Virat: విరాట్ కొట్టిన ఆ ‘స్ట్రెయిట్‌ సిక్స్’.. షహీన్‌ బౌలింగ్‌లో అనుకున్నా: పాక్‌ మాజీ పేసర్

భారత్ X పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ కోసం అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. గత టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) పాక్‌పై విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Published : 04 Feb 2023 01:46 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్.. ప్రపంచకప్‌ ఏదైనాసరే పాకిస్థాన్‌పై గెలిస్తే టైటిల్‌ను కొట్టినంత సంబరం.. దాయాదుల పోరంటే అభిమానుల్లో తీవ్రస్థాయిలో ఉత్కంఠ ఉంటుంది. ఇరు జట్లూ గెలుపు కోసం చివరి బంతి వరకూ పోరాడటం ప్రేక్షకులకు భలే మజా కలిగిస్తుంది. ఇదే క్రమంలో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై 19వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడంతోపాటు చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కోహ్లీ బ్యాటింగ్‌కు బలైన ఆ బౌలర్‌ హారిస్ రవూఫ్ అని అందరికీ తెలుసు. కానీ, ఓ పాక్‌ వెటరన్ క్రికెటర్‌ మాత్రం ఇప్పటికీ కోహ్లీ కొట్టిన సిక్స్‌లు షహీన్‌ షా అఫ్రిది బౌలింగ్‌లో అనుకొన్నానని, అవేమీ కష్టమైన షాట్లు కాదని పేర్కోవడం గమనార్హం. 

19వ ఓవర్‌ వేసిన హారిస్ రవూఫ్‌ బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌ వైపు సిక్స్‌ కొట్టిన కోహ్లీ.. తర్వాతి బంతికే వికెట్ల మీదుగా అద్భుతమైన సిక్స్‌గా మలిచాడు. క్రికెట్‌ చరిత్రలో ఇదొక అత్యుత్తమ షాట్‌గా మారిపోయింది. ఈ క్రమంలో పాక్‌ వెటరన్ పేసర్ సోహైల్‌ ఖాన్‌ మాత్రం హారిస్ రవూఫ్‌కు బదులు షహీన్‌ షా అఫ్రిది బౌలింగ్‌లో విరాట్ సిక్స్‌లు కొట్టినట్లు భావించానని తెలిపాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ స్ట్రెయిట్‌ సిక్స్ కొట్టాడు. హారిస్ రవూఫ్‌ బౌలింగ్‌లో అద్భుతమైన షాట్ సాధించాడు. తొలుత ఇది షహీన్ షా బౌలింగ్‌లో వచ్చిందేమో అనుకొని భ్రమపడ్డా.’’ అని సోహైల్ వ్యాఖ్యానించాడు. 

గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌కు దూసుకెళ్లగా.. పాక్‌ ఫైనల్‌ వరకూ వెళ్లి బోల్తా పడింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ పది వికెట్ల తేడాతో ఇంటిముఖం పట్టింది. ఇక పాక్‌ ఫైనల్‌కు చేరినప్పటికీ.. ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకొన్న రెండో జట్టుగా ఇంగ్లాండ్‌ అవతరించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని