Team India: దిగ్గజాల వారసత్వాన్ని కొత్తవారు కొనసాగించడం కష్టమే: పద్మశ్రీ గురుచరణ్‌ సింగ్‌

ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడమే కోచ్‌ల ప్రధాన బాధ్యత. దిగ్గజ క్రికెటర్లుగా మారడంలో వారిదే కీలక పాత్ర. ఇలాంటి ఎందరినో తీర్చిదిద్దిన అనుభవం గురుచరణ్ సింగ్‌ (Gurucharan Singh)ది. ఇప్పుడు ఆయనకు పద్మశ్రీ అవార్డును (Padma Shri) కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated : 28 Jan 2023 16:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎందరో క్రికెటర్లను తయారు చేసిన అనుభవం కోచ్‌ గురుచరణ్ సింగ్ సొంతం. అందుకే 87 ఏళ్ల వయస్సులో కేంద్ర ప్రభుత్వం గురుచరణ్‌ సింగ్‌కు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో సీనియర్‌ కోచ్ పలు విషయాలపై స్పందించారు. చాలా మంది కోచ్‌లు తమ అకాడమీలలో శిక్షణ పొందిన కారణంగానే అథ్లెట్లు విజయం సాధించారనే క్రెడిట్‌ని తీసుకొంటారని.. ఇది సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), సచిన్‌ తెందూల్కర్ (Sachin), విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వీరంతా ఒక్కో తరానికి అద్భుత ఆటగాళ్లని తెలిపాడు. 

‘‘క్రికెట్ కోచింగ్‌లో.. ప్రతి కోచ్‌ తమ ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలి. అథ్లెట్లు కేవలం శిక్షణ, ప్రాక్టీస్‌ సెషన్‌లకు హాజరవుతుంటే.. వారేదో తమ ప్రోడక్ట్‌గా బయట ప్రచారం చేసుకోవడం సరైంది కాదు. దానికి ఉదాహరణ.. కపిల్‌ దేవ్‌ను తీసుకొందాం. ముంబయిలో నేను నిర్వహించిన క్యాంప్‌ల్లో శిక్షణ కోసం కపిల్‌ కూడా వచ్చాడు. అలా అని అతడు నేను తయారు చేసిన ఆటగాడిగా ఇప్పటికీ చెప్పను. ఎందుకంటే కపిల్ చండీగఢ్ నుంచి వచ్చాడు. అతడిని డీపీ అజాద్‌ తీర్చిదిద్దారు. బ్యాట్‌, బాల్ ఒకేలా ఉన్నప్పటికీ.. ప్రతి కోచ్‌ వద్ద తమకంటూ ప్రత్యేకమైన కోచింగ్‌ టెక్నిక్‌లు ఉంటాయి. అయితే, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ, సచిన్‌ తెందూల్కర్, గావస్కర్.. ఇలాంటి వారిని మళ్లీ తయారు చేయలేం. వారు క్రికెట్‌ దిగ్గజాలుగా మారారు. కొత్తవారు వస్తున్నప్పటికీ.. వీరి వారసత్వాన్ని కొనసాగించడం సులువైన విషయం కాదు. ఈ వయసులో నేను పద్మశ్రీ అవార్డు వస్తుందని మాత్రం ఊహించలేదు. అవార్డును ప్రకటించిన, పరిగణనలోకి తీసుకొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని వెల్లడించారు. 

కోచ్‌గా మారకముందు గురుచరణ్‌ 37 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు. క్రికెట్‌ ఆడటం మానేసిన తర్వాత కోచ్‌గా మారారు. మాజీ ఆటగాళ్లు కీర్తి అజాద్‌, అజయ్ జడేజా, మనిందర్‌సింగ్‌.. ఇలా చాలామందిని అద్భుత క్రికెటర్లుగా తీర్చిదిద్దడంలో గురుచరణ్‌ కీలక పాత్ర పోషించారు. భారత్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌ల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. డీపీ అజాద్‌ (దేశ్‌ ప్రేమ్‌ అజాద్) తర్వాత పద్మ అవార్డును అందుకొన్న రెండో క్రికెట్‌ కోచ్‌ కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని