IND vs AUS: ఆసీస్‌తో నాలుగో టెస్టు.. శ్రీకర్‌ భరత్‌కు మద్దతుగా నిలిచిన ద్రవిడ్‌

బోర్డర్‌ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) ఆసీస్‌తో కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో తలపడేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. అయితే తుది జట్టు ఎలా ఉంటుందనే సందిగ్ధత నెలకొంది. 

Published : 08 Mar 2023 10:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ (KS Bharat) ప్రస్తుతం ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో (IND vs AUS) ఆడుతున్నాడు. అయితే గత మూడు టెస్టుల్లో 8, 6, 23*, 17, 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో నాలుగు టెస్టుకు అతడిపై వేటు తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే మరో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ అహ్మదాబాద్‌ టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. అతడి శిక్షణను టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) దగ్గరుండి పర్యవేక్షించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే టెస్టుకు తుది జట్టులో భరత్‌కు బదులు ఇషాన్ వస్తాడని అనుకుంటున్న వేళ.. రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం భరత్‌కు మద్దతుగా మాట్లాడాడు. ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో విలేకర్లు భరత్‌ ప్రదర్శనపై  ప్రశ్నకు ద్రవిడ్ సమాధానం ఇచ్చాడు. 

‘‘భరత్‌ (KS Bharat) ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదు. అతడి దృక్పథంపై మళ్లీ ప్రశ్నలు వస్తున్నాయి. సవాళ్లు, పరిస్థితులను అర్థం చేసుకొని ఆడేందుకు ప్రయత్నిస్తాడు. మూడో టెస్టులో భరత్‌ గొప్పగా రాణించనప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో అతడు చేసిన 17 పరుగులు మాత్రం చాలా కీలకం. దిల్లీలోనూ చాలా పాజిటివ్‌గా ఆడాడు. కఠినమైన పిచ్‌లపై కాస్త అదృష్టం కలిసిరావాల్సి ఉంటుంది. కానీ, భరత్‌కు అదే కలిసిరాలేదు. అయితే, అతడు ఆడే విధానం బాగుంది. అందుకే భరత్‌ బ్యాటింగ్‌పై ఆందోళన చెందకుండా మరింత దృష్టిపెడతాం’’ అని రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) మద్దతుగా నిలిచాడు. ‌

శ్రీకర్‌ భరత్‌ బ్యాటింగ్‌లో కాస్త నిరాశపరిచినప్పటికీ.. కీపింగ్ నైపుణ్యం మాత్రం ఆకట్టుకుంది. డీఆర్‌ఎస్‌లు తీసుకోవడంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నమ్మకాన్ని దక్కించుకున్నాడు. ఇక నాలుగో టెస్టు భారత్‌కు కీలకంగా మారింది. ఇందులో విజయం సాధిస్తేనే టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (WTC Final) దూసుకెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. లేకపోతే శ్రీలంక - న్యూజిలాండ్‌ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి  ఉంటుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా దాదాపు లక్ష మందికిపైగా వస్తారనే అంచనా ఉంది. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని వీక్షించేందుకు వస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని