Sarfaraz: సర్ఫరాజ్‌ మా దృష్టిలోనే ఉన్నాడు: బీసీసీఐ

దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ను టెస్టు జట్టులో ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ మౌనం వీడింది. అతడు మా పరిగణనలోనే ఉన్నాడని పేర్కొంది.

Published : 27 Jan 2023 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌కు జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అతడిని టెస్టుల్లోకి ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ సెలెక్టర్‌ శ్రీధరన్‌ శరత్‌ వివరించాడు. అతడు మా దృష్టిలోనే ఉన్నాడని తెలిపాడు.

‘‘ఒక జట్టును ఎంపిక చేసేటప్పుడు కూర్పు, సమతుల్యత వంటి విషయాలను పరిగణించాల్సి ఉంటుంది. దాన్ని బట్టే ఆటగాళ్లను ఎంపిక చేస్తాం. సర్ఫరాజ్‌ఖాన్‌ కచ్చితంగా మా పరిగణనలోనే ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు అతడికీ అవకాశం లభిస్తుంది’’ అని పేర్కొన్నాడు.

సర్ఫరాజ్‌ ఖాన్‌ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. భారత్‌ ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరిలో జరగనున్న బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ కోసం తొలి రెండు టెస్టులకు ఇటీవల బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. అందులో ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌లకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. సర్ఫరాజ్‌ను పక్కనపెట్టింది. ఎంతోకాలంగా జాతీయ జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌ ఆస్ట్రేలియాతో టెస్టుకు ఎంపిక అవుతాడని ఆశించాడు. అతడిని టెస్టుల్లోకి ఎంపిక చేయకపోవడం పట్ల పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల సునీల్‌ గావస్కర్‌ సైతం సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని