Quinton de Kock: వీడ్కోలు ముందు విధ్వంసం.. అదరగొడుతున్న క్వింటన్ డికాక్‌

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్‌ అదరగొడుతున్నాడు. వన్డేల్లో ఇదే తనకు చివరి ప్రపంచకప్‌ అని ముందుగానే అతను ప్రకటించాడు. ఇప్పుడు వీడ్కోలుకు ముందు విధ్వంసం కొనసాగిస్తున్నాడు. 

Updated : 31 Oct 2023 14:42 IST

ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడు శతకాలు.. అత్యధిక పరుగుల ఆటగాడూ అతనే.. కానీ అలాంటి ఆటగాడికి వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్‌ అని.. ఈ మెగా టోర్నీ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడని అనుకుంటామా? ఓపెనర్‌గా క్రీజులో అడుగుపెట్టి.. పరుగుల వరద పారిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న ఆ బ్యాటర్‌ ఈ మెగా టోర్నీ తర్వాత ఇక వన్డే ఫార్మాట్లో కనిపించడు. అతనే.. దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ (Quinton de Kock). ఈ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో సాగుతున్న అతను.. దక్షిణాఫ్రికా విజయాల్లో ప్రధాన భూమిక వహిస్తున్నాడు. కానీ ఈ 30 ఏళ్ల బ్యాటర్‌ ఈ ప్రపంచకప్‌ తర్వాత వన్డే క్రికెట్లో ఆడడు. వన్డేల్లో ఇదే తనకు చివరి ప్రపంచకప్‌ అని ముందుగానే అతను ప్రకటించాడు. ఇప్పుడు వీడ్కోలుకు ముందు విధ్వంసం కొనసాగిస్తున్నాడు. 

అదరగొడుతున్నాడు..

30 ఏళ్ల వయసు.. ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌.. ఎదురుగా ఉన్నది ఏ జట్టన్నది చూడకుండా పరుగుల వేటలో సాగుతున్నాడు డికాక్‌. కానీ కెరీర్‌ అత్యున్నత దశలోనే వన్డేలకు అతను రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నాడు. ఇప్పుడు తన వన్డే కెరీర్‌ను గొప్పగా ముగించేలా కనిపిస్తున్నాడు. చిరస్మరణీయ ప్రదర్శనలతో ప్రపంచకప్‌పై తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ సారి ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్లుగా ఆతిథ్య భారత్, 2019 విజేత ఇంగ్లాండ్‌ను ఎక్కువమంది పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ కూడా రేసులో ఉన్నాయన్నారు. టోర్నీ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా పేరు చెప్పేందుకు సందేహించారు. కానీ ఇప్పుడు సెమీస్‌కు చేరువలో ఉన్న సఫారీ జట్టు.. కప్‌కు గట్టి పోటీదారుగా మారింది. అందుకు డికాక్‌ కూడా ఓ ప్రధాన కారణం. ఈ టోర్నీలో వరుసగా తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో డికాక్‌ శతకాలు (శ్రీలంక, ఆస్ట్రేలియాపై) చేశాడు. బంగ్లాదేశ్‌పై 174 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. 6 మ్యాచ్‌ల్లో 71.83 సగటుతో 431 పరుగులు చేశాడు. మరోవైపు ఆరు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. చివరి ప్రపంచకప్‌ కావడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా.. భవిష్యత్‌ గురించి చింత లేకుండా డికాక్‌ చెలరేగిపోతున్నాడు. క్రీజులో అడుగుపెట్టడం మొదలు బాదడమే పనిగా పెట్టుకున్నాడు. మంచి ఆరంభాన్ని అందించి.. జట్టు అలవోకగా 300కు పైగా పరుగులు చేసేలా చూస్తున్నాడు. 

లీగ్‌ల కోసం.. 

రిటైర్మెంట్‌ పలికే వయసు కూడా కాదు. పైగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. పరుగులు చేయట్లేదు కాబట్టి తప్పించాలని జట్టు నుంచి ఒత్తిడి కూడా లేదు. బయట నుంచి విమర్శలు కూడా రావడం లేదు. కానీ వన్డేలకు గుడ్‌బై చెప్పాలనే డికాక్‌ నిర్ణయించుకోవడం క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2021 డిసెంబర్‌ చివర్లో ఇలాగే టెస్టు క్రికెట్‌కు 29 ఏళ్ల వయసులోనే డికాక్‌ వీడ్కోలు పలికి అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌నూ వదిలేయాలని చూస్తున్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌కూ అతను దూరమయ్యే అవకాశాలున్నాయి. అయితే వన్డేలకు వీడ్కోలు పలకడం వెనుక రెండు కారణాలున్నాయి. ఆర్థికంగా మెరుగవడం కోసం ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లు ఆడాలని డికాక్‌ నిర్ణయించుకున్నాడు. దీంతో డబ్బులు సంపాదించాలన్నది అతని లక్ష్యం. మరోవైపు వచ్చే వన్డే ప్రపంచకప్‌ 2027లో జరుగుతుంది. ఇప్పటికే వన్డేలకు ఆదరణ తగ్గుతోంది. 

ఇప్పుడు ప్రపంచకప్‌ భారత్‌లో జరుగుతోంది కాబట్టి ఈ మాత్రమైనా విజయవంతం అవుతోంది. 2027 నాటికి పరిస్థితి ఇలా మాత్రం ఉండదు. అందుకే అప్పటివరకూ వన్డేల్లో కొనసాగే ఉద్దేశం డికాక్‌కు లేదు. అందుకే ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాలి. ‘‘రిటైరవకుండా ఉండేలా డికాక్‌కు సర్దిచెప్పడం చాలా కష్టమైన పని. అతనో అద్భుతమైన ఆటగాడు. కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాకు కీలక ఆటగాడు. అతను రిటైర్మెంట్‌ చెబుతానంటేనే నిరాశ కలుగుతోంది’’ అని సఫారీ ఆటగాడు క్లాసెన్‌ చెప్పాడు. క్లాసెన్‌ అనే కాదు ఆ జట్టులోని ఆటగాళ్లందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ డికాక్‌ మాత్రం మనసు మార్చుకునేలా కనిపించడం లేదు. చివరి ప్రపంచకప్‌లో అతను ఇదే జోరుతో సాగి మరిన్ని రికార్డులు ఖాతాలో వేసుకోవడంతో పాటు జట్టుకు కప్‌ అందించి సంతృప్తితో వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని