WI vs IND: విండీస్‌తో వన్డే సిరీస్‌.. ఆసియా ట్రోఫీకి అంకురార్పణ!

విండీస్‌తో టెస్టు సిరీస్‌ను భారత్‌ దక్కించుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇదే జోరును భారత్‌ తర్వాతి సిరీస్‌ల్లో కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు.

Updated : 26 Jul 2023 15:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వర్షం కారణంగా రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న టీమ్ఇండియా.. గురువారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధం కానుంది. ఆసియా కప్‌ టోర్నీకి ముందు భారత్‌ ఆడే చివరి వన్డే సిరీస్‌ ఇదే. ఆ తర్వాత వచ్చే వన్డే ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా సద్వినియోగం చేసుకోవాలి. టెస్టుల్లో కనీసం పోరాడలేకపోయిన విండీస్‌ను ఈసారి తక్కువగా అంచనా వేయకూడదు. స్టార్లతో కూడిన జట్టునే ఎంపిక చేయడంతో పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఓపెనర్లుగా ఎవరు వస్తారు? 

ఇప్పుడు బరిలోకి దిగే కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు లేకుండానే మెగా టోర్నీని టీమ్‌ఇండియా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఎప్పటిలానే శుభ్‌మన్‌ గిల్‌కే వస్తుందా..? లేకపోతే రుతురాజ్‌ గైక్వాడ్‌కు అవకాశం ఇస్తారా? అనేది ప్రశ్నార్థకం. మూడో స్థానంలో ఎలాగూ విరాట్ కోహ్లీ ఉండనే ఉంటాడు. సూర్యకుమార్‌, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లో ఇద్దరు మాత్రమే తుది జట్టులోకి వస్తారు. సూర్యకుమార్‌కు వన్డేల్లో పెద్దగా రికార్డులు లేవు. కానీ, ఇటీవల ఐపీఎల్‌ సీజన్‌లో సూపర్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సంజూ శాంసన్‌ ఫర్వాలేదు. అదేవిధంగా వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఇషాన్‌ కిషన్‌ను పక్కన పెట్టడం కష్టమే. వికెట్ కీపర్‌గా కిషన్‌కే ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. 

తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు?

బౌలింగ్‌ విభాగం విషయానికొస్తే.. వైస్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో సీమర్లు ముకేశ్‌ కుమార్‌, సిరాజ్‌ తుది జట్టులో ఉంటారు. ఉమ్రాన్‌ మాలిక్, జయ్‌దేవ్‌కు నిరీక్షణ తప్పదు. ఇక స్పెషలిస్ట్‌ స్పిన్నర్ల జాబితాలో కుల్‌దీప్‌ను తీసుకునేందుకు అవకాశాలు పుష్కలం. అయితే, మణికట్టు మాంత్రికుడు చాహల్‌ను పక్కన పెట్టడం కష్టమే. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ ఇద్దరినీ తీసుకుంటే బ్యాటింగ్‌కూ ఉపయోగపడతారు. అప్పుడు ప్రత్యేకంగా మరో బ్యాటర్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు అందుబాటులో ఉన్నట్లు ఉంటుంది. ఇందులో ముగ్గురు బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు కావడం విశేషం.

హెట్‌మయర్‌ వచ్చాడు..

హార్డ్‌ హిట్టర్‌ హెట్‌మయర్‌, పేసర్‌ ఒషేన్‌ థామస్‌ వెస్టిండీస్‌ వన్డే జట్టులోకి పునరాగమనం చేశారు. భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వారికి స్థానం లభించింది. నికోలస్‌ పూరన్‌, జేసన్‌ హోల్డర్‌ సెలక్షన్‌కు అందుబాటులో లేరు. హెట్‌మయర్‌ దాదాపు ఏడాదిగా ఏ ఫార్మాట్లోనూ విండీస్‌ జట్టులో లేడు. అతడు చివరిసారి 2021 జులైలో వన్డే మ్యాచ్‌ ఆడాడు. సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నా.. ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌కు విండీస్‌ సెలక్టర్లు అతణ్ని ఎంపిక చేయలేదు. విండీస్‌ వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించని సంగతి తెలిసిందే.

భారత్‌, విండీస్‌ల మధ్య తొలి రెండు వన్డేలు ఈ నెల 27, 29వ తేదీల్లో కింగ్‌స్టన్‌లో జరుగుతాయి. ఆగస్టు 1న మూడో వన్డేకు ట్రినిడాడ్‌ ఆతిథ్యమిస్తుంది. వన్డేల తర్వాత రెండు జట్లు అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి.

జట్లు: 

భారత్:  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర  చాహల్, కుల్‌దీప్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్‌ కుమార్‌

విండీస్‌: షై హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్‌ కెప్టెన్), అలిక్ అథనేజ్, యనిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రోన్ హెట్‌మయేర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కేల్‌ మేయర్స్, మోతీ, జయ్‌దెన్ సీలెస్, రొమారియో షెఫెర్డ్, కెవిన్‌ సిన్‌క్లెయిర్‌, ఓషానె థామస్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని