Nikhat Zareen : నిఖత్‌ పసిడి పంచ్‌.. నాలుగో స్థానానికి భారత్‌

తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్ కామన్వెల్త్‌లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో...

Updated : 07 Aug 2022 20:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్ (Nikhat zareen) కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో నార్తన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. దీంతో భారత్‌ ఖాతాలో 17వ స్వర్ణం వచ్చి చేరింది. క్వార్టర్స్‌లో వేల్స్‌ బాక్సర్ హెలెన్ జోన్స్‌పై 5-0 తేడాతో, సెమీస్‌లో ఇంగ్లాండ్‌ బాక్సర్‌ సావనా అల్ఫియాపై 5-0తో అజేయంగా విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగు పెట్టిన నిఖత్‌ ఇక్కడా అదే అద్భుత ప్రదర్శన చేసింది. తుదిపోరులోనూ కార్లేపై 5-0తో గెలిచి పసిడి పతకం అందుకుంది. మొత్తం పతకాల సంఖ్య 48కి చేరగా.. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది.

ఈ ఏడాది మే నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లోనూ నిఖత్‌ అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా కామన్వెల్త్‌ క్రీడా పోటీల్లోనూ తన ప్రత్యర్థి, నార్తన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై బౌట్లో ఆరంభం నుంచే శివంగిలా విరుచుకుపడిన నిఖత్‌.. తన పవర్‌ పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేసింది. 

గతంలో నిఖత్‌ మెరుపులు..

🥊 టర్కీలో జరిగిన 2011 ప్రపంచ జూనియర్‌, యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం.

🥊 2014 నేషన్స్‌ కప్‌లో స్వర్ణం

🥊 2015 జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

🥊 2016 దక్షిణాసియా ఫెడరేషన్‌ క్రీడల్లో కాంస్యం

🥊 2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణం

🥊 2019 థాయ్‌లాండ్‌  ఓపెన్లో రజతం

🥊 2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి

🥊 2022 మే నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైంది: కేసీఆర్‌

కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన జరీన్‌కు అభినందనలు తెలిపారు. ఆమె గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తోందని కేసీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని