T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌.. కొత్త సారథులు ఏం చేస్తారో మరి..!

టీ20 ప్రపంచకప్‌లో జట్టును నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. తాను రాణిస్తూనే సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి. గెలిచినా.. ఓడినా సమంగా స్వీకరించి మరీ తదుపరి పోరు కోసం జట్టును సమాయత్తం చేయాల్సిన బాధ్యత సారథులపై ఉంటుంది.

Updated : 20 Oct 2022 18:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం: జట్టును నడిపించడంలో సారథి కీలక పాత్ర పోషిస్తాడు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నాలి. ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలి. తీవ్ర ఒత్తిడి ఉండే టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో కెప్టెన్సీ నిర్వహించడం కత్తిమీద సామే. ఉత్తమమైన ఆటగాళ్లు ఉంటేనే సరిపోదు. కఠిన పరిస్థితుల్లో నిర్ణయాలు కూడా వేగంగా తీసుకొనే నాయకుడు ఉండాలి. అప్పుడే పొట్టి కప్‌ను ఒడిసిపట్టేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈసారి కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి.. ప్రపంచకప్‌ సమరంలోకి దిగిన నూతన సారథులు ఎవరు..? వారి ఫామ్‌ ఏంటి..? అనే విషయాలను తెలుసుకొందాం..

రోహిత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఓకే.. కానీ 

గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ దారుణ పరాభవం ఎదుర్కొంది. గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమై ఇంటిముఖం పట్టింది. దీంతో అప్పటి కెప్టెన్‌ విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. విరాట్ గైర్హాజరీలో అప్పుడప్పుడు జట్టు పగ్గాలను చేపట్టే రోహిత్ శర్మకు బీసీసీఐ పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. 2007లో భారత్ సాధించిన ప్రపంచకప్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ.. పదిహేనేళ్ల తర్వాత సారథ్యంతో బరిలోకి దిగడం విశేషం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకొంది. అయితే ఆసియా కప్‌లో మాత్రం భారత్‌ను సరిగా నడిపించలేకపోయాడు. ఫామ్‌పరంగా చూస్తే ఎప్పుడు ఎలా ఆడతాడో అంచనా వేయడం కష్టం. క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం భారీ స్కోర్లు బాదేస్తాడు. పవర్‌ప్లేలోనే ధాటిగా ఆడి పరుగులు రాబట్టేస్తాడు. 

అయితే కెప్టెన్‌గా కొన్నిసార్లు బౌలర్లను సమర్థంగా వినియోగించుకోవడంలో కాస్త వెనుకడుగు వేస్తుంటాడని విశ్లేషకుల అభిప్రాయం. అందుకు తగ్గట్టుగానే రోహిత్ కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. డెత్‌ ఓవర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ వంటి మీడియం పేసర్‌ను చాలా మ్యాచుల్లో ప్రత్యర్థి బ్యాటర్లు దంచికొట్టారు. తొలి పది ఓవర్లలో మాత్రం భువీ అద్భుతంగా బౌలింగ్‌ వేయగలడు. అలాంటి పేసర్‌తో తొలి ఓవర్లలోనే తన కోటాను పూర్తి చేయిస్తే బాగుండేదని క్రీడా పండితుల అభిప్రాయం. అలాగే తుది జట్టుపైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. రిషభ్‌ పంత్ / దినేశ్ కార్తిక్‌లో ఉత్తమంగా రాణించేవారినే తుది జట్టులోకి తీసుకోవాలి. ఆసీస్ ఫాస్ట్‌ పిచ్‌లపై పేసర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాప్‌ టీమ్‌లపై కెప్టెన్‌గా ఆడిన అనుభవం రోహిత్‌కు సొంతం. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత నుంచి ఇప్పటి వరకు రోహిత్ దాదాపు 30కిపైగా టీ20లను ఆడాడు. 


‘జోష్’ తెప్పించేనా..?

ఇంగ్లాండ్‌ను సెమీస్‌కు చేర్చిన కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌. అంతకుముందు 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌కు సాధించి పెట్టిన సారథి. అయితే ఫామ్‌పరంగా విమర్శలు ఎదురొచ్చినా.. జట్టును నడపడంలో మాత్రం అత్యుత్తమమే. అయితే గత జూన్‌లో  మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు వన్డే, టీ20 ఫార్మాట్‌లో జోస్‌ బట్లర్‌ను కెప్టెన్‌గా వచ్చాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 97 టీ20 మ్యాచ్‌లను ఆడిన బట్లర్‌.. బౌలర్లను ఊచకోత కోయడంలో దిట్ట. దూకుడుగా ఆడి ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకొస్తాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 150 పరుగులను బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. మన భారత టీ20 లీగ్‌లోనూ రాజస్థాన్‌ తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన క్రికెటర్లలో బట్లర్‌ ఒకడు. 

ఇంగ్లాండ్‌కు కొత్త సారథిగా జోస్ బట్లర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి టీమ్‌ఇండియాతోనే సిరీస్‌లు ఆడటం గమనార్హం. మూడు టీ20ల సిరీస్‌లో బ్యాటర్‌గా రాణించిన బట్లర్‌ కెప్టెన్‌ పాత్రకు మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఆ సిరీస్‌ భారత్‌ కైవసం చేసుకొంది. అయితే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను బట్లర్‌ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌ సొంతం చేసుకొంది. ఈ సిరీస్‌లో బట్లర్‌ బ్యాటింగ్‌లోనూ అదరగొట్టేశాడు. ఈ క్రమంలో తొలిసారి బట్లర్‌ మెగా టోర్నీ బరిలోకి దిగాడు. తన బ్యాటింగ్‌, కెప్టెన్సీ సాయంతో ఇంగ్లాండ్‌ను విజేతగా నిలపాలని ఆ దేశ అభిమానులు కోరుకుంటున్నారు. 


షకిబ్‌.. ఆగయా..

బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు తీసుకొనే నిర్ణయాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. అంచనాలకు అందవు. తుది జట్టులోకి ఎవరిని ఎంపిక చేయాలి.. కెప్టెన్‌గా ఎవరిని నియమించాలి.. అనే విషయాలపై క్లారిటీ ఇచ్చిన దాఖలాలు లేవు. అంతేకాకుండా గత టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన ఆటగాడికి ఈసారి జట్టులో స్థానమే లేదంటే నమ్మగలమా..? ఇలాంటి అద్భుతం బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో చోటు చేసుకుంది. యూఏఈ వేదికగా జరిగిన 2021 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లా కెప్టెన్‌ మహమ్ముదుల్లా. కానీ ఆసీస్‌లో జరుగుతున్న పొట్టి కప్‌లో మాత్రం ఆడటం లేదు. అతడి స్థానంలో సీనియర్‌ ప్లేయర్ షకిబ్ అల్ హసన్‌ జట్టు పగ్గాలు చేపట్టాడు. దుందుడుకు ప్రవర్తనతో విమర్శలపాలైన షకిబ్.. ప్రపంచకప్‌ ముందే మళ్లీ బంగ్లా కెప్టెన్‌ కావడం క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది. 

టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ ఆల్‌రౌండర్ స్థానం షకిబ్‌దే. దాదాపు రెండేళ్ల నుంచి అతడే మొదటి ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌ ఓడినా.. ఫామ్ పరంగా షకిబ్‌ అత్యుత్తమంగా ఉన్నాడు. గత పది టీ20 మ్యాచుల్లో మూడు అర్ధశతకాలు బాదాడు. పాక్‌, విండీస్, న్యూజిలాండ్ జట్ల మీద చేయడం విశేషం. అయితే బౌలింగ్‌ పరంగా మాత్రం పేలవమైన ప్రదర్శన చేశాడు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచుల్లో కేవలం ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. ఎకానమీ (7.52) కాస్త ఫర్వాలేదు. అయితే ఇలాంటి ప్రదర్శనతో జట్టును నడిపించడం కష్టసాధ్యమే.


పొలార్డ్‌ పోయే.. పూరన్ వచ్చే..

వెస్టిండీస్‌ అంటే మొన్నటిదాకా హార్డ్‌ హిట్టర్ల జట్టు. క్రిస్ గేల్, కీరన్‌ పొలార్డ్, ఆండ్రూ రస్సెల్‌ వంటి భారీ హిట్టింగ్‌ బ్యాటర్లు ఉన్న టీమ్‌. రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను నెగ్గిన ఏకైక జట్టు. అలాంటిది ఈసారి మాత్రం ఆ ముగ్గురు లేకుండానే బరిలోకి దిగింది. అదీనూ క్వాలిఫయిర్‌ మ్యాచ్‌ల్లో గెలిస్తేనే సూపర్‌-12లోకి అడుగు పెట్టేందుకు అర్హత లభించనుంది. 2016లో వెస్టిండీస్‌ జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన నికోలస్‌ పూరన్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కీరన్ పొలార్డ్‌ స్థానంలో గత మే నెలలో జట్టు పగ్గాలను అందుకొన్నాడు. తొలిసారి మెగా టోర్నీలోకి అడుగు పెట్టాడు. 

నికోలస్‌ పూరన్‌ ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడలేదు. కెరీర్‌లో 52 వన్డేలు, 67 టీ20ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ప్రస్తుతం ఫామ్‌పరంగా రాణించిదేమీ లేదు. గత పది టీ20లను పరిశీలిస్తే.. ఒక్కటంటే ఒక్క అర్ధ శతకం లేదు. కేవలం మూడు సార్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించాడు. బ్యాటింగ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌గా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం దూకుడుగానే ఉంటాడు. క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లో కీలకమైన జింబాబ్వేతో మ్యాచ్‌ సందర్భంగా బౌలర్లను వాడుకొన్న విధానం ఆకట్టుకొంది. అయితే బ్యాటింగ్‌లో కూడా రాణిస్తేనే సహచరుల్లో నమ్మకం కలిగించేందుకు అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని