Rajasthan : రాజస్థాన్‌ వెనుక కుమార వ్యూహం.. బోనస్‌గా బట్లర్‌ బీభత్సం

ఎప్పుడో మొదటి సీజన్‌లో టీ20 లీగ్‌ టైటిల్‌ను నెగ్గిన జట్టు.. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. మూడు సార్లు ప్లేఆఫ్స్‌కు...

Updated : 29 Apr 2022 10:12 IST

టీ20 లీగ్‌లో దూసుకుపోతున్న సంజూ సేన

ఇంటర్నెట్ డెస్క్‌: ఎప్పుడో మొదటి సీజన్‌లో టీ20 లీగ్‌ టైటిల్‌ను నెగ్గిన జట్టు.. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. మూడు సార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లినా టైటిల్‌ నెగ్గే దిశగా అడుగులు పడలేదు. ఇక మిగిలిన అన్నిసార్లూ లీగ్‌ దశకే పరిమితమై ఇంటిముఖం పట్టింది. అయితే ఎలాగైనా 15వ సీజన్‌ కప్‌ను సొంతం చేసుకోవాలని బరిలోకి దిగిన రాజస్థాన్‌.. ఆ దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లు ఈ జట్టునుంచే ఉండటం విశేషం. ఇక గత సీజన్‌లో అట్టడుగు నుంచి రెండో స్థానానికే పరిమితమైన రాజస్థాన్‌ జట్టులో వచ్చిన మార్పులేమిటి...? ఆటతీరులో మెరుగైన అంశాలు ఏంటనేవి తెలుసుకుందాం.. 

బ్యాటింగ్‌లో అతిపెద్ద మార్పు 

గత సీజన్‌లో ఆడిన పద్నాలుగు మ్యాచుల్లో కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించిన రాజస్థాన్‌ (10) పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అప్పట్లో బట్లర్‌, సంజూ శాంసన్‌, డేవిడ్ మిల్లర్, రియాన్‌ పరాగ్, రాహుల్‌ తెవాతియా, శివమ్‌ దూబే వంటి హార్డ్‌ హిట్టర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో బట్లర్, సంజూ శాంసన్‌, రియాన్‌ మాత్రమే ఉన్నారు. అయితే మెగా వేలానికి ముందు జోస్‌ బట్లర్‌తోపాటు సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్‌ను రాజస్థాన్‌ అట్టిపెట్టుకుంది. ఇక మెగా వేలంలో దేవదత్ పడిక్కల్‌, డారిల్ మిచెల్, హెట్‌మయేర్, వాన్‌ డస్సెన్, కరుణ్‌ నాయర్‌ వంటి బ్యాటర్లను కొనుగోలు చేసుకుంది. అయితే గత సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపని జోస్‌ బట్లర్‌ ఈసారి మాత్రం చెలరేగిపోయాడు. ఎనిమిది మ్యాచుల్లో మూడు శతకాలు, రెండు అర్ధశతకాలతో 499 పరుగులు చేశాడు. సంజూ శాంసన్‌ (255) కూడా ఫర్వాలేదు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రియాన్‌ పరాగ్ (56) అర్ధశతకం సాధించి రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

బలంగా పేస్‌ దళం.. 

బ్యాటింగ్‌ ఎంత బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్‌లో పట్టు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో గతేడాది వరకు బెంగళూరు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. దీంతో ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిధ్‌ కృష్ణ, కుల్‌దీప్‌ సేన్‌ వంటి నాణ్యమైన ఫాస్ట్‌ బౌలర్లను రాజస్థాన్‌ కొనుగోలు చేసింది. ముంబయి విజయాల్లో ఓపెనింగ్‌ బౌలింగ్‌ చేసిన బౌల్ట్‌ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు కూడానూ పేస్‌ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. వికెట్లు తీయకపోయినా బ్యాటర్లపై  ఒత్తిడి తీసుకువస్తున్నాడు. వీరే కాకుండా రిజర్వ్‌ బెంచ్‌పై నీషమ్‌, నవ్‌దీప్‌ సైని, మెకాయ్‌, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ వంటి పేసర్లూ అందుబాటులో ఉన్నారు. బెంగళూరుపై 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవలంలో సఫలీకృతం కావడానికి ప్రధాన కారణం యువ బౌలర్‌ కుల్‌దీప్‌ సేన్. అతడిపై నమ్మకముంచి అవకాశం కల్పించడమే కాకుండా డెత్‌ఓవర్లలోనూ బంతిని అందించిన సంజూ శాంసన్‌ మంచి ఫలితాలను రాబట్టాడు. ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ వ్యూహాలను మారుస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టేలా చేస్తున్నాడు. 

టాప్‌ స్పిన్‌ ద్వయం సొంతం

టీమ్‌ఇండియాలో టాప్‌ స్పిన్నర్లుగా పేరుగాంచిన రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌ను రాజస్థాన్‌ సొంతం చేసుకుని తమ స్పిన్‌ విభాగాన్ని పటిష్ఠం చేసుకుంది. ప్రస్తుతం టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు (18) తీసిన బౌలర్‌గా చాహల్‌ కొనసాగుతున్నాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను తన స్పిన్‌ మాయాజాలంతో రాజస్థాన్‌ వశమయ్యేలా చేస్తున్నాడు. కోల్‌కతాపై హ్యాట్రిక్‌తోపాటు ఐదువికెట్ల ప్రదర్శన చేసి సంచలనం సృష్టించాడు. ఇక అశ్విన్‌ 7.19 ఎకానమీతో ఏడు వికెట్లను తీశాడు. వికెట్లను తక్కువగా తీసినా పరుగులను నియంత్రించడంలో కీలకంగా మారాడు. 

అదే సారథి.. మరి మార్పు ఎక్కడ...? 

ఐదు సీజన్ల నుంచి రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజూ శాంసన్‌ గతేడాది స్టీవ్‌ స్మిత్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. గత సీజన్‌లో సారథి మారినా రాజస్థాన్‌ తలరాత మారలేదన్నట్లుగా  గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమైంది. ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి మాత్రం తొలి నుంచి ఆధిపత్య ధోరణితో పాయింట్ల పట్టికలో టాప్‌-4లో కొనసాగుతోంది. టాప్‌ ఆర్డర్‌లో ఒక్క బ్యాటరైనా నిలబడి పరుగులు సాధిస్తుండటంతో  భారీ స్కోర్లు చేయగలుగుతుంది. మరోవైపు ఓపెనర్ జోస్‌ బట్లర్‌ శతకాలు సాధిస్తూ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. గత సీజన్‌లో రెగ్యులర్‌ స్పిన్నర్లు లేకుండా బరిలోకి దిగి బోల్తాపడిన రాజస్థాన్‌ ఈ సారి మాత్రం ఆ లోటును పూరించుకుని నాణ్యమైన బౌలర్లతో రంగంలోకి దిగింది. బ్యాటర్లు, బౌలర్లు సమష్ఠిగా రాణిస్తుండటం రాజస్థాన్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారింది. 

పునాది అక్కడే..

మెగా వేలం ఇతర టాప్‌ జట్లకు ఉపయోగపడిందో లేదో కానీ రాజస్థాన్‌కు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. గత సీజన్‌లో భారీ స్కోరు చేసినా కాపాడుకోలేక బోల్తాపడింది. దీంతో ఈసారి బౌలర్లపై భారీగా ఖర్చు చేసింది. ప్రసిధ్‌ కృష్ణ (రూ. 10 కోట్లు), ట్రెంట్ బౌల్ట్‌ (రూ. 8 కోట్లు), యుజ్వేంద్ర చాహల్ (రూ. 6.50 కోట్లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (రూ. 5 కోట్లు) వంటి అగ్రశ్రేణి బౌలర్ల కోసం భారీగా వెచ్చించింది. దీని కోసం అద్భుత వ్యూహాలతో రాజస్థాన్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ కుమార సంగక్కర నేతృత్వంలోని యాజమాన్యం మెగా వేలంలో  పాల్గొంది.  ఏ ఆటగాడిని ఎలా సొంతం చేసుకోవాలనే దానిపై పక్కాగా ప్రణాళికలతో బరిలోకి దిగి విజయవంతమైంది. ఇక ఆటపరంగానూ ఇలాంటి ప్రదర్శన కొనసాగిస్తే టీ20 లీగ్‌ టైటిల్‌ను నెగ్గే జట్లలో రాజస్థాన్‌ ఒకటని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని