ODI WC 2023: బాంబులా పేలుతూ.. రాకెట్‌లా సాగుతూ.. ప్రపంచకప్‌లో ఆటగాళ్ల మెరుపులు

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) కొందరు ఆటగాళ్ల ప్రదర్శన దీపావళి టపాసుల్లా అదరగొట్టేస్తోంది. 

Updated : 16 Nov 2023 15:06 IST

ఒకరేమో థౌజండ్‌ వాలాలా పరుగుల వరద పారిస్తున్నాడు. నిలకడగా రాణిస్తూ పరుగుల మోత మోగిస్తున్నాడు. మరొకరేమో రాకెట్‌ లాంటి బంతులతో వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. స్టంప్స్‌ను ఎగరగొడుతున్నాడు. ఆ స్పిన్నరేమో బంతిని భూచక్రంలా తిప్పుతూ.. బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నాడు. ఆ విధ్వంసక ఆటగాడు ఒక్కసారిగా లక్మీబాంబులా పేలాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో నలుదిక్కులూ పిక్కటిల్లేలా సంచలనం సృష్టించాడు. మరో ఓపెనర్‌ తారజువ్వలా పరుగుల వెలుగులు పంచుతూనే ఉన్నాడు. ఇవన్నీ బాణాసంచా వెలుగుల్లాగా.. ఈ ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఆటగాళ్లు సాగిస్తున్న మెరుపులు. లీగ్‌ దశ ముగిసిన నేపథ్యంలో వారి ఆట ఎలా సాగిందో తెలుసుకుందామా..

కోహ్లి థౌజండ్‌ వాలా

అతనికి అలుపు లేదు. ఎన్ని పరుగులు చేసినా అలసట రాదు. ఆ పరుగుల ఆకలి తీరదు. థౌజండ్‌ వాలాలా ప్రపంచకప్‌లో నిలకడగా పరుగుల మోత మోగిస్తూనే ఉన్నాడు కింగ్‌ కోహ్లి. ఫామ్‌ లేదు.. తన పనైపోయిందనే విమర్శలకు.. మెల్లగా మొదలై ఎక్కువ సేపు పేలే థౌజండ్‌ వాలాలా సమాధానమిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో 99 సగటుతో 594 పరుగులు సాధించాడు. రెండు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై శతకంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌ (49) సరసన చేరాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో, సాధికారిక ఇన్నింగ్స్‌తో సాగుతున్న కోహ్లి.. దేశానికి ప్రపంచకప్‌ అందించేంతవరకూ ఇలా పేలుతూనే ఉండాలన్నది అభిమానుల ఆకాంక్ష. 

షమి రాకెట్‌

ఆలస్యంగా జట్టులోకి వచ్చాడు. కానీ.. అంటించడమే తరువాయి ఇక దూసుకెళ్లే రాకెట్‌లా షమి వికెట్ల వేటలో సాగిపోతున్నాడు. అతని బుల్లెట్‌ బంతులకు బ్యాటర్ల దగ్గర సమాధానమే ఉండటం లేదు. ఆ రాకెట్‌కు తిరుగే లేదు. ఇప్పటికీ 5 మ్యాచ్‌లు ఆడిన షమి ఏకంగా 16 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లోనే బలమైన న్యూజిలాండ్‌పై అయిదు వికెట్ల ప్రదర్శన చేసిన షమి.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌పై 4 వికెట్లు పడగొట్టాడు. మళ్లీ శ్రీలంకపై మరోసారి అయిదు వికెట్లు సాధించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కసితో బౌలింగ్‌ చేస్తున్న షమి నిలకడగా రాణిస్తున్నాడు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులేస్తూ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. షమిని ఎదుర్కోవడం బ్యాటర్లకు విషమ పరీక్షగా మారింది. షమి ఇలాగే రాకెట్‌లా దూసుకెళ్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. 

జంపా భూచక్రంలా

వరుసగా రెండు ఓటములతో ప్రపంచకప్‌ను మొదలెట్టింది ఆస్ట్రేలియా. కానీ ఇప్పుడు వరుసగా ఏడు విజయాలతో సెమీస్‌లో చోటు. ఆ జట్టు సంచలన విజయం వెనుక స్పిన్నర్‌ జంపాది కీలక పాత్ర. 9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసిన ఈ స్పిన్నర్‌.. ప్రస్తుతం అత్యధిక వికెట్ల వీరుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. భూచక్రంలా తిరుగుతూ వచ్చే అతని బంతులకు.. బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోతోంది. అతని స్పిన్‌కు మేటి బ్యాటర్లు సైతం దాసోహమంటున్నారు. తన లెగ్‌స్పిన్‌తో శ్రీలంక, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై నాలుగు వికెట్ల చొప్పున.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌పై మూడేసి వికెట్లు సాధించాడు. భారత్‌లోని స్పిన్‌ అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఆసీస్‌కు వికెట్ల వెలుగు అందిస్తున్నాడు. 

మ్యాక్సీ బాంబులా

ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఒక్కసారిగా లక్ష్మి బాంబులా పేలాడు. నెదర్లాండ్స్‌పై ఓ సెంచరీ చేసినప్పటికీ.. అఫ్గానిస్థాన్‌తో పోరుకు ముందువరకూ అతని ప్రదర్శన మరీ గొప్పగా ఏమీ లేదు. కానీ అఫ్గాన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. చరిత్రలో రీసౌండ్‌ వచ్చేలా.. ప్రపంచం మొత్తం వినిపించేలా ఢాం అని పేలాడు. అజేయ ద్విశతకంతో వన్డే క్రికెట్లోనే మేటి ఇన్నింగ్స్‌తో అలరించాడు. నిలబడేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నా.. ఒంటికాలితో మరీ క్రీజులో కుదురుకుని సిక్సర్లు సాధించాడు. 201 పరుగులతో చివరి వరకూ నిలబడి జట్టును గెలిపించే మైదానం వీడాడు. జట్టును ఓటమి కోరల్లోంచి రక్షించాడు. మ్యాక్సీ ఇప్పటివరకూ 7 మ్యాచ్‌ల్లో 79.40 సగటుతో 397 పరుగులు చేశాడు. 

డికాక్‌ తారజువ్వలా

తారజువ్వలా దక్షిణాఫ్రికాకు పరుగుల వెలుగులు పంచుతూనే ఉన్నాడు ఓపెనర్‌ డికాక్‌. ఈ ప్రపంచకప్‌ తర్వాత వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన అతను.. చివరిసారిగా రెచ్చిపోతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 591 పరుగులతో అత్యధిక పరుగుల బ్యాటర్ల జాబితాలో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై సెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్‌పై ఏకంగా 174 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రత్యర్థి ఏదైనా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఈ సారి పెద్దగా అంచనాలు లేకుండానే బరిలో దిగిన సఫారీ జట్టు సెమీస్‌ చేరడంలో అతనిదే ప్రధాన పాత్ర. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని