T20 World cup 2022: టీ20 ప్రపంచకప్‌.. వరుణుడి ఖాతాలో ‘నాలుగు’ విజయాలు..

టీ20 ప్రపంచకప్‌ కోసం 13 జట్లు పోటీ పడుతున్నాయి.. ఇదీ సూపర్ -12 దశలో పోటీల గురించి సోషల్‌ మీడియాలో పేలుతోన్న జోక్. పన్నెండు క్రికెట్‌ దేశాలు మనకు తెలుసు. మరి అదనంగా వచ్చి చేరిన జట్టు ఏదో అని తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అది నాలుగు విజయాలను నమోదు చేసేసింది. ఇవాళ (అక్టోబర్ 29) జరగాల్సిన రెండు మ్యాచ్‌లూ రద్దు కావడం గమనార్హం.

Updated : 28 Oct 2022 18:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పోటీపోటీగా బౌండరీలు.. నిప్పులు చెరిగే బంతులు.. ఉత్కంఠపోరు మ్యాచ్‌లు.. సంచలన విజయాలు.. మైదానాల్లో అరుపులు.. ఇవీ టీ20 ప్రపంచకప్‌ నుంచి అభిమానులు ఆశించినవి. అయితే ఆస్ట్రేలియా వేదికగా సాగుతోన్న పొట్టి కప్‌లో మాత్రం అదనంగా మరొక అంశం వచ్చి చేరింది.. అదే వరుణుడి గేమ్‌. సాధారణంగా టోర్నీకి ముందు జట్లకు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఉంటాయి. అలాగే వరుణుడు కూడా పక్కాగా ప్రాక్టీస్‌ చేసే వచ్చినట్లు ఉన్నాడు. ఎందుకంటే ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నుంచే ఆటగాళ్లు, అభిమానుల గుండెల్లో గుబులు రేపిన వర్షం.. కీలకమైన సూపర్‌ -12 దశలో ఇప్పటికే ‘నాలుగు’ మ్యాచుల్లో విజయం సాధించడం గమనార్హం. ఇంకెన్ని మ్యాచులకు వరుణ గండం పొంచి ఉందోనని ఆందోళన అందరిలోనూ కొనసాగుతోంది. మరి ఇప్పటి వరకు వర్షం దెబ్బకు ఏ జట్లు బాధితులుగా మారాయి.. ఏ మైదానాల్లో మ్యాచ్‌లు రద్దు అయ్యాయి..? 

మన ప్రాక్టీస్‌కు దెబ్బ..

టీ20 ప్రప్రంచకప్‌లో టీమ్‌ఇండియా ఆడటానికి ముందు న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా రద్దైంది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో మెల్‌బోర్న్‌ వేదికగా మ్యాచ్‌కు వరుణుడి గండం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో సోషల్‌ మీడియాలో మీమ్స్‌ కూడా భారీ స్థాయిలో ట్రోల్‌ అయ్యాయి. అయితే వాతావరణం అనుకూలంగా మారడంతో దాయాదుల పోరును అక్టోబర్‌ 23న వీక్షించే అవకాశం అభిమానులకు దక్కింది. ఉత్కంఠపోరులో టీమ్‌ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. 

ఒకటి జరిగి.. మరొకటి ఆగి

ప్రపంచకప్‌ అంటేనే దక్షిణాఫ్రికాకు కలిసి రాదేమో.. తాజాగా విజయం చేరువగా వచ్చి వర్షం కారణంగా ఒక్క పాయింట్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గ్రూప్‌ -2లోని  జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్య అక్టోబర్‌ 24న హోబర్ట్‌ వేదికగా మ్యాచ్‌. అంతకుముందే బంగ్లాదేశ్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ ఇక్కడే జరిగింది. అనూహ్యంగా రెండో మ్యాచ్‌కి చివర్లో వరుణుడు అడ్డంకిగా మారాడు. అయితే 9 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో జింబాబ్వేను 79/5 స్కోరుకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా.. ఛేదనను దూకుడుగా ప్రారంభించింది. తొలి ఓవర్‌లోనే డికాక్‌ దెబ్బకు జింబాబ్వే 23 పరుగులను సమర్పించింది. 

ఈ క్రమంలో వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 7 ఓవర్లకు 64 పరుగులుగా అంపైర్లు ఫిక్స్‌ చేశారు. దీంతో డికాక్‌ (47*: 18 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌) ధాటికి కేవలం మూడు ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా 51 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడం.. మ్యాచ్‌ నిర్వహించే అవకాశం లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అప్పటికీ సఫారీల జట్టు కేవలం 24 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. వరుణుడి సహకారం లేకపోవడంతో మ్యాచ్‌ రద్దు అయిపోయింది. 

అదే స్టేడియం‌.. అఫ్గాన్‌, ఇంగ్లాండ్‌కూ రెండో‘సారి’

టీ20 ఫార్మాట్‌లో సంచలనాలు నమోదు చేసే జట్టు అఫ్గానిస్థాన్‌. నాణ్యమైన స్పిన్నర్లు, బ్యాటర్లు ఆ జట్టు సొంతం. అయితే సూపర్ -12 దశలో ఇంగ్లాండ్‌పై పోరాడి ఓడింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను కట్టడి చేసేందుకు తీవ్రంగా కష్టపడింది. అయితే తర్వాత రెండు మ్యాచులూ వర్షార్పణం అయ్యాయి. అక్టోబర్ 26న న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 28న ఐర్లాండ్‌తో మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం ఆ గ్రూప్‌లో సెమీస్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసే అవకాశం ఉంది. ఈ రెండు మ్యాచ్‌లకు వేదిక మెల్‌బోర్న్‌ కావడం గమనార్హం. భారత్-పాక్‌ మ్యాచ్‌ జరిగింది కూడా ఇదే స్టేడియంలోనే. 

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కు కీలకమైన మ్యాచ్‌  వర్షం కారణంగా రద్దు అయింది. మెల్‌బోర్న్‌ వేదికగా టాస్‌ పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడంపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్‌ అయిన ఆసీస్‌కు తొలి మ్యాచ్‌లోనే కివీస్ షాక్‌ ఇచ్చింది. దాని నుంచి తేరుకొని లంకపై అద్భుత విజయం సాధించిన ఆసీస్‌.. ఇంగ్లాండ్‌పైనా గెలిచి సెమీస్‌ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావించింది. అలానే ఇంగ్లాండ్ కూడా అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసినప్పటికీ.. ఐర్లాండ్‌ చేతిలో భంగపాటు తప్పలేదు. వర్షం అంతరాయం కలిగించడంతో ఐర్లాండ్‌ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడంతో ఇంగ్లాండ్‌ ఒక్క పాయింట్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఐర్లాండ్‌కు కలిసొచ్చిన వరుణుడు

ప్రపంచకప్‌ సూపర్ - 12 దశలో తొలి సంచలనం ఐర్లాండ్‌ నమోదు చేసింది. పటిష్టమైన ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. అయితే ఆ జట్టు ఆటగాళ్ల శ్రమతోపాటు వరుణుడు అండగా నిలవడంతోనే సాధ్యమైంది. మెల్‌బోర్న్‌ వేదికగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 157 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో 14.3 ఓవర్లలో 105/5 స్కోరుతో ఉన్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి క్రీజ్‌లో మొయిన్ అలీ, లియామ్‌ లివింగ్‌స్టోన్ హిట్టర్లు ఉన్నారు. ఇంకా 33 బంతుల్లో 53 పరుగులు చేయడం ఇంగ్లాండ్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అలాగే ఐర్లాండ్‌ కూడా ఇంకో రెండు వికెట్లు తీస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వరుణుడి రాకతో.. ఫలితం డక్‌వర్త్‌  లూయిస్‌ పద్ధతి ప్రకారం ప్రకటించాల్సి వచ్చింది. అప్పటికి ఇంగ్లాండ్‌ ఐదు పరుగులు వెనుకబడి ఉంది. దీంతో 5 రన్స్‌ తేడాతో ఐర్లాండ్‌ విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. ఇలా ఐర్లాండ్‌కు వర్షం అలా కలిసొచ్చింది. 

మెల్‌బోర్న్‌.. హోబర్ట్‌

సూపర్‌ -12లో 13 మ్యాచ్‌లు జరగగా.. ఇందులో నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కాగా.. మరొక మ్యాచ్‌కు కాస్త అంతరాయ ఏర్పడినా ఫలితం తేలింది. రద్దైన మ్యాచుల్లో మూడింటికి మెల్‌బోర్న్‌ వేదిక కావడం గమనార్హం. మరొకటి హోబర్ట్‌ స్టేడియం. మెల్‌బోర్న్‌లో ఇంకా రెండు మ్యాచులు జరగాల్సి ఉంది. అందులో భారత్‌ - జింబాబ్వే మ్యాచ్‌ ఉంది. ఇదే సూపర్ -12లో చివరి మ్యాచ్‌. ఇదే వేదికగా నవంబర్ 13న ఫైనల్‌ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అయితే ఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది కాబట్టి.. ఒకవేళ సాధ్యం కానిపక్షంలో మరుసటి రోజు మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. రిజర్వ్‌ డేలోనూ ఫలితం తేలకపోతే ఫైనల్‌కు చేరిన జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వసంత కాలం నడుస్తోంది. అయితే అకాల వర్షాలు కురవడంతోనే మ్యాచ్‌లకు అంతరాయం కలుగుతోందని వాతావరణ శాఖ చెబుతోంది.

సెమీస్‌ అవకాశాలపై ప్రభావమెంత..?

టీ20 ప్రపంచకప్‌ కోసం సూపర్ -12లో ఆరేసి జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్‌ నుంచి టాప్‌ - 2 స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరుకొంటాయి. ఈ స్టేజ్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వర్ష ప్రభావం ప్రస్తుతం గ్రూప్‌ -2 కంటే గ్రూప్‌ -1పైనే ఎక్కువగా ఉన్నట్లు ఉంది. ఇప్పటి వరకు రద్దైన నాలుగు మ్యాచుల్లో మూడు గ్రూప్‌ -1 జట్లవే కావడం గమనార్హం. దీంతో సెమీస్‌ రేసు మరింత ఆసక్తికరంగా మారుతుంది. తొలి రెండు స్థానాల కోసం న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. కివీస్‌ మినహా.. మిగిలిన మూడు టీమ్‌లు మూడేసి మ్యాచులు ఆడాయి. న్యూజిలాండ్‌ రెండు మ్యాచ్‌లను మాత్రమే ఆడింది. ఇప్పటి వరకు పాయింట్లు ఇలా.. 

గ్రూప్‌ -1

* న్యూజిలాండ్‌ - 2 మ్యాచులు 3 పాయింట్లు (ఒక విజయం, ఒక మ్యాచ్‌ రద్దు)

* ఇంగ్లాండ్ - 3 మ్యాచులు 3 పాయింట్లు (ఒక విజయం, ఒక ఓటమి, ఒక రద్దు)

* ఐర్లాండ్‌ - 3 మ్యాచులు 3 పాయింట్లు (ఒక విజయం, ఒక ఓటమి, ఒక రద్దు)

* ఆస్ట్రేలియా - 3 మ్యాచ్‌లు 3 పాయింట్లు (ఒక విజయం, ఒక ఓటమి, ఒక రద్దు)

* శ్రీలంక - 2 మ్యాచులు 2 పాయింట్లు (ఒక విజయం, ఒక ఓటమి)

* అఫ్గానిస్థాన్‌ - 3 మ్యాచులు 2 పాయింట్లు (ఒక ఓటమి, రెండు మ్యాచ్‌లు రద్దు)

గ్రూప్‌ -2 

* భారత్ - 2 మ్యాచ్‌లు 4 పాయింట్లు (రెండు విజయాలు)

* దక్షిణాఫ్రికా - 2 మ్యాచ్‌లు 3 పాయింట్లు (ఒక విజయం, ఒక రద్దు)

* జింబాబ్వే - 2 మ్యాచ్‌లు 3 పాయింట్లు (ఒక విజయం, ఒక రద్దు)

* బంగ్లాదేశ్ - 2 మ్యాచ్‌లు 2 పాయింట్లు (ఒక విజయం, ఒక ఓటమి)

* పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ పాయింట్ల ఖాతా తెరవలేదు (రెండు ఓటములే)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని