T20 WC 2024: కొత్త జట్లు దూసుకొస్తున్నాయ్‌

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) కొత్త జట్లను చూడబోతున్నాం. క్వాలిఫయర్స్‌ మ్యాచుల్లో అదరగొట్టిన ఆయా జట్లు అర్హత సాధించాయి. 

Published : 05 Dec 2023 17:41 IST

క్రికెట్‌ అనగానే ఒకప్పుడు కొన్ని జట్లే గుర్తొచ్చేవి. ఆ పది జట్లే పెద్ద టోర్నీల్లోనూ ఆడేవి. కెన్యా లాంటి జట్లు కొన్ని మెరుపులు మెరిపించినా ఆ తర్వాత అవి కనిపించకుండాపోయాయి. అందుకే క్రికెట్‌ అంటే కొన్ని జట్లకే పరిమితం అన్నట్లు చాలా ఏళ్లు నడిచింది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారింది. కానీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో క్రికెట్‌ వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో కొత్త జట్లు దూసుకొస్తున్నాయి. పెద్ద టోర్నీలకు అర్హత సాధిస్తూ ఆకట్టుకుంటున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) అలాంటి జట్లు రానున్నాయి. ఇప్పటికే నేపాల్, పపువా న్యూగినియా, కెనడా, నమీబియా, ఉగాండా లాంటి చిన్న జట్లు మెగా టోర్నీకి అర్హత సాధించి సత్తా చాటాయి. 

ఫార్మాట్‌ వల్లే

2024 టీ20 ప్రపంచకప్‌ ఫార్మాట్‌ ఎక్కువ చిన్న జట్లకు అవకాశాన్ని కల్పిస్తోంది. తమ కెరీర్‌లో పెద్ద స్టార్లతో ఆడతామా అని కలలు కన్న చిన్న జట్ల ఆటగాళ్లకు విరాట్‌ కోహ్లి, వార్నర్‌ లాంటి యోధులతో కలిసి మైదానాన్ని పంచుకునే అవకాశం కలుగుతోంది. వెస్టిండీస్‌-అమెరికా వేదికగా జరుగుతున్న 2024 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలో 20 జట్లు ఆడే ఛాన్స్‌ ఉండడంతో ర్యాంకుల్లో తొలి పది స్థానాల్లో ఉన్న జట్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతీయ టోర్నీల్లో సత్తా చాటిన జట్లు ముందంజ వేస్తున్నాయి.. దీంతో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి టాప్‌ జట్లతో తలపడే అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నాయి. పెద్ద జట్లపై ఒక్క మ్యాచ్‌ గెలిచినా అదో పెద్ద సంచలనమే అవుతుంది. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ సాధించిన విజయాలను అభిమానులు మరిచిపోలేరు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టుకు షాక్‌ ఇవ్వడం ఎవరూ ఊహించలేదు. మాల్టా లాంటి చిన్న దేశాలు కూడా క్రికెట్లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మిగిలిన ఆటల్లో టాప్‌ దేశంగా ఉండే అమెరికా కూడా ఇప్పుడు క్రికెట్‌పై దృష్టి పెట్టింది. మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ పేరిట జరిగిన టీ20 లీగ్‌కు మంచి ఆదరణ లభించింది. టీ20 ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీకి తొలిసారి అమెరికా ఆతిథ్యం ఇస్తోంది. ఈ కప్‌ రాకతో తమ దేశంలో క్రికెట్‌ మరింతగా విస్తరిస్తుందని.. అభిమానుల్లో ఆదరణ ఇంకా పెరుగుతుందని యుఎస్‌ క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

చిన్న జట్లే అనుకుంటే

ప్రపంచకప్‌కు అర్హత సాధించడమే కాదు కొన్ని టోర్నీల్లో పెద్ద జట్లకు ఝులక్‌ ఇచ్చి ఉనికిని చాటుకుంటున్నాయి పసికూనలు. తాజాగా జింబాబ్వేపై ఉగాండా విజయం అలాంటిదే. నిజానికి ఉగాండా అనే జట్టు ఒకటుందన్న విషయం కూడా అభిమానులకు తెలియదు. అలాంటిది చిన్న జట్లలో కాస్త పెద్ద జట్టయిన...గతంలో ఓ మోస్తరు జట్టుగా కొనసాగిన జింబాబ్వేపై గెలవడం నిజంగా అభినందించదగ్గ విషయమే. ఇక సదుపాయాలు లేకపోయినా నేపాల్‌ జట్టు చేస్తున్న సంచలన ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కిడ్స్‌ ఏకంగా ప్రపంచ రికార్డులనే కొల్లగొట్టేస్తున్నారు. ఆసియాక్రీడల్లో టీ20 ఫార్మాట్లోనే సంచలన ప్రదర్శన చేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే కాదు ఐరోపా దేశాల్లో క్రికెట్‌ వేగంగా విస్తరించి ముందుకెళ్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. అమెరికాతో పాటు స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్‌ లాంటి దేశాలు కూడా క్రికెట్లో వేగంగా అడుగులు వేస్తున్నాయి. 2026 లాస్‌ఏంజెలస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన నేపథ్యంలో ఈ ఆట విశ్వ క్రీడగా మారడానికి ఎంతో కాలం పట్టదు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని