ODI WC 2023: ఆటగాళ్లకు గాయాలు.. జట్లకు భయాలు

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) సాగుతున్న కొద్దీ కొన్ని జట్లలోని కీలక ఆటగాళ్లు గాయపడతుండటం ఆందోళన కలిగిస్తోంది. మ్యాచ్‌ల ఫలితాల కంటే కూడా ఆటగాళ్ల గాయాలు ఆయా జట్లకు ముందే ఇబ్బందిగా మారే పరిస్థితి నెలకొంది.

Updated : 20 Oct 2023 15:15 IST

ప్రపంచకప్‌లో గాయాల దెబ్బ

భారత్‌ ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్‌ ఊపందుకుంది. మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. మెగా టోర్నీ రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి పెద్ద జట్లు ఓటములతో వెనుకబడటం.. పసికూనలు అఫ్తానిస్థాన్, నెదర్లాండ్స్‌ సంచలన విజయాలతో సెమీస్‌ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రతి జట్టూ ప్రతి మ్యాచ్‌నూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అయితే ముందు ప్రత్యర్థి కంటే కూడా ఆయా జట్లను మరో విషయం భయపెడుతోంది. అదే తమ ఆటగాళ్ల గాయాలు. ప్రపంచకప్‌ సాగుతున్న కొద్దీ కొన్ని జట్లలోని కీలక ఆటగాళ్లు గాయపడతుండటం ఆందోళన కలిగిస్తోంది. మ్యాచ్‌ల ఫలితాల కంటే కూడా ఆటగాళ్ల గాయాలు ఆయా జట్లకు ముందే ప్రతికూలంగా మారుతున్నాయని చెప్పొచ్చు. మ్యాచ్‌లు సాగుతున్న కొద్దీ పరిస్థితులు మరింత తీవ్రతరమవుతాయి. అప్పుడు ప్రతి చిన్న విషయం కూడా జట్లపై ప్రభావం చూపుతుంది. ఆ పరంగా చూసుకుంటే ఆటగాళ్ల గాయాలు ఆయా జట్లకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంది. 

హార్దిక్‌ లేకుంటే.. 

ప్రపంచకప్‌లో గాయాల బారిన పడుతున్న ఆటగాళ్ల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయానికి గురి కావడం షాక్‌ అనే చెప్పాలి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తన బౌలింగ్‌లోనే బంతిని ఆపే ప్రయత్నంలో అతని కుడి కాలు చీలమండకు గాయమైంది. జట్టులో ఎంతో కీలకమైన అతని గాయం జట్టుపై తీవ్ర ప్రభావం చూపే ఆస్కారముంది. ప్రపంచకప్‌ కోసం 15 మందితో ప్రకటించిన భారత జట్టులో హార్దిక్‌ ఒక్కడే పేస్‌ ఆల్‌రౌండర్‌. శార్దూల్‌ ఉన్నప్పటికీ అతణ్ని బౌలర్‌గానే పరిగణించారు. కానీ టోర్నీ ఆరంభమయ్యాక శార్దూల్‌ పేలవ బౌలింగ్‌తో నిరాశపరుస్తున్నాడు. దీంతో అయిదో బౌలర్‌ భారాన్ని హార్దిక్‌ మోస్తున్నాడు. మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్, పేస్, బౌన్స్‌తో వికెట్లు రాబడుతున్నాడు. పరుగులూ కట్టడి చేస్తున్నాడు. వెన్నెముక శస్త్రచికిత్స నుంచి కోలుకున్న తర్వాత తిరిగి లయ అందుకునేందుకు హార్దిక్‌కు చాలా సమయమే పట్టింది. 2022 ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంతో హార్దిక్‌ దశ తిరిగిందనే చెప్పాలి. అప్పటి నుంచి మళ్లీ ఆల్‌రౌండర్‌గా తన అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో అతని రికార్డూ గొప్పగా ఉంది. 2023లో ఇప్పటివరకూ 20 వన్డేల్లో 21 వికెట్లు పడగొట్టాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 383 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లో కలిపి అయిదు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్‌ ఉంటే జట్టు కూర్పు కూడా సరిగ్గా ఉంటుంది. అతని వల్ల బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లోనూ జట్టుకు అదనపు అవకాశాలు అందుబాటులో ఉంటాయి. పైగా జట్టుకు హార్దిక్‌ వైస్‌ కెప్టెన్‌ కూడా. ఇలాంటి ఆటగాడు దూరమైతే అది జట్టు లయను దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్దిక్‌ గాయం పెద్దదేమీ కాదన్న రోహిత్‌ శర్మ మాటల ప్రకారం అతను త్వరగా కోలుకుని జట్టులోకి రావాలన్నది అభిమానుల ఆకాంక్ష. 

జాబితాలో వీళ్లూ..

మరోవైపు కీలక ఆటగాళ్ల గాయాలు వివిధ జట్లనూ కలవరపెడుతున్నాయి. బంగ్లాదేశ్‌కు కొండంత అండ, మేటి ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ గాయం కారణంగా డగౌట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో షకిబ్‌కు ఎడమ తొడ కండరాల గాయమైంది. దీని నుంచి కోలుకోలేని అతను.. భారత్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ గాయాలతో సహవాసం చేస్తున్నాడనే చెప్పాలి. ఈ ఏడాది ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లోనే గాయపడ్డ అతను.. శస్త్రచికిత్స నుంచి కోలుకున్నాడు. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో విలియమ్సన్‌ ఆడలేదు. ఏడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడాడు. అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కానీ ఫీల్డర్‌ విసిరిన బంతి బొటనవేలికి తాకడంతో గాయంతో మధ్యలోనే మైదానం వీడాడు. బొటనవేలు విరగడంతో కోలుకునేందుకు అతనికి సమయం పడుతోంది. అందుకే అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. మరికొన్ని మ్యాచ్‌ల్లోనూ అతనాడే అవకాశాలు లేనట్లే. ఇక శ్రీలంక కెప్టెన్‌ శానక ఉప్పల్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీని నుంచి కోలుకోవడానికి మూడు వారాలు పట్టే అవకాశం ఉండటంతో స్వదేశం వెళ్లిపోయాడు. ఇంగ్లాండ్‌తో కలిసి సాగుతున్న బెన్‌ స్టోక్స్‌ తుంటి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో స్టోక్స్‌ ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. శనివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో స్టోక్స్‌ ఆడే అవకాశాలున్నాయి. మోకాలి గాయంతో బాధపడుతున్న పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ కోలుకునేందుకు మరో వారం పట్టేలా ఉంది. 

- ఈనాడు క్రీడా విభాగం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని