T20 World Cup: వరల్డ్‌కప్‌ స్క్వాడ్‌ సభ్యులు లేకుండా.. ఐపీఎల్‌ టాప్‌-2 జట్లా?

ఈ సారి ఐపీఎల్‌ టాప్‌లో ఉన్న కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. రెండు జట్ల నుంచి టీమ్‌ ఇండియాలో స్థానం దక్కించుకొన్న ఒక్క ఆటగాడు కూడా లేడు. 

Updated : 21 May 2024 15:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్లే ఆఫ్స్‌ నాటికి ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ జట్లకు ఓ ప్రత్యేకత ఉంది. వీటిల్లో వచ్చేనెల టీమ్‌ ఇండియా తరఫున టీ20 ప్రపంచకప్‌ ఆడే 15 మంది ఆటగాళ్లలో ఒక్కరు కూడా లేరు. కేకేఆర్‌కు చెందిన రింకు సింగ్‌ మాత్రం రిజర్వు ఆటగాడిగా ఉన్నాడు. ఈ టోర్నీ(ఐపీఎల్‌)లో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్‌లో అత్యధికంగా నలుగురు, దిల్లీ క్యాపిటల్స్‌లో ముగ్గురు చొప్పున ఉన్నారు. టోర్నిలోని మొత్తం నాలుగు జట్ల నుంచి ఒక్క భారతీయ ఆటగాడు కూడా ప్రపంచకప్‌ బృందంలో స్థానం దక్కించుకోలేకపోవడం విశేషం. 

  • కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌తోపాటు జీటీ, ఎల్‌ఎస్‌జీ నుంచీ ఎవరూ లేరు. ఆర్‌ఆర్‌ జట్టులో జైస్వాల్‌, సంజూ, చాహల్‌ ఉన్నారు. ఆర్సీబీ నుంచి కోహ్లీ, సిరాజ్‌ స్థానం దక్కించుకొన్నారు. సీఎస్‌కేలో భాగమైన దుబే, జడేజా ప్రపంచకప్‌ ఆడుతున్నారు. డీసీలో పంత్‌, పటేల్‌, కుల్దీప్‌ ఉండగా.. ముంబయి నుంచి రోహిత్‌, హార్దిక్‌, సూర్య, బుమ్రాలు జాతీయ టీ20 జట్టులో ఉన్నారు. 

నలుగురు స్పిన్నర్లా.. రింకూలో ఆ సత్తా ఉంది..: హర్భజన్‌ సింగ్

ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన జట్టులో సమతూకంపై మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌  (Harbhajan Singh)పెదవి విరిచాడు. స్పిన్నర్లను అధికంగా తీసుకొని సీమర్లను తగ్గించారన్నాడు. నలుగురు స్పిన్నర్లు జట్టుకు భారమవుతారేమోన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతడు మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రపంచకప్‌ జట్టులో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బాగుంది. కానీ, రింకూ సింగ్‌కు స్థానం దక్కకపోవడంపై బాధగా ఉంది. అతడు మ్యాచ్‌ ఫినిషింగ్‌ వేళ 20 బంతుల్లో 60 పరుగులు చేయగలడు. ఇక జట్టులో మరో సీమర్‌ అవసరం ఉంది. నలుగరు స్పిన్నర్లు కొంచెం ఎక్కువే. ముగ్గురు సరిపోతారనుకుంటున్నా. భారత్‌ జట్టు కప్పును తీసుకురావాలని ఆశిస్తున్నా. 

ఇక తుది జట్టులో జడ్డూ, చాహల్‌, కుల్దీప్‌లు ఉండొచ్చని భావిస్తున్నాను. పిచ్‌ కండీషన్లను ఆధారంగా ఈ కాంబినేషన్‌ మారుతుంది. పాక్‌తో మ్యాచ్‌ను మనం గెలుస్తామని నమ్ముతున్నాను. వారిపై మంచి రికార్డు, మెరుగైన టీమ్‌ మన సొంతం. సూపర్‌ 8లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి జట్లతో తలపడే సమయంలో శ్రమించాల్సి రావచ్చు. ఇక గాయాన్ని అధిగమించి పంత్‌ తిరిగి జాతీయ జట్టులో చేరాడు. మంచి ఫిట్‌నెస్‌తో మెరుగ్గా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అదే సమయంలో వికెట్‌ కీపింగ్‌లో కూడా అదరగొడుతున్నాడు. ఈ సారి టోర్నీలో సంజూకు ఛాన్స్‌ వస్తుందని అనుకొంటున్నాను. నిలకడగా రాణిస్తూ 60, 70 స్కోర్లు చేస్తున్నాడు’’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు.  జూన్‌ 5 నుంచి టీ20 ప్రపంచకప్‌లో భారత పోరాటం మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని