ODI World Cup: విజయాల వెనుక పేస్‌ మంత్ర... ప్రపంచకప్‌లో ఫాస్ట్‌ బౌలర్ల హవా

భారత్‌లో క్రికెట్‌ పిచ్‌లు అంటే స్పిన్నర్లకు స్వర్గధామం అని అంటుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపచంకప్‌లో పేసర్లే ఎక్కువగా రాణిస్తున్నారు. 

Updated : 03 Nov 2023 15:12 IST

సాధారణంగా భారత్‌లో ప్రపంచకప్‌ (ODI World Cup) అనగానే స్పిన్నర్లదే హవా అని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆరంభంలో కొన్ని మ్యాచ్‌ల్లో స్పిన్నర్లే ఆధిపత్యం ప్రదర్శించారు. కానీ టోర్నీ గడుస్తున్న కొద్దీ పరిస్థితి మారిపోయింది. నెమ్మదిగా పేసర్లు ముద్ర చూపించారు. ఇప్పుడు వాళ్లదే హవా. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొలి 10 మందిలో 8 మంది పేసర్లే. 

మనోళ్ల జోరు

పేస్‌ అనగానే ఇప్పుడు గుర్తుకొస్తున్న జట్టు భారతే. జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah), మహ్మద్‌ షమీ (Mohammed Shami) ప్రపంచకప్‌లో వేసిన ముద్ర అలాంటిది. 6 మ్యాచ్‌ల్లో 14 వికెట్లతో బుమ్రా అత్యధిక వికెట్ల జాబితాలో టాప్‌ 3లో చోటు దక్కించుకున్నాడు. అతడు వేస్తున్న బంతులకు బ్యాటర్ల నుంచి సమాధానమే ఉండట్లేదు. ఔట్‌ స్వింగ్, ఇన్‌స్వింగర్లతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇక బుల్లెట్‌ యార్కర్ల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇంగ్లాండ్‌తో మ్యాచే ఇందుకు ఉదాహరణ. అందుకే వసీమ్‌ అక్రమ్‌ లాంటి దిగ్గజం సైతం తనకన్నా నియంత్రణతో బంతులు వేస్తున్నాడని బుమ్రాకు కితాబిచ్చాడు. అంతేకాదు ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో బుమ్రానే అత్యుత్తమ బౌలర్‌ అని కూడా ప్రశంసించాడు. 

మహ్మద్‌ షమీ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని రెండు చేతులతో అందుకుని అదరగొట్టేస్తున్నాడీ పేసర్‌. రెండు కఠినమైన మ్యాచ్‌ల్లో రాణించడం ఈ పేసర్‌ సత్తాకు నిదర్శనం. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో ఈ టోర్నీలో తొలిసారి ఆడే అవకాశాన్ని దక్కించుకున్న షమీ 5 వికెట్లతో విజృంభించాడు. అతడు వేసిన యార్కర్లను ఆడడం కివీస్‌ బ్యాటర్లకు తలకు మించిన పనే అయింది. ఇక ఇంగ్లాండ్‌ బ్యాటర్లను ఆఫ్‌ కటర్స్‌తో బోల్తా కొట్టించాడు షమి. ఆ జట్టు అగ్రశ్రేణి బ్యాటర్‌ బెన్‌ స్టోక్స్‌కు వేసిన బంతి అయితే అద్భుతం. వేగాన్ని ఎక్కువగా తగ్గించకుండానే బంతిని ఆఫ్‌ కటర్‌గా వేసి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 2 మ్యాచ్‌ల్లోనే 9 వికెట్లు పడగొట్టి దూసుకెళ్తున్నాడతను. 

అటు అఫ్రిది.. ఇటు జాన్సన్‌

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ రాణించలేకపోయింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్‌ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. అయితే ఆ జట్టు స్టార్‌ పేసర్‌ షహీన్‌షా అఫ్రిది మాత్రం తనపై అంచనాలను నిలబెట్టుకుంటున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో తేలిపోయినా.. మిగిలిన మ్యాచ్‌ల్లో రాణించాడు. ఇప్పటిదాకా 6 మ్యాచ్‌ల్లో  16 వికెట్లు తీసి జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గొప్పగా బౌలింగ్‌ చేసిన అతడు 23 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. పిచ్‌ స్లోగా ఉన్నా బంతి వేగాన్ని తగ్గిస్తూ బ్యాటర్లను బుట్టలో వేస్తున్నాడు అఫ్రిది. 
దక్షిణాఫ్రికా జైత్రయాత్రలో ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సన్‌ది ప్రముఖ పాత్ర. అటు బ్యాట్‌తో అదరగొడుతున్న అతడు.. బంతితోనూ విజృంభిస్తున్నాడు. టోర్నీలో ఆడుతున్న క్రికెటర్లలోకెల్లా పొడగరి అయిన అతడు ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ బ్యాటర్ల కదలికలను బట్టి బంతులు సంధిస్తున్నాడు. స్లో బౌన్సర్లతో వికెట్లు సాధిస్తున్నాడు. 6 మ్యాచ్‌ల్లో ఈ సఫారీ బౌలర్‌ 13 వికెట్లు తీసి టాప్‌ 5లో ఉన్నాడు.

వాళ్లు కూడా..

మదుశంక (శ్రీలంక), మాట్‌ హెన్రీ (న్యూజిలాండ్‌), బాస్‌ డీ లీడ్‌ (నెదర్లాండ్స్‌), రబాడ (దక్షిణాఫ్రికా), కొయెట్జీ (దక్షిణాఫ్రికా), మీకెరన్‌ (నెదర్లాండ్స్‌) హారిస్‌ రవూఫ్‌ (పాకిస్థాన్‌) అదరగొడుతున్న బౌలర్ల జాబితాలో ఉన్నారు. వీరిలో కొయెట్జీ, మీకెరన్‌ బౌలింగ్‌ చూసి తీరాల్సిందే. వైవిధ్యానికి పేస్‌ను జత చేస్తూ వీళ్లిద్దరూ వికెట్ల వేటలో సాగిపోతున్నారు. నెదర్లాండ్స్‌ సంచనల విజయాల్లో మీకెరన్‌తో పాటు బాస్‌ డీ లీడ్‌ది కీలకపాత్ర. వీళ్లందరి ప్రదర్శనలు చూస్తుంటే ప్రపంచకప్‌ జరుగుతుంది భారత్‌లోనేనా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే గతంలో భారత్‌లో జరిగిన 1996, 2011 ప్రపంచకప్పుల్లో స్పిన్నర్లే ఆధిపత్యం ప్రదర్శించారు. ఈసారి మాత్రం స్పిన్నర్లు బ్యాక్‌సీట్‌ తీసుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మున్ముందు పేసర్ల నుంచి మరిన్ని ఆసక్తికర ప్రదర్శలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని