‘తాగి, హోటల్‌ గదిలో మమ్మల్ని కొట్టారు’: సమాఖ్య సభ్యుడిపై ఫుట్‌బాల్‌ క్రీడాకారిణులు

ఫుట్‌బాల్‌ సమాఖ్య (AIFF) సభ్యుడు ఒకరు హోటల్‌ గదిలో తమను కొట్టారంటూ ఇద్దరు క్రీడాకారిణులు ఫిర్యాదు చేశారు.  

Updated : 30 Mar 2024 15:54 IST

దిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (AIFF)కు చెందిన ఓ సభ్యుడిపై ఇద్దరు క్రీడాకారిణులు (Women Footballers) తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తమ హోటల్‌ గదికి వచ్చి భౌతిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 

హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఖాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు.. సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ దీపక్ శర్మపై ఈ ఆరోపణలు చేశారు. ఆయన హిమాచల్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్ జనరల్‌ సెక్రటరీ కూడా. ఫుడ్ తయారీ విషయంలో ఆగ్రహానికి గురైన ఆయన తమపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా డిన్నర్ పూర్తైన తర్వాత.. గుడ్లు ఉడకపెట్టుకునేందుకు మా రూమ్‌కు వెళ్లాం. ఈ విషయంపై ఆగ్రహానికి గురైన ఆయన మా గదిలోకి దూసుకొచ్చారు. మాపై భౌతిక దాడికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు. అప్పుడు ఆయన మద్యం సేవించి ఉన్నారని, అలాగే హిమాచల్ ప్రదేశ్‌ నుంచి గోవాకు వస్తోన్న సమయంలో కూడా ఆయన తమ ముందే తాగారని అందులో పేర్కొన్నారు. ఇండియన్‌ విమెన్‌ లీగ్‌లో భాగంగా ఖాద్‌ బృందం ప్రస్తుతం గోవాలో ఉంది.

క్రీడాకారుణులు తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేయడంతో.. గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారులు హోటల్ రూమ్‌ వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. వారి భద్రతపై రాతపూర్వక హామీ ఇచ్చారు. అలాగే దీనిపై ఏఐఎఫ్‌ఎఫ్ (AIFF) విమెన్‌ ఫుట్‌బాల్ కమిటీ ఛైర్‌పర్సన్ వాలంకా అలెమావో స్పందించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘ఆ ఫిర్యాదు కాపీ నా దృష్టికి వచ్చింది. అలాంటి ఘటనలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై ఏఐఎఫ్‌ఎఫ్ తగిన చర్యలు తీసుకుటుంది’ అని వాలంకా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని