Gill - Prithvi Shaw: వన్డేలకు శుభ్‌మన్‌ గిల్‌.. టీ20లకు పృథ్వీ షా సరిపోతారు: గంభీర్‌

వన్డేల్లో రాణించిన శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) టీ20ల్లో మాత్రం ఆడలేకపోతున్నాడు. స్పిన్‌ బౌలింగ్‌లో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని టీమ్‌ఇండియా (Team India) మాజీ ఆటగాడు గంభీర్‌ సూచించాడు.

Published : 31 Jan 2023 15:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు.. సెంచరీలు బాదేశాడు. భవిష్యత్తులో భారత స్టార్‌ బ్యాటర్‌ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే వన్డేల్లో రాణించిన విధంగా టీ20ల్లో మాత్రం శుభ్‌మన్‌ గిల్ ప్రతిభ కనబరచలేకపోయాడు. తాజాగా కివీస్‌తో టీ20 సిరీసుల్లోనూ పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌ కూడా గిల్‌ ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అనుకొన్న విధంగా రాణించలేకపోతున్నాడని.. అదే సమయంలో మరో యువ బ్యాటర్ పృథ్వీ షా టీ20లకు సరిగ్గా సరిపోతాడని గంభీర్‌ తెలిపాడు. స్పిన్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ ఇబ్బంది పడుతున్నాడని, టర్నింగ్‌ పిచ్‌లపై మరింత మెరుగ్గా ఆడాలని సూచించాడు. 

‘‘స్పిన్ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఇంకా బాగా ఆడాల్సిన అవసరం ఉందని నా విశ్లేషణ. మరీ ముఖ్యంగా స్పిన్‌ పిచ్‌పైన ఇబ్బంది పడుతున్నాడు.  బంగ్లాదేశ్‌లోనూ ఇలానే ఇబ్బందికి గురయ్యాడు. అయితే 50 ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. బంతి తిరగడం, బౌన్స్‌ అయినప్పుడు ఆడటం బ్యాటర్‌కు అసలైన పరీక్షగా మారుతుంది. ఇలాంటి విషయంలో శుభ్‌మన్‌ ఇంకా మెరుగు కావాల్సిన అవసరం ఉంది. పేస్‌ బౌలింగ్‌ను బాగానే ఆడుతున్న గిల్‌.. స్పిన్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నాడు’’

గిల్‌ ఆడే విధానం టీ20ల కంటే వన్డే క్రికెట్‌కు బాగా నప్పుతుందని.. అలాగే పృథ్వీ షా అయితే పొట్టి ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతాడని గంభీర్‌ తెలిపాడు. ‘‘గిల్‌ ఇంకా టీ20 ఫార్మాట్‌లో సరిగ్గా ఆడలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అయితే ఆడే విధానం ఇంకాస్త దూకుడు ఉండాలి. అయితే గిల్ 50 ఓవర్ల ఫార్మాట్‌కు సరిపోతాడు. కానీ, పృథ్వీ షా వంటి కుర్రాడు మాత్రం టీ20 ఫార్మాట్‌కు రాణించగలడు. అందుకే, ఎంత త్వరగా గిల్‌ టీ20ల్లో మెరుగైతేనే తన స్థానం సుస్థిరమవుతుంది. అప్పుడే మూడు ఫార్మాట్లు ఆడేందుకు అవకాశం ఉంటుంది’’ అని గంభీర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు