Rajasthan Vs Bengaluru: బట్లర్‌ శతకం.. రాజస్థాన్‌ నాలుగో విజయం

ఐపీల్‌ 2024లో రాజస్థాన్‌ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

Updated : 06 Apr 2024 23:35 IST

జైపుర్‌: ఐపీఎల్‌ 17లో రాజస్థాన్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సంజూ సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్‌కిది వరుసగా నాలుగో విజయం. ఈ సీజన్‌లో  బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (113*; 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకం బాదాడు. 184 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ నాలుగు వికెట్లు కోల్పోయి మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (0) విఫలమైనా.. మరో ఓపెనర్‌ జోస్ బట్లర్ (100*; 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివరి దాకా క్రీజులో ఉండి సిక్సర్‌ బాది సెంచరీ పూర్తిచేసుకోవడంతోపాటు మ్యాచ్‌ను ముగించాడు.

వన్‌డౌన్ బ్యాటర్ సంజు శాంసన్‌ (69; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరు బౌలర్లలో రీస్ టాప్లీ 2, యశ్‌ దయాల్, సిరాజ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీతోపాటు డుప్లెసిస్‌ (44; 33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. కోహ్లీ, డుప్లెసిస్‌ ద్వయం తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1), సౌరభ్‌ చౌహన్‌ (9) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 2, నంద్రి బర్గర్ ఒక వికెట్ పడగొట్టారు. 

మ్యాచ్‌ విశేషాలు

  • బట్లర్‌కిది వందో ఐపీఎల్ మ్యాచ్‌. అతడు తన వందో మ్యాచ్‌లో 100 సాధించడం విశేషం. 

  • ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీకిది ఎనిమిదో సెంచరీ. ఈ శతకంతో ఐపీఎల్‌లో 7500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం కోహ్లీ 7579 పరుగులతో ఉన్నాడు.
  • ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 17లో శతకం కరువు తీరిపోయింది. ఏకంగా ఇద్దరు (కోహ్లీ, బట్లర్) శతకాలు సాధించారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని