IND Vs PAK: ఇరుదేశాల ఆటగాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలి: పాక్‌ పేసర్‌

భారత్‌- పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఒకరి దేశంలో మరొకరు పర్యటించడం వల్ల మేలు జరుగుతుందని పాక్‌ పేసర్‌ మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అన్నాడు. 

Updated : 05 Dec 2022 12:27 IST

కరాచీ: వచ్చే ఏడాది ఆసియా కప్‌ (Asia cup 2023) నేపథ్యంలో పాకిస్థాన్‌లో టీమ్‌ఇండియా(Team India) పర్యటనపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా పాక్‌ మాజీ పేసర్‌ మహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఈ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరుదేశాల ఆటగాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ సూచించాడు. ఇలాంటి పర్యటనలు(IND Vs PAK) రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలను బలపరుస్తాయన్నాడు. ఇక ఈ విషయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు.

‘‘నేను ఈ విషయంపై ఇదివరకు కూడా స్పందించాను. క్రికెటర్లు రాజకీయాలకు దూరంగా ఉండాలి. పాకిస్థాన్‌, భారత జట్లు ఒకరి దేశాల్లో ఒకరు పర్యటించాలి. ఇది ఇరు దేశాల ప్రజల మధ్య ప్రేమను పెంచుతుంది. రాజకీయాలకు అతీతంగా ఈ క్రీడను చూడాలి. ‘‘పాక్‌ భారత్‌లో పర్యటించదు’’ అంటూ వ్యాఖ్యానించడం మాని  బోర్డు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం’’ అంటూ తెలిపాడు. ఇదే సమయంలో టీమ్‌ఇండియా బౌలర్లు, బీసీసీఐని ఈ ఆటగాడు ప్రశంసించాడు. 

‘‘టీమ్‌ఇండియాను గెలిపించడానికి వారి దగ్గర 140 కి.మీ వేగాన్ని మించగల పేసర్లు ఉన్నారు. ఆ వేగాన్ని అలాగే కొనసాగించడం చాలా కష్టం. కోచ్‌, సిబ్బంది సహకారం, నిర్దిష్టమైన డైట్‌ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. ఉమ్రాన్‌ మాలిక్‌(umran malik), అర్ష్‌దీప్‌(Arshdeep) లాంటి బౌలర్లను టీమ్‌ఇండియా ఎంచుకుంది. భవిష్యత్తు క్రికెట్‌ కోసం వారిని తయారు చేయవలసి ఉంది’’ అంటూ వివరించాడు. 10-ఓవర్ల ఫార్మాట్‌పై మాట్లాడుతూ.. ఇది బౌలర్ల నైపుణ్యాలకు పరీక్ష పెడుతుందని.. ప్రేక్షకులను అలరిస్తుందన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని