MS Dhoni: వింటేజ్‌ ధోనీ... కీపింగ్‌ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!

తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్‌కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. 

Published : 03 Apr 2024 00:05 IST

వేదిక ఏదన్నది ముఖ్యం కాదు.. ప్రత్యర్థి ఎవరన్న ఆలోచనే లేదు. మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) దిగుతుంటే అభిమానులు కేరింతలు కొట్టారు. ఆఖరి సీజన్‌ (IPL) ఆడేస్తున్నాడన్న సందేశం అభిమానుల్లోకి వెళ్లడంతో మైదానాలు పసుపురంగు పులుముకుంటున్నాయి. ధోనీ జపంతో స్టేడియాలు దద్దరిల్లుతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో చెన్నై, దిల్లీ మ్యాచ్‌ ఇందుకు ఉదాహరణ. దిల్లీ సొంత మైదానంగా ఎంచుకున్న విశాఖలోని ఏసీఏ స్టేడియం చెన్నైలో చెపాక్‌ స్టేడియాన్ని మరిపించింది. ఆఖర్లో ధోని బాదేస్తుంటే చెన్నై ఓడిందా లేక దిల్లీ గెలిచిందా అనేది అర్థం కాలేదు. అదే ఎంఎస్‌డీ మ్యాజిక్కు.

ఆ బాధతోనూ...

తాను ఆడుతుందే అభిమానుల కోసం అన్నట్లుగా ఐపీఎల్‌ 17కి సిద్ధయ్యాడు ధోని. 40 ఏళ్ల పైన వయసులో అతడిలోని వింటేజ్‌ ధోనీ బయటకు వస్తుంటే ఫ్యాన్స్‌ హుషారెత్తిపోతున్నారు. మైదానంలో అతడి ఉనికి ఉంటే చాలు అన్నట్టు చెన్నై మ్యాచ్‌కు అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. వికెట్‌ కీపింగ్‌ మెరుపులకు తోడు కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను వెనకుండి నడిపిస్తూ మహీ చెన్నైకి వెన్నెముకగా నిలుస్తున్నాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జట్టు ఓడిపోయే పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన ఎంఎస్‌డీ.. మ్యాచ్‌ ముగిశాక అభిమానులను ఊగిపోయేలా చేశాడు. 

అతడేం మ్యాచ్‌ను గెలిపించలేదు.. కానీ మునుపటి శైలిలో ఇరగదీశాడు. ఒంటి చేత్తో సిక్స్‌లు, ఆఫ్‌ సైడ్‌ బలమైన షాట్లతో అదరగొట్టాడు. మ్యాచ్‌ పూర్తయ్యాక ధోని కుంటుతూ పెవిలియన్‌ చేరడం కనిపించింది. సుదీర్ఘంగా అతడు కాలి గాయంతో బాధపడడమే ఇందుకు కారణం. ఎడమ కాలికి ఐస్‌ ప్యాక్‌లను ధరించి దిల్లీ ఆటగాళ్లతో మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. అంతటి బాధలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడావ్‌ అంటూ అభిమానులు మహీని పొగుడుతున్నారు. బ్యాటింగ్‌లో కాస్త ముందు వచ్చిఉంటే ధోనీ మరోసారి మ్యాచ్‌ను ఫినిష్‌ చేసేవాడని అంటున్నారు.

రికార్డుల్లోనూ ముందుకు

టీ20ల్లో 300 డిస్మిసల్స్‌ సాధించిన తొలి వికెట్‌కీపర్‌గా అతడు ఘనత సాధించాడు.  42 ఏళ్ల వయసులో ధోనీ వికెట్ల వెనక చురుగ్గా ఉంటున్న తీరును మెచ్చుకోవాల్సిందే. మునుపటి సీజన్‌ కంటే బలంగా తయారైన మహీ.. డైవ్‌ చేసి మరీ క్యాచ్‌లు అందుకుంటున్న తీరు అద్భుతం. బ్యాటర్‌గానూ అతడు ఈ ఐపీఎల్‌ సీజన్లో ఇప్పటికే కొన్ని ఘనతలు ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో 7000 పరుగులు సాధించిన తొలి ఆసియా వికెట్‌కీపర్‌గా నిలిచాడు. ఒక్క ఐపీఎల్‌ టోర్నీలోనే అతడు 5000 పైన పరుగులు సాధించాడు. 

ఐపీఎల్‌-17 మొదలుకాక ముందు ధోనీ అన్ని మ్యాచ్‌ల్లో బరిలో దిగడని.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా మాత్రమే బరిలో దిగుతాడని ఏవేవో వార్తలు వచ్చాయి. కానీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో ధోనీ ఆట చూసిన అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.. ఒకప్పటి మహీలా పొడవాటి జుట్టే కాదు.. అప్పటి ఆట కూడా తిరిగొచ్చిందని సంబరపడుతున్నారు. మహీ ఇదే జోరు కొనసాగిస్తే మున్ముందు ఇంకెంత మురిపిస్తాడో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని