IND vs AUS: నాగ్‌పుర్‌ పిచ్‌ ఏం చెబుతోంది?

భారత్‌ - ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ వేదికైన నాగ్‌పుర్‌ పిచ్‌  (Nagpur Pitch) లంచ్‌ తర్వాత స్పిన్నర్లకు స్వర్గధామంగా మారిపోయింది. స్పిన్నర్లకే (Jadeja, Ashwin) ఎనిమిది వికెట్లు దక్కాయంటే అర్థం చేసుకోవచ్చు.

Published : 09 Feb 2023 15:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా జట్టు భయపడినంతా జరిగింది. బోర్డర్‌ - గావస్కర్‌ (Border - Gavaskar) ట్రోఫీ తొలి టెస్టులో ఆ జట్టు బ్యాటర్లలో అత్యధికులు కుదురుకోకముందే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పిచ్‌ గురించి వాళ్లు ఇన్నాళ్లుగా వ్యక్తం చేసిన భయం నిజమే అని తేలింది. దీంతో తొలి టెస్టు (Ind vs Aus First Test)లో ఆసీస్‌కు కష్ట కాలం మొదలైంది. రఫ్‌గా ఉన్న ఈ పిచ్‌పై పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా పచ్చిక స్పష్టంగా ఉండటంతో పగుళ్లు చెదరకుండా ఉంటాయని.. దీంతో ఇది లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లకు నరకం చూపిస్తుందంటూ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్‌ వార్నర్‌ వంటి స్టార్‌ బ్యాటర్లు కూడా పిచ్‌పై బంతిని అంచనా వేయడంలో బోల్తా పడ్డారు. వీరిద్దరూ లెఫ్ట్‌హ్యాండర్లే.

ఈ పిచ్‌పై నిలదొక్కుకుని సహనంగా ఆడి.. లయ తప్పిన బంతులను బౌండరీలు దాటిస్తే.. పరుగులు చేయడం కష్టమేమీ కాదని అర్థమవుతోంది. ఆసీస్‌ బ్యాటర్‌ లబుషేన్‌ 123 బంతుల్లో 49 పరుగులు చేశాడు. వీటిల్లో 8 ఫోర్లు ఉన్నాయి. ఇక మరో బ్యాటర్‌ స్మిత్‌ కూడా 107 బంతుల్లో 37 పరుగులు చేసినా.. ఏడు ఫోర్లు బాదాడు. మరోవైపు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ 84 బంతుల్లో 31 పరుగులు చేశాడు. కీపర్‌ అలెక్స్‌ క్యారీ  దూకుడుగా ఆడి ఏడు ఫోర్ల సాయంతో 33 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. 

నిలదొక్కుకోనివ్వని పిచ్‌

ఈ పిచ్‌పై మొత్తం 11 మంది ఆసీస్‌ బ్యాటర్లలో ఆరుగురు కలిసి కేవలం 9  పరుగులు మాత్రమే చేశారంటే అర్థం చేసుకోవచ్చు. వీరిలో ఇద్దరు డకౌట్లు కాగా.. ముగ్గురు బ్యాటర్లు తలో పరుగు చేశారు. పిచ్‌ బ్యాటర్‌కు నిలదొక్కుకునే సమయం కూడా ఇవ్వడం లేదనే దీనర్థం. ఇది భారత బ్యాటర్లకు ఓ హెచ్చరిక. భారత కెప్టెన్‌ కూడా ఎప్పుడెప్పుడు స్పిన్నర్లను రంగంలోకి దింపుదామా అని ఎదురు చూశాడు. అందుకే పేసర్లు రెండు వికెట్లు పడగొట్టి.. పతనం షురూ చేసినా.. ఏడో ఓవర్‌కే బంతిని రవీంద్ర జడేజా చేతికిచ్చాడు. అయితే అనుకున్నట్లుగా వెంటనే స్పిన్నర్లకు వికెట్లు రాలేదు.

లంచ్‌ వరకు కేవలం రెండు వికెట్ల నష్టానికి కేవలం 76 పరుగులు చేసిన ఆసీస్‌ భారీ స్కోర్‌ సాధిస్తుందనుకొన్నారు. స్పిన్నర్లను స్మిత్‌, లబుషేన్‌ సమర్థంగా ఎదుర్కొన్నారు కానీ, లంచ్‌ తర్వాత నుంచి ఆసీస్‌ నిలకడగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. టీ బ్రేక్‌ అనంతరం కొద్దిసేపటికే ఆలౌటైంది. లంచ్‌ తర్వాత ఏకంగా ఎనిమిది వికెట్లు పడగా.. మొత్తం స్పిన్నర్లకే దక్కాయి. రవీంద్ర జడేజా విజృంభించి 22 ఓవర్లలో 8 మెయిడిన్లతో 47 పరుగులిచ్చి సగం మంది ఆసీస్‌ బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. ఇక అశ్విన్‌ కూడా 15.5 ఓవర్లలో 42 పరుగులకు 3 వికెట్లు తీసుకొన్నాడు. అయితే అక్షర్‌ ఇంకా ఈ మ్యాచ్‌లో బోణీ కొట్టలేదు. దీంతో పిచ్‌ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలంగా మారిందనే సంకేతాలు వెలువడ్డాయి.

అయితే క్రీజులో నిలదొక్కుకుని స్ట్రోక్‌ ప్లే ఆడినవాళ్లకు, బ్యాక్‌ఫుట్‌ మీద షాట్లు అలవాటు ఉన్నవాళ్లకు ఈ పిచ్‌ నుంచి మంచి సహకారమే వస్తోంది. దీనికి ఉదాహరణ లబుషేన్‌, స్మిత్‌ ఆటతీరు, పరుగులే నిదర్శనం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని