్డుల వేదిక. ఆ ఎర్రమట్టి కోర్టులో అతని ఆధిపత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ గ్రాండ్‌స్లామ్‌లో అతనికి తిరుగులేదు. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిస్తే ఇందులో 14 సార్లు ఆ ఒక్క టోర్నీలోనే ట్రోఫీని ముద్దాడాడు.

Published : 26 May 2024 02:59 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలో దిగ్గజం
నేడే టోర్నీ ఆరంభం
మధ్యాహ్నం 2:30 నుంచి పారిస్‌

అతనికది కంచుకోట.. రికార్డుల వేదిక. ఆ ఎర్రమట్టి కోర్టులో అతని ఆధిపత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ గ్రాండ్‌స్లామ్‌లో అతనికి తిరుగులేదు. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిస్తే ఇందులో 14 సార్లు ఆ ఒక్క టోర్నీలోనే ట్రోఫీని ముద్దాడాడు. ఓపెన్‌ శకంలో ఓ గ్రాండ్‌స్లామ్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన రికార్డునూ ఇక్కడే నమోదు చేశాడు. అలాంటి అచ్చొచ్చిన టోర్నీలో ఆ ఆటగాడు బహుశా చివరిసారి ఆడబోతున్నాడు. ఆ ఆటగాడు నాదల్‌ అయితే.. ఆ గ్రాండ్‌స్లామ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌. తుంటి శస్త్రచికిత్స, ఫామ్‌లేమి, ఫిట్‌నెస్‌ సమస్యలు ఇలా రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్న దిగ్గజం నాదల్‌ తనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది చివర్లో టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించేలా కనిపిస్తున్న అతను.. ముందుగా ఆదివారం ఆరంభమయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌కు వీడ్కోలు పలికే అవకాశముంది. 2005లో ఈ టోర్నీలో అడుగుపెట్టడమే కాదు విజేతగా నిలిచి తన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల ఖాతా తెరిచిన 37 ఏళ్ల నాదల్‌.. ఇక్కడ ఆడిన 115 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లో మాత్రమే ఓడాడు. చివరిగా అతను గెలిచిన గ్రాండ్‌స్లామ్‌ (2022లో) కూడా ఇదే. నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్‌ తర్వాత అతనాడబోతున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ ఇదే. ప్రస్తుత ఫిట్‌నెస్, ఫామ్‌ పరంగా చూస్తే నాదల్‌ టైటిల్‌ సాధించడం కష్టమే. అతనికి తొలి రౌండ్లోనే ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) రూపంలో కఠిన సవాలు పొంచి ఉంది. ఈ అడ్డంకిని దాటి క్వార్టర్స్‌ వరకూ వెళ్లగలిగితే అక్కడ మెద్వెదెవ్‌ (రష్యా) ఎదురయ్యే అవకాశం ఉంది. అక్కడా గెలిస్తే సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌తో తలపడే అవకాశం ఉంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లలో మార్గరెట్‌ కోర్ట్‌ (24)తో సమానంగా ఉన్న జకోవిచ్‌ ఈ టోర్నీలో గెలిస్తే 25వ విజయంతో చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు స్పెయిన్‌ యువ సంచలనం అల్కరాస్‌ కూడా ట్రోఫీపై కన్నేశాడు. రెండో ర్యాంకర్‌ సిన్నర్, రూడ్‌ కూడా టైటిల్‌కు గట్టిపోటీదారులే. 

స్వైటెక్‌ హ్యాట్రిక్‌ కొట్టేనా?: ఇప్పటికే మూడు సార్లు (2020, 2022, 2023)లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన స్వైటెక్‌ (పోలెండ్‌) వరుసగా మూడో టైటిల్‌పై కన్నేసింది. తాజాగా మాడ్రిడ్, ఇటాలియన్‌ ఓపెన్‌ గెలిచిన ఆమె జోరుమీదుంది. ఈ సారి ట్రోఫీ దిశగా ఆమెకు ఒసాక, క్రెజికోవా, కొకోగాఫ్, సబలెంక నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. వాళ్లు కూడా టైటిల్‌పై గురి పెట్టారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో బోపన్న- ఎబ్డెన్‌ జోడీపై అందరి దృష్టి నెలకొంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన 44 ఏళ్ల బోపన్న ఈ టోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. అల్బానో (ఫ్రాన్స్‌)తో కలిసి మరో భారత ఆటగాడు యుకి బాంబ్రి కూడా డబుల్స్‌ ఆడబోతున్నాడు. పురుషుల సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ అదృష్టం పరీక్షించుకోనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని