ODI WC 2023: బంతులు.. డీఆర్‌ఎస్‌.. టాస్‌ కాయిన్‌.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కేందుకు వారికేదీ కాదు అనర్హం!

వరుసగా విజయాలు సాధిస్తున్న టీమ్‌ఇండియా (Team India) ప్రదర్శనను తక్కువగా చేయడానికి పాకిస్థాన్‌ మాజీ ఆటగాళ్లు కొందరు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు.

Updated : 17 Nov 2023 13:42 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరింది. దాయాది పాకిస్థాన్‌ లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. దీంతో కొందరు పాక్‌ దిగ్గజాలు భారత ఆటతీరును ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాజీ ఆటగాళ్లు అక్కసును వెళ్లగక్కేందుకు తమ నోటికి పనిజెప్పారు. పైశాచిక ఆనందం పొందుతున్నారనే విమర్శలను మూటగట్టుకున్నారు. అనవసరమైన విషయాలను లేవనెత్తి వివాదాస్పదంగా మార్చడమే పనిగా పెట్టుకున్నారు. తొలుత విభిన్న బంతులు అన్నారు.. ఆ తర్వాత డీఆర్‌ఎస్‌పై పడ్డారు.. తాజాగా టాస్‌ సందర్భంగా కాయిన్‌ వేసే పద్ధతిపైనా ఆరోపణలు చేశారు. అయితే, వాటికి కౌంటర్లు పాక్‌ క్రికెట్‌ దిగ్గజం నుంచే రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇలాంటి ఆరోపణలు చేసి తమ పరువు తీయొద్దని సూచించారంటే ఆ మాజీలు ఎంతకు దిగజారిపోయారో అర్థమవుతుంది.

విభిన్న బంతులు వాడారట..

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ హసన్ రజా ఆ దేశం తరఫున ఆడింది కేవలం 23 అంతర్జాతీయ మ్యాచులే. అందులోనూ ఏడు టెస్టులు, 16 వన్డేలు ఉన్నాయి. మొత్తం 500 పరుగులు కూడా లేవు. కానీ, టీమ్‌ఇండియా గెలుపును మాత్రం తక్కువ చేయడానికి చాలా కష్టపడుతుంటాడు. ఈ వరల్డ్ కప్‌లో భారత్ లీగ్‌ స్టేజ్‌లో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. కానీ, పాక్‌ మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడింది. టీమ్‌ఇండియా పేసర్లు విజృంభించి ప్రత్యర్థులను కట్టడి చేశారు. దీంతో టీమ్ఇండియా విభిన్న బంతులను వాడటం వల్లే వారు గెలిచారనే ఆరోపణలను గుప్పించాడు. దీనికి పాక్‌ క్రికెట్ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

‘‘వేర్వేరుగా బంతులను వినియోగించడానికి ఎక్కడా వీలుండదు. ప్రతి బంతిని గమనించి మ్యాచ్‌ కోసం అందుబాటులో ఉంచడానికి ఐసీసీ అధికార ప్రతినిధులు అక్కడే ఉంటారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల సమక్షంలోనూ ఇది జరుగుతుంది’’  వసీమ్‌ అక్రమ్‌ నుంచి వచ్చిన తొలి కౌంటర్ ఇది.

ఈసారి డీఆర్‌ఎస్‌..

మ్యాచ్‌లో వాడే బంతులపై విమర్శలు చేసిన హసన్‌ రజా మరోసారి డీఆర్‌ఎస్‌పై అసంబద్ధ ఆరోపణలు గుప్పించాడు. డెసిషన్‌ రివ్యూ సిస్టమ్ (DRS)ను ట్యాంపరింగ్‌ చేసి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని రజా వ్యాఖ్యానించాడు. దానికి దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ను ఉదాహరణగా పేర్కొన్నాడు. వాండర్ డసెన్ ఔట్‌ ఇవ్వడం సరైంది కాదని విమర్శించాడు. ‘‘లైన్‌లోనే ఇంపాక్ట్‌ ఉందని.. బంతి లెగ్‌స్టంప్‌ను దాటేసి వెళ్తున్నట్లు అనిపించింది. కానీ, డీఆర్‌ఎస్‌లో మాత్రం లెగ్‌స్టంప్‌ను తాకినట్లు చూపించారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. దీనిపై సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారత్-పాక్‌ మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి’’ అని రజా ఓ ఛానల్‌లో వ్యాఖ్యానించాడు.

‘కొంచెమైనా సిగ్గుండాలి. మీ గేమ్‌ మీద దృష్టిపెట్టాలి. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం కాదు. ఇది ఐసీసీ వరల్డ్‌ కప్‌. మీ లోకల్‌ టోర్నమెంట్ కాదు. మీరు (హసన్ రజా) గతంలో ప్లేయరే కదా. ఇప్పటికే వసీమ్‌ అక్రమ్‌ సవివరంగా చెప్పాడు. కానీ, ఇప్పటికీ అదే ధోరణిలో ఉండటం హాస్యాస్పదం. అంటే క్రికెట్‌ దిగ్గజం, మీ మాజీ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌నే మీరు నమ్మడం లేదా? మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు’’ అని భారత స్టార్‌ పేసర్ షమీ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు.

టాస్‌ కాయిన్‌ వేసే పద్ధతిపైనా.. 

పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు సికిందర్ భక్త్‌ ఈసారి ఏకంగా టాస్‌ కాయిన్‌ వేసే పద్ధతిపై చేసిన వ్యాఖ్యలు ఆ దేశ మాజీలకే అసహనం కలిగించాయి. ఇలాంటివి చేసి తమను నవ్వులపాలు చేయొద్దని చురకలు అంటించారు. బీసీసీఐ, ఐసీసీ కలిసి టాస్‌ను మ్యానిపులేట్‌ చేస్తున్నాయని సికిందర్‌ ఆరోపించాడు. దానికి ఓ చెత్త కారణం కూడా చెప్పడం గమనార్హం. ‘‘ఇక్కడో కుట్ర కోణం ఉందని చెప్పడానికి ఉదాహరణ ఇస్తున్నా. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్‌ వేసేటప్పుడు ప్రత్యర్థి కెప్టెన్‌కు దూరంగా విసిరేవాడు. దీంతో ఆ ప్రత్యర్థి సారథి అక్కడికి వెళ్లి కాయిన్‌ను చెక్‌ చేసేందుకు వెళ్లలేకపోయాడు. ఇతర కెప్టెన్లతో పోలిస్తే రోహిత్ టాస్‌ వేసే విధానం విచిత్రంగా ఉంది’’ అని సికిందర్‌ వ్యాఖ్యానించాడు. ఇంతకీ సికిందర్‌ తన 13 ఏళ్ల కెరీర్‌లో (1976-1989) 26 టెస్టులు, 27 వన్డేలు మాత్రమే ఆడాడు.

ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి తమ పరువు తీయొద్దని పాక్‌ మాజీలు వసీమ్‌ అక్రమ్‌, షోయబ్ మాలిక్‌ చురకలు అంటించారు. ‘‘అసలు ఇలాంటి మాటలు ఎలా వస్తాయి? టాస్‌ వేసినప్పుడు కాయిన్‌ ఎక్కడ పడుతుందని ఎవరు నిర్ణయిస్తారు? ఒక్కో కెప్టెన్‌ ఒక్కో మాదిరిగా కాయిన్‌ వేస్తుంటారు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. అసలు ఇలాంటి వాటిపై స్పందించడానికి నాకు అసహ్యమేస్తోంది’’ అని అక్రమ్ ప్రతిస్పందించాడు. 

టీవీల్లో కనిపించాలనే.. 

భారత్‌ జట్టుపై ఇలా వ్యాఖ్యలు చేయడం వెనుక ఆ మాజీలకు ఉండే దురుద్దేశంతోపాటు టీవీల్లో ఫేమస్ కావాలనే ఆలోచన కూడా కారణమని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. తమ కెరీర్‌లో పెద్దగా రాణించకపోయినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో తరచూ తమ పేరు కనిపించడానికి పొరుగుదేశంపై విమర్శలు చేస్తున్నారనే వాదనా ఉంది. పాకిస్థాన్‌ జట్టు మెరుగు పడటానికి అవసరమైన చర్యలు, సూచనలు అందించకుండా ఇతర జట్లపై అక్కసు వెళ్లగక్కితే పరువు పోయేది తమదేనని ఇప్పటికైనా కొందరు మాజీలు గ్రహించాలని అభిమానులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని