Asian Games: జావెలిన్‌ త్రోయర్‌ కిశోర్‌ జెనాకు ఒడిశా బంపర్‌ ఆఫర్‌!

ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జావెలిన్‌ త్రోయర్‌ కిశోర్‌ జెనాకు ఒడిశా ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. 

Updated : 18 Jul 2024 14:43 IST

భువనేశ్వర్‌: ఆసియా క్రీడల్లో (Asian Games) భాగంగా బుధవారం జరిగిన జావెలిన్‌ త్రో పోటీలో భారత్‌ రెండు పతకాలు కైవసం చేసుకుంది. భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా (neeraj chopra) 88.88 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణ పతకం గెలుచుకోగా.. మరో క్రీడాకారుడు కిశోర్‌ జెనా (Kishore Jena) 87.54మీ విసిరి రజతం దక్కించుకున్నాడు. వ్యక్తిగతంగా కిశోర్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అంతేకాదు.. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ 2024కి కూడా అర్హత సాధించాడు. దీంతో ఒడిశా (Odisha)కు చెందిన కిషోర్‌ జెనాకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అతడికి ప్రభుత్వం తరపున రూ. 1.50 కోట్లు నగదు బహుమతి ఇస్తున్నట్లు సీఎం నవీన్‌ పట్నాయక్‌ వెల్లడించారు. 

‘‘ఆటలో కిశోర్‌ జెనా అద్భుతమైన ప్రదర్శనకు, అంకితభావానికి గుర్తింపుగా ఈ నగదు బహుమతి ఇస్తున్నాం. ఆసియా క్రీడల్లో పతకం సాధించినందుకు, పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత పొందినందుకు కిశోర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ విజయం.. కిశోర్‌ వ్యక్తిగత ప్రతిభను చాటడమే కాదు, దేశవ్యాప్తంగా ఎంతోమంది క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతుంది’’అని సీఎం నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం కిశోర్‌ తీసుకునే శిక్షణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

గత ఆగస్టులో జరిగిన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ కిశోర్‌ జెనా పాల్గొన్నాడు. జావెలిన్‌ త్రో ఫైనల్‌లో నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచాడు. కిశోర్‌ ఐదో స్థానంలో నిలిచినా.. తన ప్రతిభ చాటుకున్నాడు. అప్పుడు కూడా నవీన్‌ పట్నాయక్‌.. కిశోర్‌కు ప్రోత్సాహకంగా రూ. 50 లక్షలు నగదు బహుమతి అందజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు