IND vs AUS: నాగ్‌పుర్‌లో ‘టెస్టు’ రికార్డులు.. ఆధిక్యం ఎవరిదంటే..?

భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) నాలుగు టెస్టుల సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. తొలి టెస్టుకు నాగ్‌పుర్ (Nagpur) వేదికగా కావడం విశేషం. భారత్‌కు అనేక మంచి రికార్డులే ఉన్నాయి.

Published : 07 Feb 2023 18:23 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK).. ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా (ENG vs AUS).. జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు రసవత్తరంగా ఉంటాయని క్రికెట్ అభిమానుల భావన. అదే కోవలోకి  భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) టెస్టు సిరీస్‌ కూడా వచ్చి చేరింది. తాజాగా భారత్‌ వేదికగానే ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ జరగనుంది. బోర్డర్ - గావస్కర్ పేరిట జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు నాగ్‌పుర్‌లోని క్రికెట్ స్టేడియం (Nagpur Stadium) వేదికగా నిలవనుంది. మరి విదర్భ మైదానంలో ఆధిక్యం ఎవరిది..? గత గణాంకాలను ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.. 

దాదాపు ఐదేళ్ల తర్వాత నాగ్‌పుర్‌ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరగబోతోంది. చివరిసారిగా 2017 నవంబర్‌లో శ్రీలంకతో భారత్‌ (IND vs SL) తలపడింది. లంకపై ఇన్నింగ్స్‌ 239 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆరు టెస్టులు జరిగాయి. అందులో భారత్‌దే పైచేయి కావడం విశేషం. నాలుగు టెస్టుల్లో విజయం సాధించగా.. ఒకే మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మరొకటి డ్రాగా ముగిసింది. దక్షిణాఫ్రికా చేతిలో (2010)నే  భారత్‌కు పరాభవం ఎదురైంది. తొలి రెండు రోజులు ఫాస్ట్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండి.. మూడో రోజు నుంచి స్పిన్నర్ల పాలిట స్వర్గధామంగా మారుతుందనేది పిచ్‌పై క్రికెట్ విశ్లేషకుల అంచనా.

తొలి టెస్టు ఆసీస్‌తోనే.. 

విదర్భ స్టేడియం వేదికపై భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య 2008లో జరిగిన టెస్టు మ్యాచ్‌కు విదర్భ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఇదే ఈ మైదానంలో తొలి టెస్టు కావడం విశేషం. ఇందులో భారత్‌ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న నాగ్‌పుర్‌ స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన టెస్టులో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (109)తోపాటు సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ అర్ధ శతకాలతో అదరగొట్టేశారు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 441/10 స్కోరు చేసింది. అనంతరం సైమన్ కటిచ్ (102), మైకెల్ హస్సీ (90), కామెరూన్ వైట్ (46) రాణించడంతో 355 పరుగులు చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 295/10 స్కోరు చేయడంతో ఆసీస్‌ ఎదుట 382 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. కానీ, భారత స్పిన్నర్లు హర్భజన్ (4/64), అమిత్ మిశ్రా (3/27)తోపాటు ఇషాంత్ శర్మ (2/31) దెబ్బకు ఆసీస్‌ 209 పరుగులకే కుప్పకూలి 172 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ప్రస్తుత కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ (0, 2) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమై నిరాశపరిచాడు. 

మరికొన్ని విశేషాలు..

* విదర్భ స్టేడియంలో అత్యధిక స్కోరు: 610/6 డిక్లేర్డ్‌. శ్రీలంకపై భారత్‌ చేసిన పరుగులు ఇవీ..

* అత్యల్ప స్కోరు: దక్షిణాఫ్రికా 2015/16 సీజన్‌లో భారత్‌పై 79 పరుగులకు ఆలౌట్‌.

* అత్యధిక వ్యక్తిగత స్కోరు: దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా 253* పరుగులను భారత్‌పై (2010/11)సాధించాడు.

* ఉత్తమ బౌలింగ్‌ ప్రదర్శన : భారత్‌పై (2008/2009) ఆసీస్ బౌలర్ జాసన్ క్రెజా 8/215. 

*  అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్: టీమ్‌ఇండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ (Sehwag) 357 పరుగులతో ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (Virat kohli) 354 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఈ టెస్టులో మరో నాలుగు పరుగులు చేస్తే సెహ్వాగ్‌ను అధిగమించే అవకాశం ఉంది.

* అత్యధిక వికెట్ల వీరుడు: ఆసీస్‌ హడలెత్తిపోతున్న రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) ఇక్కడ అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్‌ కావడం విశేషం. ఇప్పటి వరకు 19 వికెట్లను పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని