World Cup 2023: ప్రపంచకప్‌లో సంచలనాల జోరు

12 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ (World Cup 2023).. మొట్టమొదటి సారి భారత్‌ సొంతంగా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ.. క్రికెట్‌ అంటే పిచ్చితో ఊగిపోయే అభిమానులు.. ఇంకేముందీ ఈ వన్డే ప్రపంచకప్‌ మామూలుగా ఉండదనే అంచనాలు ఏర్పడ్డాయి.

Published : 18 Oct 2023 15:34 IST

12 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ (World Cup 2023).. మొట్టమొదటి సారి భారత్‌ సొంతంగా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ.. క్రికెట్‌ అంటే పిచ్చితో ఊగిపోయే అభిమానులు.. ఇంకేముందీ ఈ వన్డే ప్రపంచకప్‌ మామూలుగా ఉండదనే అంచనాలు ఏర్పడ్డాయి. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఈ టోర్నీ జరుగుతుందనే ఆశలు కలిగాయి. కానీ మ్యాచ్‌లు ఇలా ఆరంభమయ్యాయో లేదో ఇంతలోనే నిరాశ. అంతంతమాత్రంగానే ప్రేక్షకులు స్టేడియాలకు రావడం.. మ్యాచ్‌లు ఏకపక్షంగా మారడంతో మజా లేకుండా పోయింది. ఏదో ఊహిస్తే ఇంకేదో జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు మూడు రోజుల్లోనే అంతా మారిపోయింది. ప్రపంచకప్‌పై అమితాసక్తి ఏర్పడింది. ఈ మెగా టోర్నీకే ఊపొచ్చింది. అందుకు కారణం పెద్ద జట్లపై చిన్న జట్లు సాధించిన సంచలన విజయాలే. ఇంగ్లాండ్‌పై అఫ్గానిస్థాన్‌, దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ (Netherlands) విజయంతో ప్రపంచకప్‌ సందడి అమాంతం పెరిగిందనే చెప్పాలి. 

భారత్‌- పాక్‌ పోరు కూడా..

2019 ఛాంపియన్‌ ఇంగ్లాండ్ (England), అప్పటి రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య పోరుతో ఈ ప్రపంచకప్‌ ఆరంభమైంది. రెండు మేటి జట్ల మధ్య అది కూడా ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ అయినప్పటికీ దీనికి లభించిన ఆదరణ అంతంతమాత్రమే. పైగా న్యూజిలాండ్‌ (New Zealand) బ్యాటర్లు చెలరేగడంతో మ్యాచ్‌ పూర్తి ఏకపక్షంగా మారిపోయింది. మ్యాచ్‌లో మలుపులు, ట్విస్ట్‌లు, ఆధిపత్య పోరు, హోరాహోరీ పోరాటం, నరాలు తెగే ఉత్కంఠ, చివరి వరకూ పట్టు ఉంటేనే కదా అసలైన కిక్కు వచ్చేది. కానీ అవేమీ లేకుండానే ఒక్కో మ్యాచ్‌ ముగుస్తూ వచ్చింది. పైగా అయిదు సార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియా కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఆసక్తి మరింత తగ్గిందనే చెప్పాలి. అంతో ఇంతో శ్రీలంక- పాక్‌ మ్యాచ్‌ ఆకట్టుకుంది. ఇక క్రికెట్‌ ప్రపంచం కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన భారత్‌- పాక్‌ (IND vs PAK) పోరు కూడా ఏకపక్షంగా ముగియడంతో మజా లేకుండా పోయింది. టీమ్‌ఇండియా ఆధిపత్యం ముందు పాక్‌ తేలిపోయింది. ప్రపంచకప్‌కే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ మ్యాచ్‌ ఇలాంటి ఫలితాన్ని ఇవ్వడంతో అభిమానులు మరింత నిరాశ చెందారు. 

కథ మారింది..

కానీ ఇప్పుడు కథ మారింది. ప్రపంచకప్‌కు కళ వచ్చింది. ఈ మెగా టోర్నీపై ఆసక్తి నెలకొంది. ఏ మ్యాచ్‌లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పెరిగింది. అందుకు కారణం కచ్చితంగా అఫ్గానిస్థాన్‌, నెదర్లాండ్స్‌ జట్లే. పెద్ద జట్లు ఇవ్వలేకపోయిన వినోదాన్ని ఈ చిన్న జట్లు సంచలన విజయాలతో అభిమానులకు అందించాయి. ముందుగా డిఫెండింగ్‌ ఛాంపియన్, బలమైన ఇంగ్లాండ్‌ను ఓడించిన అఫ్గాన్‌ వీరులు టోర్నలో పెను సంచలనాన్ని సృష్టించారు. ఏ మాత్రం అంచనాలకు అందని రీతిలో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో ఒక్కసారిగా ప్రపంచకప్‌పై అందరి దృష్టి పడింది. దీన్ని అలాగే కొనసాగించేలా, మరింత ఆసక్తి పెంచేలా ఈ సారి నెదర్లాండ్స్‌ అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉండి, ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలతో సత్తాచాటుతున్న దక్షిణాఫ్రికాకు ఈ డచ్‌ జట్టు కళ్లెం వేసింది. అది కూడా పూర్తి ఆధిపత్యంతో విజయాన్ని ఖాతాలో వేసుకోవడం విశేషం. లంకపై 428 పరుగులు, ఆస్ట్రేలియాపై 311 పరుగులు చేసిన సఫారీ జట్టు.. నెదర్లాండ్స్‌పై 246 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఈ ఘనత కచ్చితంగా నెదర్లాండ్స్‌ బౌలర్లదే. ఇప్పుడీ చిన్న జట్ల విజయాలతో ప్రపంచకప్‌ సమీకరణాలు మారిపోయాయి. సెమీస్‌ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌నూ అన్ని జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయనడంలో సందేహం లేదు. ఇక నుంచి చిన్న జట్టుతో మ్యాచ్‌ అయినా ఏ మాత్రం తేలిగ్గా తీసుకునే సాహసం పెద్ద జట్లు చేయలేకపోవచ్చు. ఏ మాత్రం  ఉదాసీనతగా ఉన్నా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే తేటతెల్లమైంది. ఇదే కదా అభిమానులకు కావాల్సింది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని