IPL 2023 PlayOff: ఐపీఎల్‌ 2023.. ప్లేఆఫ్స్‌కు చేరే ఆ నాలుగు జట్లు ఏవి..?

ఐపీఎల్‌లో (IPL 2023) ప్లేఆఫ్స్‌కు చేరే జట్లేవో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే, రెండు జట్లకు అవకాశాలు మెండుగా ఉండగా.. మిగతా రెండు స్థానాల కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా నాలుగు జట్లే ముందు వరుసలో నిలిచాయి.

Updated : 11 May 2023 18:54 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 2023 (IPL 2023) సీజన్‌లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరాయి. మరో 15 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌ -4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయి. ఆరంభంలో కాస్త నెమ్మదిగా సాగిన మ్యాచ్‌లు.. ప్రస్తుతం మరింత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పది జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు ఆయా జట్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.. 

  1. గుజరాత్ టైటాన్స్‌ (GT): డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌దే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానం. ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో కొనసాగుతోంది. చివరి మూడు మ్యాచుల్లో ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లతో గుజరాత్ తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లోనూ ఓడినా గుజరాత్‌కు పెద్దగా సమస్య ఉండదు. అయితే, తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్‌ 1లో ఓడిన జట్టు... ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్‌ 2 ఆడుతుంది. అలా తొలి రెండు స్థానాల్లోని జట్లకు రెండో అవకాశం కూడా ఉంటుంది. అందుకైనా గుజరాత్ అగ్రస్థానంలో ఉండేందుకు మొగ్గు చూపుతుంది. 
  2. చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK): ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానం చెన్నైదే.. ఇంకా రెండు మ్యాచులను మాత్రమే ఆడనుంది. 12 మ్యాచుల్లో ఏడు విజయాలు, నాలుగు ఓటములు, ఒక రద్దుతో ప్రస్తుతం చెన్నై ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్‌తోనే చెన్నై తలపడాల్సి ఉంది.  లఖ్‌నవూతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం.. పంజాబ్‌ చేతిలో చివరి బంతికి ఓడిపోవడం సీఎస్‌కేకు ఇబ్బంది అయింది. లేకపోతే ఈపాటికే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకొనే అవకాశం ఉంది. యువ బౌలర్లతో అద్భుతంగా ఫలితాలను రాబడుతున్న ఎంఎస్ ధోనీ ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. 
  3. ముంబయి ఇండియన్స్‌ (MI): ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఉవ్వెత్తున ఎగిసిన జట్టు ఏదైనా ఉందంటే అది రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో ఓడి మరీ పుంజుకొని ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 11 మ్యాచులు ఆడిన ముంబయి.. ఆరు విజయాలు, ఐదు ఓటములతో 12 పాయింట్లతో మూడో స్థానంలోకి దూసుకొచ్చింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌తోపాటు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో ముంబయి తలపడాల్సి ఉంది. ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్, టిమ్‌ డేవిడ్, నెహాల్ వధేరా అదరగొట్టేస్తూ ముంబయిని విజయపథంలో నడిపిస్తున్నారు. 
  4. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (LSG): దిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఐపీఎల్‌ సీజన్‌ను ప్రారంభించిన లఖ్‌నవూ.. అడపాదడపా విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో కాస్త వెనుకబడింది. మొత్తం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఐదు ఓటములు, ఒక మ్యాచ్‌ రద్దు కావడంతో లఖ్‌నవూ ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. తుదిపరి మ్యాచ్‌లో (మే 13న) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లఖ్‌నవూ తలపడనుంది. అలాగే ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తోనూ ఆడనుంది. క్వింటన్‌ డికాక్‌తోపాటు కేల్ మేయర్స్‌, పూరన్‌, స్టాయినిస్‌, ఆయుష్‌ బదోని ఫామ్‌లో ఉన్నారు. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉంటాయి. 
  5. రాజస్థాన్‌ రాయల్స్‌ (RR): గతేడాది ఫైనలిస్ట్‌... ఈసారి ఆడిన మొదటి ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి అదరగొట్టేసింది. అయితే, ఒక్కసారిగా రాజస్థాన్‌ ఓటమిబాట పట్టి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గత ఆరు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసిన రాజస్థాన్‌ ఐదింట్లో ఓడిపోవడం గమనార్హం. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సీనియర్లు ఉన్నప్పటికీ.. పరాజయాలు మాత్రం తప్పడం లేదు. ప్రస్తుతం 11 మ్యాచుల్లో కేవలం ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 పాయింట్లను మాత్రమే సాధించింది. చివరి మూడు మ్యాచుల్లో కోల్‌కతా, బెంగళూరు, పంజాబ్‌ జట్లతో తలపడనుంది. 
  6. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR): కొత్త కెప్టెన్‌ నితీశ్‌ రాణా నాయకత్వంలోని కోల్‌కతా గత రెండు మ్యాచుల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే, మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 పాయింట్లతో కొనసాగుతోంది. చివరి మూడు మ్యాచుల్లో రాజస్థాన్‌, చెన్నై, లఖ్‌నవూ వంటి పటిష్ఠమైన జట్లతో తలపడనుంది. అన్ని మ్యాచులనూ గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు  ఉంటాయి. 
  7. రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా బెంగళూరుకు పేరుంది. ఈసారి కూడానూ ముంబయి ఇండియన్స్‌ జట్టును ఓడించి మరీ టోర్నీని ఆరంభించిన బెంగళూరు.. అప్పుడప్పుడు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో కిందికి దిగజారుతూ పోయింది. ప్రస్తుతం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 పాయింట్లను సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్‌, హైదరాబాద్, గుజరాత్‌తో జరిగే మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంది. కేవలం టాప్‌ ఆర్డర్‌పైనే ఆధారపడి ఉండటం గమనార్హం. 
  8. పంజాబ్‌ కింగ్స్‌ (PBKS): కోల్‌కతాతోపాటు గతేడాది ఫైనలిస్ట్‌ రాజస్థాన్‌ను ఓడించి అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్‌ మళ్లీ తేలిపోయింది. వరుసగా రెండేసి విజయాలు, ఓటములతో పాయింట్ల పట్టికలో కిందికి దిగజారింది. ఆరంభంలో కెప్టెన్ శిఖర్ ధావన్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించాడు. కీలక సమయంలో మాత్రం సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో పంజాబ్‌కు కష్టాలు తప్పలేదు. ఆడిన 11 మ్యాచుల్లో కేవలం ఐదు విజయాలను మాత్రమే నమోదు చేసింది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. దిల్లీతో రెండు మ్యాచ్‌లు, రాజస్థాన్‌తో ఒకసారి తలపడనుంది. 
  9. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH): ప్రస్తుతం 10 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి అట్టడుగు నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. అయినా, ఇప్పటికీ సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆడాల్సిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే అప్పుడు హైదరాబాద్‌ 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వెళ్లొచ్చు. లఖ్‌నవూ, గుజరాత్‌, బెంగళూరు, ముంబయితో తలపడాల్సి ఉంది. 
  10. దిల్లీ క్యాపిటల్స్‌ (DC): వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. తర్వాత జరిగిన ఆరు మ్యాచుల్లో నాలుగు గెలిచినా ఫలితం మాత్రం శూన్యమే. ప్రస్తుతం 11 మ్యాచుల్లో 4 విజయాలు, ఏడు ఓటములతో కేవలం 8 పాయింట్లతో చివరిస్థానంలో నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యం. మిగతా మూడు మ్యాచుల్లోనూ గెలిచినా కష్టమే.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని