PAK in Asia Cup Defeat: బాబర్‌ అజామ్‌నే ఎందుకు టార్గెట్‌ చేస్తారు?: పాక్‌ మాజీల ఆగ్రహం

ఆసియా కప్‌లో (Asia Cup 2023) పాకిస్థాన్‌ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కెప్టెన్ బాబర్‌ అజామ్ నాయకత్వంపైనా పాక్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టును సరిగ్గా నడిపించలేకపోతున్నాడనే వ్యాఖ్యలూ వచ్చాయి. అయితే, పాక్‌ మాజీలు మాత్రం బాబర్‌కు మద్దతుగా నిలిచారు.

Updated : 20 Sep 2023 10:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో (Asia Cup 2023) ఘోర పరాభవంతో పాకిస్థాన్‌ జట్టు సూపర్-4 దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాక్‌ను (IND vs PAK) భారత్‌, శ్రీలంక ఓడించాయి. టీమ్‌ఇండియా చేతిలో 228 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో పాక్‌పై తీవ్ర విమర్శలు రేగాయి. దీంతో ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌ (Baba Azam) నాయకత్వంపై ప్రశ్నల వర్షం కురిసింది. జట్టును నడిపించడంలో అతడు విఫలమైనట్లు విమర్శలు వచ్చాయి. అయితే, పాక్‌ మాజీలు మియాందాద్, మిస్బా ఉల్‌ హక్ మాత్రం బాబర్‌కు మద్దతుగా నిలిచారు. ఆసియాకప్‌లో పాక్‌ ఓటమికి కేవలం అతడిని మాత్రమే టార్గెట్‌ చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ‘గ్లోబల్‌ క్రికెట్ ఈవెంట్‌’ కార్యక్రమంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. 

‘‘ఆసియాకప్‌లో జట్టు మొత్తం సరైన ప్రదర్శన చేయకపోతే కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌నే ఎందుకు తప్పుపడుతున్నారు? భారత్‌, శ్రీలంక జట్లపై అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడంలో టీమ్‌ మొత్తం విఫలమైంది. ఆసియా కప్‌ ఓటమికి అందరూ బాధ్యులే. ఒకరినే నిందించాల్సిన అవసరం లేదు. టైటిల్‌ చేజార్చుకున్నప్పటికీ నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు. వరల్డ్ కప్‌లో తప్పకుండా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించగల సత్తా పాక్‌కు ఉంది. అయితే, భారత పిచ్‌లు, పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడగలమనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా భారీగా వచ్చే ప్రేక్షకుల మధ్య ఆడేందుకు మానసికంగా సిద్ధం కావాలి’’ అని మియాందాద్‌ తెలిపాడు. 

అందరూ కలిసికట్టుగా ఆడితేనే..: మిస్బా

‘‘ప్రతిసారి బాబర్‌ అజామ్ అత్యుత్తమంగా ఆడతాడని ఆశించకూడదు. అలా జరగడం కూడా అసాధ్యమే. ఆటగాళ్లు సమష్టిగా ఆడితేనే విజయం దక్కుతుంది. భారత్‌లోనూ ఇదే వ్యూహం పాటించాలి. బాబర్‌ కెప్టెన్సీ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. అంతేకాకుండా ఇలాంటి సమయంలో నాయకత్వంపై మాట్లాడకూడదు. వరల్డ్ కప్‌లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించగల సత్తా ఉంది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇవన్నీ రూమర్లే. నేను ఇప్పుడున్న ఆటగాళ్లతో కెప్టెన్‌గా, కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌గా కలిసి పనిచేశా. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఎప్పుడూ ఎవరూ ప్రవర్తించలేదు. తప్పకుండా ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తారు’’ అని మిస్బా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని