Ind vs NZ @ Uppal: ఉప్పల్‌లో ఇప్పటివరకు హీరోలు వీరే.. బుధవారం ఎవరవుతారో?

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ (Uppal Stadium)లో ఇప్పటివరకు ఆరు వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో మూడింటిలో భారత్‌ (Team India) గెలుపొందింది. మరి ఆయా మ్యాచ్‌ల్లో హీరోలెవరో చూద్దామా?

Updated : 17 Jan 2023 16:58 IST

టీమ్‌ ఇండియాకు బాగా కలిసొచ్చే మైదానాల్లో హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం ఒకటి. ఇక్కడ జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ ఘన విజయం సాధించింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక హ్యాట్రిక్‌ను పూర్తి చేసుకున్న భారత్... రెండో హ్యాట్రిక్‌ను బుధవారం ప్రారంభిచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ మైదానంలో మన జట్టు ట్రెండ్‌ ఎలా ఉంది? ఏ మ్యాచ్‌ హీరోలు ఎవరో చూద్దాం!

తొలి మ్యాచ్‌లో ఏమైందంటే...

11 మంది జట్టులో ముగ్గురే సరిగ్గా ఆడితే ఎలా ఉంటుంది, ఎంత కొడతారు, ఫలితం ఏమవుతుంది? ఇలాంటి వాటికి క్లియర్‌ పిక్చర్‌ కావాలంటే ఉప్పల్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ చూస్తే సరి. నవంబరు 16, 2005న జరిగిన ఈ మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ సెంచరీ (103) సాయంతో భారత్‌ 249 పరుగులు చేసింది. ఇర్ఫాన్‌  పఠాన్‌ (46), హర్భజన్‌  సింగ్‌ (37) కాస్త సాయం చేశారు. అయితే ఈ స్కోరు ప్రత్యర్థి దక్షిణాఫ్రికాకు సులభంగానే కనిపించింది. వాళ్ల టాప్‌ ఆర్డర్‌ సరిగ్గా ఆడకపోయినా.. మిగిలిన వాళ్లు రాణించడంతో ఆ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. 


యువ‘రాజసం’ వృథా..

టాప్‌ ఆర్డర్‌ టపాటపా రాలిపోవడం, మిడిలార్డర్‌ మధ్యలో చేతులెత్తేయడం.. విజయాన్ని కోల్పోవడం చూడాలంటే ఉప్పల్‌ మైదానంలో జరిగిన రెండో మ్యాచ్‌కు వెళ్లాల్సిందే. అక్టోబరు 5, 2007న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 291 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ముందుఉంచింది. దీన్ని అందుకునే క్రమంలో 13 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది భారత్. సచిన్‌ (43), యువరాజ్‌ సింగ్‌ (121), ధోనీ (33) ప్రయత్నించినా .. ఆ స్కోరును అందుకోలేకపోయింది భారత్‌.  మిగిలిన భారత బ్యాటర్లలో ఒకరిద్దరు ఆడున్నా.. ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా గెలిచేదే. 


సచిన్‌ అదరగొట్టినా...

భారీ స్కోరు అంటే సుమారు 300 అనుకునే రోజుల్లో... 350 పరుగులు చేసి వావ్‌ అనిపించారు కంగారూలు. నవంబరు 5, 2009లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు మనవాళ్ల మీద విరుచుకుపడ్డారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ను సచిన్‌ తెందూల్కర్‌ (175) దాదాపు గెలిపించినంత పని చేశాడు. సురేశ్‌ రైనా  (59), సెహ్వాగ్‌ (38) మినహా అందరూ విఫలమవ్వడంతో సచిన్‌ భారీ సెంచరీ వృథా అయిపోయింది. ఆఖరి ఓవర్‌లో ఒకే వికెట్‌ ఉండి, ఎనిమిది పరుగులు చేయాల్సి వస్తే.. మన బ్యాటర్ ఒత్తిడికి లోనై రనౌట్‌ రూపంలో వికెట్‌ పారేసుకుని పరాజయం మూటగట్టుకున్నారు.


ధోనీయిజం రోజుల్లో..

ఉప్పల్‌లో భారత్‌కు విజయం కష్టమే అనుకుంటున్న రోజులవి. వరుసగా ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లో ఓటమిపాలవడంతో.. ఏకంగా మైదానం మీదే విమర్శలు వచ్చాయి. జట్టులో ఎన్నో మార్పులకు కారణమైన మహేంద్ర సింగ్‌ ధోనీ..  ఈ మ్యాచ్‌తో ఉప్పల్‌ జాతకాన్నే మార్చేశాడు. ఇంగ్లాండ్‌తో అక్టోబరు 14, 2011న జరిగిన మ్యాచ్‌ను 126 పరుగుల తేడాతో గెలిపించి ఈ మైదానంలో భారత్‌కు తొలి వన్డే విజయం అందించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ధోనీ (87*), సురేశ్‌ రైనా (61) అర్ధ శతకాలతో రాణించి 300 పరుగులు ఇచ్చారు. తరువాత బరిలోకి దిగిన ఇంగ్లిష్‌ జట్టు మన బౌలర్ల ధాటికి 174 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. 


టాప్‌ ఆర్డర్‌ ఆట...

హైదరాబాద్‌లో ఛేజింగ్‌ విజయాన్ని అందిస్తుంది అంటుంటారు. శ్రీలంకపై అలానే ఆడి విజయం సాధించింది భారత్‌. నవంబరు 9, 2014న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంకేయులు మహేల జయవర్దనె (118) శతకంతో 242 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కు శిఖర్‌ ధావన్‌ (91) అర్ధ శతక (దాదాపు సెంచరీ) ప్రదర్శన విజయాన్ని తీసుకొచ్చింది. అజింక్య రహానె (31), అంబటి రాయుడు (35), విరాట్‌ కోహ్లీ (53) మంచి సహకారం అందించారు. మరో ఆరు ఓవర్ల ఆట ఉండగానే భారత్‌ గెలుపొందింది.


కేదార్‌తో కలసి అదరగొట్టి...

మిడిలార్డర్‌లో ధోనీ - కేదార్‌ జాదవ్‌ జోడీ మరపురాని విజయాలు అందించారు. అలా ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ మైదానంలోనూ ఓ మ్యాచ్‌ను గెలిపించారు. మార్చి 2, 2019న జరిగిన వన్డేలో క్రికెట్‌ ఫ్యాన్స్‌కి ధోనీ స్పెషల్‌ పార్టనర్‌షిప్‌ చూసే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 236 పరుగులు చేసింది. బదులుగా భారత్‌ ఆరంభంలో బాగుందనిపించినా.. మధ్యలో కాస్త ఇబ్బందిపడింది. రోహిత్‌ శర్మ (37), విరాట్‌ కోహ్లీ (44) రాణించినా.. శిఖర్‌ ధావన్‌ (0), అంబటి రాయుడు (13) నిరాశపరిచారు. అయితే  ఎంఎస్‌ ధోనీ (59*), కేదార్‌ జాదవ్‌ (81*) అజేయ అర్ధ శతకాలతో టీమ్‌ ఇండియాకు ఆరు వికెట్ల ఘన విజయం అందించారు.

బుధవారం హీరో ఎవరో?
ముందుగా చెప్పుకున్నట్లు ఉప్పల్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం బుధవారం టీమ్‌ ఇండియా సిద్ధమవుతోంది. న్యూజిలాండ్‌తో జరగబోయే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విరాట్‌ కోహ్లీ కీలకం అవుతాడు. గత సిరీస్‌లో (శ్రీలంక) రెండు శతకాలతో జోరు మీద ఉన్నాడు. అతనితోపాటు రోహిత్‌ శర్మ, సూర్య కుమార్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌ మీద కూడా ఓ లుక్‌ వేయొచ్చు. శ్రేయస్‌ అయ్యర్‌ ఉంటే సూర్య ఉండడు అనేలా మన జట్టు పరిస్థితి ఉండేది. అయితే గాయం కారణంగా అయ్యర్‌ జట్టుకు దూరం కావడంతో.. కివీస్‌ వన్డే సిరీస్‌ ఫైనల్‌ 11లో సూర్య కూడా ఉంటాడు అని ఫిక్స్ అవ్వొచ్చు. కాబట్టి బుధవారం ఎవరు అదరగొడతారో చూడాలి. ఇద్దరు సెంచరీలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇది బ్యాటింగ్‌కి బాగా అనుకూలమైన పిచ్‌ మరి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని