Lucknow Vs Chennai: చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా

లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది.

Published : 20 Apr 2024 11:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ఏకనా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై లఖ్‌నవూ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఇరు జట్ల సారథులకూ జరిమానా పడటం గమనార్హం. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కేఎల్ రాహుల్ (KL Rahul), రుతురాజ్‌ గైక్వాడ్‌కు (Ruturaj Gaikwad) ఫైన్‌ విధించినట్లు ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. తొలిసారి కాబట్టి ఇద్దరికి చెరో రూ.12 లక్షల జరిమానా విధించినట్లు ప్రకటన జారీ చేసింది. మళ్లీ ఇలాంటి తప్పిదానికి పాల్పడితే ఫైన్‌ రెట్టింపు కానుంది.

ధోనీ క్రీజ్‌లోకి వస్తుంటే.. బౌలర్లపై ఒత్తిడి తప్పదు: కేఎల్

‘‘మేం తీసుకున్న చాలా నిర్ణయాలు అనుకూలంగా వచ్చాయి. పిచ్‌ను బట్టి మార్పులు చేసుకుంటూ విజయం సాధించాం. మా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మ్యాచ్‌ సగం ముగిసిన తర్వాత 160 లోపే చెన్నైని కట్టడి చేస్తామని అనుకున్నా. ధోనీ క్రీజ్‌లోకి వస్తుంటే.. ఎలాంటి బౌలర్‌కైనా ఒత్తిడి కలగడం సహజమే. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడతాడు. ప్రేక్షకుల నినాదాలతో మా యువ బౌలర్లు కాస్త ఆందోళనకు గురై ఉంటారు. దాంతో మేం అనుకున్న దానికంటే అదనంగా 20 పరుగులు చెన్నై రాబట్టింది. లక్ష్య ఛేదనలో మరింత దూకుడుగా వెళ్లాలనుకోలేదు. పిచ్‌ కాస్త కఠినంగానే ఉంది. చెన్నై స్పిన్నర్లు మాపై ఒత్తిడి పెంచుతారని భావించాం. దాంతో వారిని జాగ్రత్తగా కాచుకుని ఆడాం. క్వింటన్ డికాక్‌ ఓ వైపు క్రీజ్‌లో కుదురుకున్నాడు. దాంతో మా పని చాలా తేలికైంది. మినీ చెన్నైలా మారిన స్టేడియంలో ఆడటం అద్భుతంగా అనిపించింది’’ అని లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. 

మిడిల్‌ ఓవర్లలో వెనుకబడ్డాం: రుతురాజ్‌

‘‘ఆరంభం బాగానే ఉన్నా.. మిడిల్‌ ఓవర్లలో బ్యాటింగ్‌లో పరుగులు చేయలేకపోయాం. అక్కడే వెనుకబడిపోయాం. చివర్లో దూకుడుగా ఆడటంతో మెరుగైన స్కోరును సాధించగలిగాం. మరో 15 పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మంచు ప్రభావం కూడా బౌలింగ్‌ సమయంలో మమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టింది. ఇక్కడ 190 స్కోరు కాపాడుకోవచ్చు. కొన్ని అంశాలపై వర్కౌట్ చేసి చెపాక్‌ మైదానంలో అడుగు పెడతాం. వచ్చే మ్యాచుల్లో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అని రుతురాజ్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని