Modi-Pieterson: మోదీజీ..! మిమ్మల్ని కలవాలనుకుంటున్నా: పీటర్సన్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. భారత్‌ పట్ల తనకు...

Updated : 25 Jan 2024 12:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. భారత్‌ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని గుర్తించి లేఖ రాసినందుకు ప్రధానికి అతడు ధన్యవాదాలు తెలిపాడు. భారత్‌ని ప్రపంచ శక్తి కేంద్రమని అభివర్ణించాడు.

‘‘ప్రియమైన నరేంద్ర మోదీ.. భారత్‌ పట్ల నాకున్న అభిమానాన్ని గుర్తించి లేఖ రాసినందుకు ధన్యవాదాలు. 2003లో తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి.. ప్రతి పర్యటనలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ భారత్‌పై ప్రేమ మరింత పెరుగుతోంది. త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇటీవల ఓ సందర్భంలో భారత్‌లో మీకు బాగా ఇష్టమైంది ఏంటని కొందరు అడిగారు. నేను మరో ఆలోచన లేకుండా ‘భారత ప్రజలు’ అని సమాధానమిచ్చాను. భారత్‌ గొప్పదేశం. ప్రపంచానికే శక్తి కేంద్రం. వన్య ప్రాణులను సంరక్షించడంలో గ్లోబల్ లీడర్‌గా వ్యవహరిస్తున్న భారత్‌కి ధన్యవాదాలు’’ అని పీటర్సన్‌ ట్వీట్‌ చేశాడు.

ఇటీవల ప్రధాని మోదీ రాసిన లేఖలో పీటర్సన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘క్రికెటర్‌గా మీరు మైదానంలో ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ మా అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి. భారత అభిమానులతో మీకున్న అనుబంధం చాలా గొప్పది. మీరు హిందీలో చేసిన ట్వీట్లను చదివి నేను కూడా చాలా సంతోషించాను. ఇంగ్లాండ్‌కి భారత్‌తో ఎన్నో సామాజిక, ఆర్థిక సంబంధాలున్నాయి. భవిష్యత్తులో అవి మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నాను’ అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెస్టిండీస్‌ క్రికెట్ దిగ్గజం క్రిస్‌గేల్‌కు, దక్షిణాఫ్రికా ఆటగాడు జాంటీ రోడ్స్‌కు కూడా మోదీ లేఖ రాసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని