Pakistan Team: పాకిస్థాన్‌ జట్టుకు ఏమైంది?.. వరల్డ్‌ కప్‌లో పతనానికి కారణాలేంటి?

ఉపఖండ పిచ్‌లపై చెలరేగిపోయే జట్లలో పాకిస్థాన్‌ ఉంటుంది. కానీ, భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాక్‌ సెమీస్‌కు చేరుకోవడంలో విఫలమైంది.

Updated : 12 Nov 2023 12:54 IST

పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌.. ఎవరి అంచనాలకు అందని జట్టు ఇది. ఈ ప్రపంచకప్‌నకు ముందు పాక్‌ను (Pakistan) అరివీర భయంకర జట్టు అనుకున్నారు. కానీ కట్‌ చేస్తే సెమీ ఫైనల్స్‌కి కూడా చేరకుండా ఇంటికెళ్లిపోయింది. దీంతో అసలు పాక్‌కు ఏమైంది అనే ప్రశ్న మొదలైంది. మెగా టోర్నీలో పాక్‌ వైఫల్యం వెనుక కారణమేంటో చూస్తే...

జావెద్ మియాందాద్, ఇమ్రాన్‌ ఖాన్‌, అబ్దుల్‌ ఖాదిర్, వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, సయీద్‌ అన్వర్‌, షాహిద్‌ అఫ్రిదీ... పాకిస్థాన్‌ క్రికెట్‌ గురించి మాట్లాడుకుంటూ పోతే ఇలా చాలా పేర్లు వినిపిస్తాయి, వాళ్ల అద్భుతమైన ఆటతీరు కళ్ల ముందు కదలాడుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రత్యర్థి జట్లను గడగడలాడించిన పాక్‌ ఈసారి కీలక సమయంలో చతికిలపడిపోయింది. దీంతో లీగ్‌ దశలోనే ఇంటికెళ్లిపోయింది. ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) పాకిస్థాన్‌ ఆటతీరు ఎలా ఉంది, వాళ్ల మైండ్‌ సెట్‌ ఎలా ఉందో చెప్పాలంటే... అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ చక్కటి ఉదాహరణ. ఆ మ్యాచ్‌లో అఫ్గాన్‌ సంచలన విజయం సాధించింది అనే కంటే.. పాకిస్థాన్‌ చిత్తుగా ఓడింది అనడం బెటర్‌. 

ఆ పేస్‌ ఏమైంది?

పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ అంటే ప్రత్యర్థులు గడగడలాడిపోయేవారు. ఫాస్ట్‌ బౌలర్ల కార్ఖానా అని పాక్‌ జట్టుకు పేరు. అయితే ఈ ప్రపంచకప్‌లో వాళ్లే జట్టు ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం. వన్డే ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు షహీన్‌, రవూఫ్‌ల బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎలాంటి జట్టుకైనా సవాలేనని పాక్‌ మాజీలు ఎంతో నమ్మకంగా చెప్పారు. అలా భారీ అంచనాలతో బరిలోకి దిగిన షహీన్‌ అఫ్రిది, హారిస్ రవూఫ్‌ల పేస్‌ దళం ఆ రేంజిలో ప్రభావం చూపించకపోగా... సాధారణ బౌలర్లలా కనిపించారు. షహీన్‌ 9 మ్యాచుల్లో 18 వికెట్లు తీసినా 486 పరుగులు (81 ఓవర్లలో) ఇచ్చాడు. హారిస్‌ 79 ఓవర్లలో 474 పరుగులు ఇచ్చేశాడు. 16 వికెట్లను మాత్రమే తీశాడు. అత్యుత్తమ ఎకానమీతో బౌలింగ్‌ చేసిన టాప్‌ 15 బౌలర్ల జాబితాలో వీరిద్దరూ లేరు. అంటే ప్రత్యర్థి బ్యాటర్లు తేలిగ్గా పరుగులు రాబట్టేశారు.

భారత్‌ చేతిలో ఓటమితో.. 

గత ఆసియా కప్‌లో సూపర్-4 దశకే పరిమితమైన పాకిస్థాన్‌ వన్డే ప్రపంచకప్‌ను ఘనంగానే ఆరంభించింది. నెదర్లాండ్స్‌, శ్రీలంకపై విజయాలు సాధించింది. అయితే, టీమ్‌ఇండియాతో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన పాక్‌ లయ తప్పింది. హోరాహోరీ తప్పదనుకున్న మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములను చవిచూసింది. భారత్‌తో మ్యాచ్‌ అనంతరం తమ ఓటమికి పాక్‌ డైరెక్టర్‌ మికీ ఆర్థర్‌ ‘‘మాకు మైదానంలో సరైన మద్దతు లేదు. ఐసీసీ ఈవెంట్‌లా కాకుండా ద్వైపాక్షిక సిరీస్‌లా ఉంది’’ అని అన్నాడు. మికీ మాటలు జట్టు కండిషన్‌ను తెలిపేలా ఉన్నాయంటూ సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇలాంటి విషయాలు కాకుండా.. టోర్నీపై దృష్టిపెట్టాలని పాక్‌ మాజీలే అతనికి సూచనలు చేశారు.

బ్యాటింగ్‌లో దూకుడు ఎక్కడ?

ఒకరిద్దరు బ్యాటర్లు రాణిస్తే మ్యాచ్‌లు గెలవగలరు. మొత్తం బ్యాటర్లు ఆడితేనే కప్పులు గెలవగలం అంటారు. ఈ విషయంలోనూ పాక్‌ బాగా వెనుకబడింది. ప్రతి మ్యాచ్‌లో ఒకరో, ఇద్దరో ఆడటం మనం చూశాం. అంతేకాదు ఆడనివాళ్లను జట్టులో కొనసాగించి ఏకంగా ఫైనల్‌ జట్టు ఎంపిక విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేనట్లున్నాయి అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎంతో నమ్మకం పెట్టుకున్న ఇమామ్‌ పరుగులు చేయలేకపోతున్నా కొనసాగించారు. తీవ్ర విమర్శలు వచ్చాక కానీ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ అతడిని పక్కన పెట్టలేదు.

అతని స్థానంలో వచ్చిన ఫకర్ జమాన్‌ భారీ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. దీంతో అతణ్ని బెంచ్‌కి పరిమితం చేయడం ఎంత తప్పో తెలుసుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. యువకులు సౌద్‌ షకీల్, అబ్దుల్లా షఫీక్‌ పరిణతితో ఆడి మెప్పించారు. అయితే మహమ్మద్ రిజ్వాన్, బాబర్‌ అజామ్‌ అర్ధశతకాలపై తప్ప మ్యాచ్‌లపై దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. భారీ హిట్టర్‌గా పేరున్న ఇఫ్తికార్ అహ్మద్ కూడా కొన్ని షాట్లకే పరిమితమయ్యాడు. 

గాయాల బెడద.. ఫిట్‌నెస్‌ ఎక్కడ?

‘‘ఒక్కొక్కరు 8 కేజీల మటన్‌ తినేట్టు ఉన్నారు. ఫిట్‌నెస్‌ ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం కావడం లేదు. మైదానంలో చురుగ్గా కదలడంలో ఘోరంగా విఫలమయ్యారు’’  - వసీమ్‌ అక్రమ్ చేసిన కామెంట్‌ ఇది. పాకిస్థాన్‌ ఆటగాళ్ల ఫామ్‌పై వాస్తవ పరిస్థితి చెప్పడానికి ఈ మాట ఒక్కటి చాలు. మైదానంలో చురుగ్గా కదలాల్సిన ఫీల్డర్లు ఆ ఆలోచనే మరిచిపోయారు అనేలా వసీమ్‌ ఆ మాటలన్నాడు. అతనన్నట్లే క్యాచ్‌ల విషయంలో, బౌండరీలు ఆపే విషయంలో ఎక్కడ ఒంటికి దెబ్బ తగులుతుందో అనేలా కొంతమంది ఫీల్డర్లు ప్రవర్తించారు. ఇక ప్రపంచకప్‌ మెగా సంగ్రామం ముందు ఆటగాళ్ల గాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనే మినిమిమ్‌ పాయింట్‌ను కూడా పాకిస్థాన్‌ మేనేజ్‌మెంట్ పక్కనపెట్టేసిందనే విమర్శలు కూడా వినిపించాయి. 

బాబర్‌ కెప్టెన్సీపై..

వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నాసరే.. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొని జట్టును ముందుకు నడిపించే బాధ్యత కెప్టెన్‌దే. బౌలర్‌ లేదా బ్యాటర్‌ అయినా సరే మంచి ప్రదర్శన ఇచ్చి సహచరుల్లోనూ ఆత్మవిశ్వాసం కల్పించాలి. ఇప్పటి వరకు టీమ్‌ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ చేసిందిందే. కానీ, బాబర్‌ అజామ్‌ విషయంలో రివర్స్‌ అయిపోయింది. కొన్ని అర్ధశతకాలు సాధించినా సెంచరీలు చేయలేకపోయాడు. అలాగే జట్టుకు బాగా అవసరం అయినప్పుడు అతని నుంచి పరుగులు రాలేదు.

ఇక బౌలింగ్‌ వనరులను వినియోగించుకున్న తీరు కూడా విమర్శలకు తావిచ్చింది. హారిస్ రవూఫ్‌ను తొలి పవర్‌ప్లే చివర్లో బౌలింగ్‌కు తీసుకురావడంతో బ్యాటర్లు దూకుడుగా ఆడి భారీగా పరుగులు రాబట్టేశారు. దీంతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఆ ప్రభావం మిగతా ఓవర్లపై పడింది. ఇక స్పిన్నర్ షాదాబ్‌ ఖాన్‌ విఫలమైనప్పటికీ అతన్ని అధిక మ్యాచుల్లో ఆడించాడు. కెప్టెన్సీలో దూకుడు లేకపోతే ఎలా ఉంటుందో బాబర్‌ను చూస్తే ఈజీగా అర్థమవుతుంది అనే కామెంట్స్‌ కూడా వినిపించాయి. 

ఇతరులపై అక్కసు..!

‘‘ఈ వరల్డ్‌ కప్‌లో భారత్ గెలవడానికి విభిన్న బంతులను వాడుతున్నారు. డీఆర్‌ఎస్‌ ట్యాంపరింగ్‌ కూడా జరిగింది’’ అంటూ పాక్‌ మాజీ ఆటగాడు హసన్‌ రజా టీమ్‌ఇండియాపై అక్కసు వెళ్లగక్కాడు. ఆ మాటలకు మన మాజీలే కాదు.. మహమ్మద్ షమీ కూడా బదులిచ్చాడు. ‘‘వసీమ్‌ అక్రమ్‌ వివరంగా చెప్పినా మీకు అర్థం కావడం లేదా? మొదట ఆటపై దృష్టిపెట్టండి. మీ క్రికెట్‌ స్టార్‌పైనే మీకు నమ్మకం లేదా?’’ అని షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి పాక్‌కు ఇది కొత్తేం కాదు. గతంలో కూడా పెద్ద టోర్నీల్లో ఓడినా, భారత్‌ చేతిలో ఓడినా ఇలానే అనేవారు. కాలంతోపాటు మారాల్సిన ఆ మాజీలు... అక్కడే ఆగిపోయారు. 

పెద్దలు చెబితే వినొచ్చుగా...

ఇతర జట్లను తిట్టే కొంత మంది మాజీల మాటలే జట్టు యాజమాన్యం వింటుందనిపిస్తోంది. అయితే.. నిర్మాణాత్మకంగా సూచనలు చేసే దిగ్గజాల మాటలను పెడచెవిన పెడుతున్నట్లు కనిపిస్తోంది. లోటుపాట్లన్నీ తమ జట్టులో పెట్టుకుని ఇతరులపై అక్కసు వెళ్లగక్కడం పాకిస్థాన్‌ మాజీల్లో కొందరికి అలవాటుగా మారిపోయింది. పరిస్థితులను చక్కదిద్దుకొని విమర్శలు చేయాలని స్వయంగా ఆ జట్టు దిగ్గజాలు చెబుతున్నా వినాలనే ఆలోచన మేనేజ్‌మెంట్‌కు ఉండదు. ఎంతలా అంటే... ‘‘సెమీస్‌కు చేరుకోవాలంటే ప్రత్యర్థి ఆటగాళ్లను మైదానంలోకి దిగనీయకుండా రూమ్‌లోనే లాక్‌ చేయండి’’ అని - పాక్‌ మాజీ క్రికెటర్లు వసీమ్‌ అక్రమ్‌, మిస్బా ఉల్ హక్ అన్నారు అంటే జట్టు ప్రదర్శన పట్ల మాజీలు ఎంత చిరాకుతో ఉన్నారు చెప్పొచ్చు. అయితే వీటిని వినకుండా ఇతర జట్లను తిట్టే ఆ కొందరి మాజీల మాటలే పాక్‌ మేనేజ్‌మెంట్‌కు ఇష్టంగా మారాయని పలువురు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు