Nepal: ఇంతటి అభిమానమా! నేపాల్‌ ఆట కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్‌

అక్కడేం పెద్ద వేడుక జరగట్లేదు! ఉచితంగా ఏమీ పంచట్లేదు.. అయినా ఇసుకేస్తే రాలనంత జనం! ఒకరి మీద ఒకరు కూర్చున్నారా అన్నట్లుగా ఉంది ఆ సీన్‌ చూస్తుంటే! వీళ్లందరూ ఇలా పోగైంది ఒక క్రికెట్‌ పోరు కోసం! పోనీ అదేమైనా ప్రపంచకప్పు మ్యాచ్‌ జరుగుతుందా అంటే..ఊహూ అది ఒక క్వాలిఫికేషన్‌ మ్యాచ్‌ మాత్రమే. అయినా కూడా అక్కడి అభిమానులు మాత్రం ఆగట్లేదు.

Published : 04 Nov 2023 16:10 IST

అక్కడేం పెద్ద వేడుక జరగట్లేదు! ఉచితంగా ఏమీ పంచట్లేదు.. అయినా ఇసుకేస్తే రాలనంత జనం! ఒకరి మీద ఒకరు కూర్చున్నారా అన్నట్లుగా ఉంది ఆ సీన్‌ చూస్తుంటే! వీళ్లందరూ ఇలా పోగైంది ఒక క్రికెట్‌ పోరు కోసం! పోనీ అదేమైనా ప్రపంచకప్పు మ్యాచ్‌ జరుగుతుందా అంటే..ఊహూ అది ఒక క్వాలిఫికేషన్‌ మ్యాచ్‌ మాత్రమే. అయినా కూడా అక్కడి అభిమానులు మాత్రం ఆగట్లేదు. పోటీపడి మరీ మ్యాచ్‌ను చూస్తున్నారు. ఎందుకంటే ఆ మ్యాచ్‌ వారికి ఎంతో ముఖ్యం. అది ప్రపంచకప్‌లో తమ జట్టును చూసే అవకాశం ఇచ్చే మ్యాచ్‌ కావడమే ఇందుకు కారణం. శుక్రవారం యూఏఈతో నేపాల్‌ (Nepal) తలపడిన మ్యాచ్‌కు అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. 2024 టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024)కు తమ జట్టు అర్హత సాధించడంతో వారు ఊగిపోయారు. నేపాల్‌ అభిమానులు ఇలా భారీ ఎత్తున స్టేడియానికి రావడం ఇదేం కొత్త కాదు. ఎండైనా, వానైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనులన్నీ పక్కనపెట్టేసి స్టేడియంలో వాలిపోతారు వాళ్లు.

ముల్‌పాని స్టేడియం అదిరేలా

క్వాలిఫయర్స్‌ టోర్నీలో భాగంగా నేపాల్‌-యూఏఈ మధ్య సెమీఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చిన ముల్‌పాని స్టేడియంలో ఎలాంటి వసతులు లేవు. మైదానంలో సీట్లు కూడా లేవు. కప్పు అంతకంటే లేదు. పిచ్, బౌండరీ లైన్‌లు మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు జరిగేటప్పుడు చుట్టూ అభిమానులు గుమిగూడి చూసేవాళ్లు. తమ ఫేవరెట్‌ జట్టు గెలవగానే పరుగెత్తుకుంటూ మైదానంలోకి దూసుకొచ్చేవాళ్లు. శుక్రవారం ముల్‌పాని స్టేడియంలో సీన్‌ను చూస్తే అదే గుర్తుకొచ్చింది. చుట్టూ మైదానంలో వేలాది మంది అభిమానులు కిందే కూర్చుండిపోయారు. అంతమందికి మ్యాచ్‌ కనబడుతుందో లేదో తెలియదు కానీ తాము ఆ మైదానంలో ఉండడమే ముఖ్యం అన్నట్లుగా జనం హాజరయ్యారు. కొందరైతే మైదానంలో స్థలం లేక సమీప బిల్డింగ్‌లు ఎక్కారు. ఇంకొందరు చెట్లు ఎక్కారు. ఆ సీన్లు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించకమానదు. ఎందుకంటే క్రికెట్‌ డోసు ఎక్కువై అభిమానులు స్టేడియాలకు వెళ్లడం తగ్గిస్తున్న ఈ రోజుల్లో.. ఇలా అభిమానులు ఎగబడి మ్యాచ్‌లకు రావడం కచ్చితంగా సంతోషించదగ్గ విషయమే. తమకోసం వెల్లువలా తరలొచ్చిన అభిమానులను నేపాల్‌ జట్టు కూడా నిరాశపరచలేదు. 8 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసి ఫైనల్‌కు దూసు వెళ్లింది. అంతేకాదు తొలిసారి టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించి ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. 

కొండలు..లోయల్లోనే

నేపాల్‌లో ఎక్కువ భాగం కొండలు, లోయలే ఉంటాయి. ఇక్కడ చదునైన నేల కనిపించేది చాలా తక్కువే. అందుకే క్రికెట్‌కు అనుకూలమైన స్థలాలు లేవు. కానీ క్రికెట్‌ను మతంలా ఆచరించే నేపాల్‌.. మున్‌పాని స్టేడియాన్ని నిర్మించుకుంది. ఏదైనా ఇక్కడ మ్యాచ్‌ జరిగితే చాలా మైదానం చుట్టూ ఓ జాతరలా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో ఏ స్టేడియాల్లో ఇలాంటి వాతావరణం చూడం. ఏ స్టేడియాల్లో అయినా కూర్చోవడానికి కుర్చీలు ఉంటాయి. మైదానంలో వసతులు ఉంటాయి. కానీ కొండలు గుట్టలు ఉండే ప్రాంతంలోనే నిర్మించిన ముల్‌పాని స్టేడియంలో ఇలాంటివేమి లేవు. అభిమానులు వచ్చి కింద కూర్చొని మ్యాచ్‌ చూడాల్సిందే. వేలాదిగా వచ్చే అభిమానులతో ఈ స్టేడియం కిక్కిరిసిపోతూ ఉంటుంది. వర్షం వచ్చినా.. వాతావరణం ఎలా ఉన్నా కూడా మ్యాచ్‌ ఉంటే అభిమానులు ఆగరు.

నేపాల్‌ జట్టు కూడా అభిమానుల ఆశలను నిలబెడుతోంది. అద్భుతమైన ఆటతో ఒక్కో మెట్టే ఎక్కుతోంది. ఇటీవల ఆసియా క్రీడల్లో అయితే నేపాల్‌ బ్యాటర్లు రికార్డుల వేటలో సాగారు. మంగోలియాతో మ్యాచ్‌లో టీ20ల్లో 300 పరుగులు చేసిన తొలి జట్టుగా ఈ నేపాల్‌ రికార్డు సాధించింది. అంతేకాదు కుశాల్‌ మల్లా 34 బంతుల్లోనే సెంచరీ చేసి వేగవంతమైన టీ20 రికార్డు ఖాతాలో వేసుకుంటే..దీపేంద్ర సింగ్‌ 9 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించి యువరాజ్‌సింగ్‌ (12 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. తమ దేశం ఇలా రికార్డుల మీద రికార్డులు సృష్టించడంతో నేపాల్‌ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయ్‌.. వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాలు చేతబూని సంబరాలు చేసుకున్నారు. 

                   - ఈనాడు క్రీడా విభాగం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని