WTC Final: శ్రీలంక ఓడింది.. భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లింది

ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు (IND vs AUS) ఫలితం రాకముందే రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన టెస్టులో న్యూజిలాండ్‌ చేతిలో శ్రీలంక ఓటమి చవిచూసింది.

Updated : 13 Mar 2023 12:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కేన్‌ మామ టీమ్‌ఇండియాను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేర్చాడు. ఇదేంటి..? న్యూజిలాండ్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్సన్‌కు.. భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా..?  శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో న్యూజిలాండ్‌ను కేన్‌ విలియమ్సన్‌ విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు డ్రా అయినా సరే టీమ్‌ఇండియా మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లిపోయింది. 

శ్రీలంకతో తొలి టెస్టులో 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి.. 70 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసిన న్యూజిలాండ్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేన్ విలియమ్సన్‌ (121*) సెంచరీతోపాటు డారిల్‌ మిచెల్ (81) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టామ్‌ లేథమ్ 24, డేవన్ కాన్వే 5, హెన్రీ నికోల్స్ 20, మిచెల్‌ బ్రాస్‌వెల్ 10, బ్లండెల్ 3 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3, జయసూరియ 2.. రజిత, లాహిరు కుమార చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ దీటుగా స్పందించి 373 పరుగులు చేసి 18 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 302 పరుగులకు ఆలౌటైంది. 

ఫ్రెండ్స్‌ ఇద్దరూ..

అండర్ -19 నుంచి టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌ మంచి స్నేహితులు. గత కొంతకాలంగా టెస్టుల్లో సెంచరీ కోసం ఎదురు చూస్తున్న వీరిద్దరూ.. తాజాగా ఆ మార్క్‌ను సాధించారు. ఆసీస్‌పై నాలుగో టెస్టులో విరాట్ 186 పరుగులు సాధించగా.. ఇప్పుడు కేన్ చవరి వరకూ క్రీజ్‌లో నిలిచి 121 పరుగులు చేసి కివీస్‌ను గెలిపించాడు. విరాట్‌కది 28వ శతకం కాగా.. కేన్‌ 27వ సెంచరీని పూర్తి చేశాడు.

పాయింట్ల పట్టికలో ఇలా..

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 68.52 శాతంతో ఆసీస్‌ ఉండగా.. భారత్ 60.29 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే వెస్టిండీస్‌పై సిరీస్‌ను గెలిచిన దక్షిణాఫ్రికా 55.56 శాతంతో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక కివీస్‌ చేతిలో తొలి టెస్టులో ఓటమిపాలైన శ్రీలంక 48.48 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు భారత్ - ఆసీస్‌ నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా స్థానాల్లో మార్పు ఉండకపోవచ్చు. కానీ, శాతం మారే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని