Rahul Dravid: ఇన్నింగ్స్‌ ఇంకా ఉంది

సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎన్‌సీఏలోనే ఉంటాడు.

Updated : 30 Nov 2023 12:57 IST

ప్రధాన కోచ్‌గా కొనసాగనున్న ద్రవిడ్‌
దిల్లీ

సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎన్‌సీఏలోనే ఉంటాడు.

భారత్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడినప్పటికీ.. జట్టు అదిరే ప్రదర్శన నేపథ్యంలో ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై బీసీసీఐ విశ్వాసముంచింది. కోచ్‌గా అతడి కాంట్రాక్ట్‌ను పొడిగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. పదవీకాలం ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. ‘‘ప్రపంచకప్‌తో పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ద్రవిడ్‌తో బోర్డు ఫలవంతమైన చర్చలు జరిపింది. అతడితో పాటు సహాయ సిబ్బంది పదవీకాలాన్ని పొడిగించాలని ఏకగ్రీవంగా అంగీకరించింది’’ అని ఓ ప్రకటనలో బీసీసీఐ చెప్పింది. ద్రవిడ్‌కు బోర్డు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని కార్యదర్శి జై షా అన్నాడు. ‘‘ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రదర్శన అసాధారణం. ఫైనల్‌కు ముందు వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచింది. జట్టు గొప్ప ప్రదర్శన చేసేలా కృషి చేసిన ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రశంసార్హుడు. అతడికి మా పూర్తి మద్దతు ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో జట్టు నిలకడగా విజయాలు సాధించడానికి అవసరమైన సహకారాన్నంతా ఇస్తాం’’ అని చెప్పాడు.

‘‘టీమ్‌ఇండియాతో గత రెండేళ్లు చిరస్మరణీయం. మేము ఎన్నో ఎత్తు పల్లాలు చూశాం. ప్రయాణం ఆసాంతం జట్టులో అంతా ఒకరికొకరం గొప్పగా సహకరించుకున్నాం’’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ అనంతర దశలో జట్టును మరింత ఉత్తమంగా తీర్చిదిద్దడానికి కృషి కొనసాగుతుందని అన్నాడు. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌లకు కూడా పొడిగింపు లభించింది. ద్రవిడ్‌ బృందం పదవీకాలంపై బోర్డు ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా.. కనీసం వచ్చే ఏడాది (జూన్‌-జులై)లో వెస్టిండీస్‌, అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు వాళ్లు కొనసాగుతారని భావిస్తున్నారు. మరోవైపు కోచ్‌గా కొనసాగడానికి ద్రవిడ్‌ అంగీకరించినంద]ుకు బోర్డు అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘కోచ్‌గా ద్రవిడ్‌ నైపుణ్యానికి భారత జట్టు ప్రదర్శనే నిదర్శనం. ప్రధాన కోచ్‌గా కొనసాగేందుకు అతడు అంగీకరించినంద]ుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పాడు.

లక్ష్మణ్‌ అక్కడే..: ద్రవిడ్‌ వైదొలిగితే ప్రధాన కోచ్‌గా అతడి స్థానాన్ని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) అధిపతి వీవీఎస్‌ లక్ష్మణ్‌ భర్తీ చేస్తాడని వార్తలొచ్చాయి. అయితే ఎన్‌సీఏ బాధ్యతలతో పాటు భారత్‌-ఏ, అండర్‌-19 జట్లతో పని చేయడమే తనకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుందని బీసీసీఐ పెద్దలకు లక్ష్మణ్‌ తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు ఎన్‌సీఏ అధిపతిగా కొనసాగనున్నాడు. ఎన్‌సీఏ అధిపతిగా, తాత్కాలిక ప్రధాన కోచ్‌గా తన విధులను లక్ష్మణ్‌ గొప్పగా నిర్వర్తించాడని ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది.

‘‘డ్రెస్సింగ్‌రూమ్‌లో మేం నెలకొల్పిన సంస్కృతికి నేను గర్విస్తున్నా. ఈ సంస్కృతి జయాల్లోనూ, అపజయాల్లోనూ గట్టిగా నిలబడుతుంది. మా జట్టులో గొప్ప నైపుణ్యం, ప్రతిభ ఉన్నాయి. మేం సరైన ప్రక్రియను అనుసరించాం. సన్నాహాలకు కట్టుబడి ఉన్నాం. ఫలితంగా సత్ఫలితాలు సాధించాం’’

రాహుల్‌ ద్రవిడ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని